తెలుగు తెరపై సందడి చేసిన ఎంతోమంది నటీమణుల్లో సంగీత ఒకరు.. ఈమె తెలుగు, తమిళం, మలయాళం వంటి భాషల్లో ఒకానొక దశలో బిజీ హీరోయిన్‌గా పేరు దక్కించుకున్నారు. 'ఒకే ఒక్క ఛాన్స్!' అంటూ 'ఖడ్గం' చిత్రంలో ఆమె చెప్పిన డైలాగ్ ఇప్పటికీ ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోయింది. ఈ చిత్రంతోనే సంగీత హీరోయిన్‌గా పరిచయమైన సంగతి తెలిసిందే. ఆ తర్వాత 'పెళ్లాం ఊరెళితే, ఖుషి ఖుషిగా, సంక్రాంతి' వంటి చిత్రాల్లో నటించి, ఫ్యామిలీ ఆడియన్స్‌కి దగ్గరయ్యారు. తొలి ఇన్నింగ్స్‌లో మరపురాని పాత్రలెన్నో పోషించారు. ఇటీవల సెకండ్ ఇన్నింగ్స్ మొదలుపెట్టిన ఆమె ఈ 20 ఏళ్లలో తాను గమనించిన సంగతులు, సినిమా కబుర్లు, బుల్లితెర ముచ్చట్లు ఓ సందర్భంగా పంచుకున్నారు.. ఆ విశేషాలు తెలుసుకుందాం..!
ఒకప్పుడు క్రేజీ హీరోయిన్‌గా పేరు తెచ్చుకున్న సంగీత ఇప్పుడు క్యారెక్టర్ ఆర్టిస్ట్‌గా నటిస్తూ అలరిస్తున్నారు. అప్పట్లో సంగీతకు మంచి ఫాలోయింగ్ ఉండేది. ముఖ్యంగా శ్రీకాంత్ హీరోగా నటించిన 'పెళ్లాం ఊరెళ్తే' సినిమాతో ఆమెకు మంచి గుర్తింపు వచ్చింది. అలాగే కృష్ణ వంశీ దర్శకత్వంలో వచ్చిన ఖడ్గం సినిమాలో సంగీత అద్భుతమైన పాత్రలో నటించారు. ఆ మధ్య సూపర్ స్టార్ మహేష్‌బాబు నటించిన 'సరిలేరు నీకెవ్వరు' సినిమాలో రష్మిక తల్లిగా నటించి, మెప్పించారు. అలాగే రీసెంట్‌గా వచ్చిన 'వారసుడు' సినిమాలో దళపతి విజరు వదినగా కనిపించారు. ఇదిలా ఉంటే కృష్ణవంశీ 'ఖడ్గం' సినిమాలో ఆమె పాత్ర వన్ ఆఫ్ ది హైలైట్ అనే చెప్పాలి. అయితే ఆ సినిమా సమయంలో జరిగిన ఒక సంఘటనను గుర్తుచేసుకున్నారు సంగీత.
కృష్ణ వంశీకి పిచ్చా అన్నారు..
తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ఖడ్గం సినిమాలో తనకు మేకప్ మైనస్ అయ్యిందని అన్నారు. ఆ మేకప్‌లో తనిని తాను చూసుకోలేకపోయాను అన్నారు. ఆ సమయంలో నాకు మేకప్ వేసి, అన్నపూర్ణ స్టూడియోస్ గేటు దగ్గర షూటింగ్ చేశారు. షూటింగ్ అయిపోయిన తర్వాత చిత్ర యూనిట్ అంతా వచ్చి, చాలా బాగా వచ్చింది అని చెప్పారు. కానీ అక్కడ ఉన్న పబ్లిక్ మాత్రం 'కృష్ణవంశీకి పిచ్చి పట్టిందా..? ఆ అమ్మాయి హీరోయిన్ ఏంటి.?' అని అనుకున్నారు. కానీ సినిమా రిలీజ్ అయ్యి బిగ్ హిట్ అయ్యి.. తనకు మంచి పేరు తెచ్చిపెట్టిందని ఆ రోజుల్ని గుర్తు చేసుకున్నారు సంగీత.
- ఇల్లే బెస్ట్ హాలిడే స్పాట్..
ఇక పెళ్లికి ముందు సంగీతకు, పెళ్లి తర్వాత సంగీతకు తేడా ఏంటి? అనే ప్రశ్నకు ఆమె స్పందిస్తూ 'నాకు నా భర్త ఎలాంటి షరతులూ పెట్టలేదు' అని చెప్పారు. ఆ తర్వాత తనకు నిద్ర పోవడమంటే చాలా ఇష్టమని, వదిలేస్తే 24 గంటలూ నిద్రపోతూనే ఉంటానని చెప్పారు. తన బెస్ట్ హాలిడే స్పాట్ ఏంటని అడగ్గా.. తన ఇల్లే తనకు బెస్ట్ హాలిడే స్పాట్ అంటూ సమాధానం ఇచ్చారు.
- ఇష్టం లేకుండానే సినిమాల్లోకి..
'చిన్నప్పుడే నేను మంచి క్లాసికల్ డ్యాన్సర్‌ని. తర్వాత అన్నిరకాల నృత్యాలూ నేర్చుకున్నా. అయితే మరీ రెగ్యులర్‌గా డ్యాన్స్ చేయడం లేదు. అయితే డ్యాన్స్ షోలు చూస్తుంటే నాకూ మునుపటిలా నృత్యం చేయాలనే పట్టుదల పెరుగుతోంది. నాకు మొదటి నుంచీ సినిమాలంటే ఇష్టం ఉండేది కాదు. మా తాతయ్య పెద్ద నిర్మాత. అమ్మకు యాక్టర్ అవ్వాలనే కోరిక. అయితే కొన్ని కారణాల వల్ల అది జరగలేదు. పదోతరగతి పూర్తికాగానే అమ్మకోసమే హీరోయిన్‌గా మారాను. నాకు విదేశాల్లో బాగా చదువుకొని ఉద్యోగమో, వ్యాపారమో చేయాలని ఉండేది. నటిని కాకపోయి ఉంటే, ఆ రెండింటిలో ఏదో ఒక రంగాన్ని ఎంచుకునేదాన్నేమో! అదే జరిగి ఉంటే.. ఇంతమంది ప్రేక్షకుల అభిమానాన్ని, ప్రేమను కోల్పోయేదాన్నేమో!' అన్నారు సంగీత.
- నన్ను నేను నిరూపించుకునే సమయం..
'ఏదైనా కొత్త పాత్ర పోషించాల్సి వస్తే.. దానికి సంబంధించి కచ్చితంగా అధ్యయనం చేస్తాను. అప్పుడే ఆ పాత్రలో సహజత్వం ఉట్టిపడుతుంది. ''మసూద'' సినిమాలో ప్రధానపాత్ర పోషించా. ఆ పాత్ర గురించి కూడా రీసెర్చ్ చేశాను. తెలుగులో మరో కొత్త సినిమాకు సంతకం చేశాను. అందులో ప్రతినాయిక పాత్ర పోషిస్తున్నాను. నా సెకండ్ ఇన్నింగ్స్.. నన్ను నేను నిరూపించుకునే సమయం. ఓ నటిగా ఎలాంటి షేడ్స్ అయినా.. వెండితెరపై చూపించేందుకు సిద్ధంగా ఉన్నాను. వెబ్ సిరీస్ ఆఫర్లు కూడా వస్తున్నాయి. మంచికథ కోసం ఎదురుచూస్తున్నా' అని చెప్పుకొచ్చారు.
- అందువల్లే నేను వీక్..
'ఇండిస్టీలో ఉండేవారు అందరికీ టచ్‌లోనే ఉండాలి.. ఒక యాక్టర్‌కి ఎంతోమంది ప్రొడక్షన్ హౌస్‌లతో కనెక్షన్ ఉంటుంది. కానీ ఇండిస్టీలో నాకు ఎవరితోనూ అంతగా నెట్వర్క్ ఉండేది కాదు. ఈ విషయంలో నేను చాలా వీక్' అని తెలియజేశారు. ఎక్కువగా తన సినిమా గురించి తప్ప ఎప్పుడూ ఎలాంటి విషయం గురించీ ఆలోచించనని అన్నారు సంగీత. స్కిన్ సమస్యల వల్ల తెరపై చాలా లావుగా కనిపించడం చూసి, తన తల్లితోనే సినిమాలు చేయనని చెప్పేశానని ఆమె అన్నారు.. అయినా కూడా అవకాశాలు రావడంతో తను సినిమాల్లో నటిస్తూ ఉన్నానని తెలిపారు.
పేరు: సంగీత క్రిష్
ఇతర పేర్లు: రషిక(మలయాళం), దీప్తి
పుట్టిన తేదీ: అక్టోబర్ 21, 1978
పుట్టిన ప్రాంతం: చెన్నరు
భర్త: క్రిష్ (సింగర్)
పిల్లలు: శిహివ్య
తల్లిదండ్రులు: అరవింద్ శాంతారామ్, భానుమతి
హాబీస్: డ్యాన్సింగ్, సింగింగ్, మ్యూజిక్