- 4న సిఎంచే శంకుస్థాపన ప్రజాశక్తి- చిత్తూరు అర్బన్:
రాయలసీమలో రత్నాలు రాసులుగా పోసి అమ్మేవారని నాటి వైభవాన్ని చూడలేదు గానీ.. 1978లో చిత్తూరు జిల్లా కేంద్రంలోని విజయ సహకార డెయిరీ పాలవెల్లువ మాత్రం అప్పటి యువకులు, ఇప్పటి వృద్ధులకు గుర్తుంటుంది. దాదాపు ఆరువేల లీటర్ల పాల సామర్థ్యంతో ప్రారంభమై రెండు లక్షల లీటర్ల పాల సేకరణతో దేశంలోనే అతిపెద్ద పాల డెయిరీగా విరాజిల్లిన విజయ సహకార డెయిరీ పేరు మసకభారనుంది. దేశంలో కరువు తాండవిస్తున్న తరుణంలో సహకారరంగంలో అతిపెద్ద పాలడెయిరీగా ఉన్న విజయ డెయిరీ జిల్లాలోని పాడిరైతులకు కల్పతరువుగా నిలిచి ఆదుకుంది.
అనంతరం అంచెలంచెలుగా ఎదుగిన విజయ డెయిరీ 2002 ఆగస్టు 31వ తేదీన హఠాత్తుగా మూతపడింది. డెయిరీ మూతపడటంతో దాదాపు 300 మందికి పైగా వివిధ కేటగిరీల్లో పనిచేస్తున్న కార్మికులు రోడ్డున పడ్డారు. సహకార రంగంలో నడుస్తున్న పాలడెయిరీలో జిల్లాలోని పాడి రైతులు భాగస్వాములుగా ఉండేవారు. 33ఏకరాల్లో ఏర్పాటు చేసిన పాలడెయిరీ ఆస్తులతో పాటు జిల్లాలో 9,140 పాలసేకరణ కేంద్రాలు, పీలేరు, మదనపల్లి, శ్రీకాహస్తి, పిచ్చాటూరు ప్రాంతాల్లో పాలశీతల కేంద్రాలు కూడా ఉండేవి. జిల్లాలో అతిపెద్ద సహకార డెయిరీ మూతపడ్డంతో ప్రయివేటు పాల డెయిరీలు పుట్టగొడుగుల్లా పుట్టుకొచ్చాయి. విజయ డెయిరీని మూసివేయడాన్ని పాడిరైతులు, డెయిరీ కార్మికులు నిరశిస్తూ కొంతకాలం పాటు ప్రత్యక్ష ఆందోళనలు జరిగాయి. ప్రభుత్వాలు మారినప్పుడల్లా డెయిరీ మళ్లీ తెరిపిస్తామనే ఆశతో పాడి రైతులు ఎదురు చూశారు. విజయ డెయిరీని మూసివేయడాన్ని ప్రత్యక్షంగా చూసిన పెరుమూరుకు చెందిన రైతు వెంకటాచలం నాయుడు 2004 నవంబర్ ఒకటో తేదీన డెయిరీ ఎదుట మళ్లీ డెయిరీ తెరిపించేంత వరకు చెప్పులు, చొక్క వేసుకోనంటూ దీక్ష పూని సుదీర్ఘ పోరాటాని నేటికీ కొనసాగిస్తున్నారు. ఇదే తరహాలో విఆర్‌ఎస్ పొందకుండా ఎప్పటికైనా డెయిరీ తెరవకపోతారా అంటూ ఎదురు చూస్తున్న కార్మికులకు జగన్ సర్కార్ అమూల్‌కు అప్పగిస్తూ నిర్ణయించడంతో నిరాశే మిగిలింది. విజయ పాలడెయిరీలో నేటికీ భాగస్వాములుగా ఉన్న పాడి రైతులు, కార్మికులతో ఎలాంటి సంప్రదింపులు జరకుండా కోట్లాడి రూపాయల విలువ చేసే విజయ సహకార డెయిరీ ఆస్తులను 99సంవత్సరాలు అమూల్ సంస్థకు అప్పగించడంపై పాడిరైతులు, కార్మికులు ప్రభుత్వ తీరపై దుమ్మెతిపోస్తున్నారు.
ఇచ్చిన హామీ మరచిన జగన్
పాదయాత్ర సందర్భంగా చిత్తూరుకు వచ్చిన జగన్ మోహన్‌రెడ్డి జిల్లాలోని రేణిగుంట, చిత్తూరు సహకార చక్కెర ఫ్యాక్టరీలతో పాటు విజయ సహకార డెయిరీని అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లో పున్ణప్రారంభిస్తామని మాట ఇచ్చి నేడు అమూల్‌కు అప్పగించడం జిల్లాలోని పాడి రైతుల్ని మోసం చేయడమే అవుతుందని విజయ డెయిరీ కోసం చెప్పులు, చొక్క వదలి సుదీర్ఘ పోరాట చేస్తున్న వెంకటాచలం నాయుడు తెలిపారు. 16 సంవత్సరాలు పాటు తాను డెయిరీ పున్ణప్రారంభం కోసం పోరాటం చేశానని చిత్తూరులో ఏసమావేశం జరిగినా డెయిరీ సమస్యలను వారి దృష్టికి తీసుకుపోయానని, ఎప్పటికైనా తెరుస్తారనే ఆశతో ఎదురు చూశానని తెలిపారు. కానీ విజయ డెయిరీ విషయంలో గత పాలకులకు జగన్‌ను పెద్ద తేడా లేదని, వాళ్ళు తెరిపించకపోయినా ఆస్తులు కారు చౌవకగా అప్పగించలేదని విమర్శించారు. జగన్ విజయ డెయిరీ ఆస్తులను కారుచౌవకగా 99 సంవత్సరాలకు అమూల్‌కు అప్పగించడం జిల్లాలోని పాడి రైతులను ధగా చేయడమే అన్నారు.
డెయిరీ వ్యవస్థాపకుడి విగ్రహం తొలగింపు
సహకార విజయ డెయిరీ ఏర్పాటులో కీలపాత్ర పోషించి నాటి పాలకులను ఒప్పించి చిత్తూరు విజయ డెయిరీని జిల్లాకు తీసుకురావడానికి పాపుదేశి వెంకట కృష్ణమనాయుడు (చిత్తూరు సహకార సంస్థల ఏర్పాటుకు కృషి చేసిన వ్యక్తి) కుమారుడు వీర రాఘవులు నాయుడు మరణించాక జిల్లాలోని పాడి రైతులు డెయిరీకి పోసే పాలలో లీటరుకు పది పైసలు చొప్పున వీరరాఘవులు నాయుడు విగ్రహ ఏర్పాటుకు విరాళం అందించారు. 1999లో విజయ డెయిరీ ప్రధాన ద్వారం ముందు వీరరాఘవులు నాయుడు నిలువెత్తు విగ్రహం ఏర్పాటు చేశారు. అయితే విజయ డెయిరీ ఆస్తులను అమూల్ అప్పగించనున్న నేపధ్యంలో సిఎం పర్యటన వారం రోజులుండగా బుధవారం హఠాతుగా విగ్రహాన్ని తొలగించడం పట్ల వీరరాఘవులు నాయుడు కుటుంబ సభ్యులు, బంధువులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సహకార డెయిరీ ఏర్పాటులో కీలపాత్ర పోషించిన వ్యక్తి విగ్రహం ఎలాంటి సమాచారం ఇవ్వకుండా తొలగించడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. తొలగించడానికి కారణాలు తెలుపుతూ రెండు రోజుల్లో విగ్రహాని తిరిగీ ఏర్పాటు చేయకుంటే జిల్లాకు విచ్చేయనున్న సిఎం దృష్టికి జిల్లాలోని పాడిరైతులతో కలిసి తీసుకుపోతమంటున్నారు.










