చిత్ర పరిశ్రమలో ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా కేవలం టాలెంట్‌నే నమ్ముకుని వచ్చి, నిలదొక్కుకున్న నటులు చాలా మందే ఉన్నారు. అలాంటి వారిలో ఒకరే హీరో సుహాస్. సినిమాలపై ఉన్న ఫ్యాషన్‌తో పరిశ్రమలోకి అడుగుపెట్టిన ఈ నటుడు మొదట్లో చిన్న చిన్న క్యారెక్టర్లలో నటించారు. అలా పరిశ్రమలో నిలదొక్కుకుంటూనే 'కలర్ ఫొటో' చిత్రంతో హీరోగా పరిచయమయ్యారు. దీంతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. ఏకంగా మొదటి చిత్రంతోనూ జాతీయ అవార్డు గెలుచుకున్నారు. ఆ తర్వాత పలు చిత్రాల్లో విలన్‌గా కూడా నటించారు. ఇటీవల 'రైటర్ పద్మభూషణ్' చిత్రంతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. ఈ నేపధ్యంలో తన నట జీవితాన్ని గుర్తు చేసుకుంటూ ఇన్‌స్టాలో పోస్ట్ షేర్ చేశారు.. అంతేకాక పలు ఇంటర్వ్యూల్లో ఆయన పంచుకున్న పలు ఆసక్తికర విషయాలు..!
ఇటీవలి కాలంలో పలు చిత్రాల్లో విలన్‌గా కూడా నటించి మంచి విజయాలను అందుకున్నారు నటుడు సుహాస్. తాజాగా విడుదలైన రైటర్ పద్మభూషణ్ చిత్రం సూపర్ హిట్ టాక్‌తో దూసుకు వెళ్తోంది. ఈ చిత్రానికి ప్రశాంత షణ్ముఖ దర్శకత్వం వహించారు. కాగా విజయవాడలో మధ్యతరగతి కుటుంబంలో పుట్టి పెరిగిన సుహాస్ ఎలాంటి నేపథ్యం లేకుండా పరిశ్రమలోకి ప్రవేశించి నటనతో తన సత్తాను చాటుకున్నారు. పలు చిత్రాల్లో స్నేహితునిగా, విలన్‌గా, హీరోగా తనదైన శైలిలో నటిస్తూ ప్రేక్షకుల మన్ననలు పొందుతున్నారు. ఇలా వైవిద్యమైన పాత్రల్లో పరకాయప్రవేశం చేసే సుహాస్‌కు నటుడవ్వాలనే తన కల నెరవేరింది..
- అలా మొదలైంది...
యూట్యూబ్‌తో కెరీర్ మొదలు పెట్టి నటుడిగా తన ప్రయాణం కొనసాగుతున్న విషయాన్ని గుర్తు చేసుకున్నారు సుహాస్. 'అబ్బో ఎక్కడి నువ్వు ఎక్కడికి వచ్చేశావురా సుహాసూ.. సినిమాలు తప్ప పుస్తకాలు పట్టించుకోపోవడం, కాలేజీ ఎగ్గొట్టి సినిమాలకు వెళ్లడం, టికెట్ కోసం లైన్లో నిలబడి చొక్కాలు చింపేసుకోవడం.. ఇవన్నీ నాన్నకు తెలసి బెల్ట్ తెగేలా కొట్టడం.. సినిమా ఛాన్స్ కోసం చెప్పులు అరిగేలా తిరగడం, వచ్చిన అరకొర వేషాలతో కడుపు నిండక, భవిష్యత్తు కనపడక, కళ్లు నీటితో నిండిపోవడం, యూట్యూబ్ నుంచి దూరంగా, హీరోగా మొదటి సినిమా వచ్చింది అనుకునేలోపే వెండి తెర వెయిటింగ్లో పడి ఓటీటీలో బ్లాక్ బస్టర్ కొట్టడం.. దానికి జాతీయ అవార్డు రావడం.. ఫైనల్‌గా విజయవాడకు దూరంగా, సినిమాకు దగ్గరగా.. సుమారు పదేళ్ల ప్రయాణం తర్వాత.. ఏదో అద్భుతం జరిగినట్లు ఎక్కడైతే నటుడు కావాలన్న ఆలోచన మొదలైందో అక్కడే మొదటి థియేటర్ రిలీజ్, మొదటి ప్రీమియర్ పడటం.. అబ్బో ఈ ఫీలిగ్ ఏంటో మామూలుగా లేదుగా' అని రాసుకొచ్చారు సుహాస్. అయితే 'చిన్న పాత్రలు చేస్తే చాలు అనుకున్నాను. చాలా మంచి పాత్రలు వస్తున్నాయి. రచయితల వల్ల చాలా భిన్నమైన పాత్రలు చేసే అవకాశం కలుగుతోంది. వచ్చిన పాత్రకు ఎలా న్యాయం చేయాలనే దానిపైనే నా దృష్టి వుంది' అని చెప్పుకొచ్చారు.
- షార్ట్ ఫిలిమ్స్‌లో అవకాశం..
'కెరీర్లో నిలదొక్కుకునేందుకు ప్రయత్నిస్తున్న రోజుల్లో ప్రముఖ యూట్యూబ్ ఛానల్ 'చారు బిస్కట్'లో పలు షార్ట్ ఫిలిమ్స్‌లో నటించాను.. వాటిల్లో 'ది అతిథి' అనే షార్ట్ ఫిలిం పెద్ద హిట్ అయ్యింది. దీంతోపాటు 'కళాకారుడు' అనే షార్ట్ ఫిలిం కూడా హిట్ అవ్వడంతో సుహాస్ డైరెక్టర్స్ దృష్టిలో పడ్డాను. దీంతో 'పడి పడి లేచేమనసు' చిత్రంలో ముఖ్యమైన పాత్ర ఇచ్చారు. అలా ఒక పక్క షార్ట్ ఫిలిమ్స్‌లో నటిస్తూనే మరోపక్క సినిమాల్లో వచ్చిన అవకాశాలను వదులుకోకుండా రెండిటిని బ్యాలన్స్ చేస్తూ వచ్చా'.
- అదే కీలక మలుపు..
'అలా రెండు పడవల మీద ప్రయాణం చేస్తున్న తనకు మంచి బ్రేక్ ఇచ్చిన సినిమా నవీన్ పోలిశెట్టి హీరోగా నటించిన 'ఏజెంట్ సాయి శ్రీనివాస్ ఆత్రేయ'. ఇందులో డిటెక్టివ్‌గా చేసిన క్యారక్టర్ బాగా క్లిక్ అయ్యింది. ఆ తర్వాత నాగ చైతన్య హీరోగా నటించిన మజిలీ చిత్రం తర్వాత వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు.. ఈ సినిమా బాగా హిట్ అవ్వడంతో అందరూ 'మజిలీ సుహాస్' అని పిలవడం ప్రారంభించారు.'
- ఆ పాత్ర ప్రభావం ఉండేది..
ఓటీటీలో కరోనా టైంలో వచ్చిన 'ఫ్యామిలీ డ్రామా' గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కలర్ ఫోటో తర్వాత మరలా అంత పేరు తెచ్చిన చిత్రం ఫ్యామిలీ డ్రామా. అయితే ఇందులో సుహాస్ వైవిధ్యంగా సైకో పాత్రలో కనిపించి మెప్పించారు. ఆ చిత్రంలో సుహాస్ క్యారెక్టర్ చూస్తే ఎవరికైనా భయం వేస్తుంది. ఇక తన భార్య కూడా ఆ సినిమా చూసిన తరువాత మూడు రోజుల పాటు ఇంటికి రావొద్దని, ఆఫీస్‌లో పడుకోమని చెప్పిందని అప్పుడు జరిగిన విషయాన్ని గుర్తు చేసుకున్నారు సుహాస్.
అంతేకాదు ఆ సినిమా చేసినప్పటి నుంచి ఇంట్లో నార్మల్‌గా నవ్వుతున్నా సరే.. ఆ పాత్ర ప్రభావం వల్ల కాస్త భయపడేదని చెప్పుకొచ్చారు. ఇలా తన పాత్రల ద్వారా ఇంట్లో వారిని కూడా భయపెట్టేశారు సుహాస్.
పేరు : సుహాస్ పాగోలు
పుట్టిన తేదీ : ఆగస్టు 19, 1990
పుట్టిన ప్రాంతం : విజయవాడ
నివాస ప్రాంతం : హైదరాబాద్
చదువు : బిఎస్సి కంప్యూటర్స్
జీవిత భాగస్వామి : లలిత