Feb 06,2022 06:56

దీని ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని చూస్తున్నారని స్పష్టమవుతోంది. మరో ఏడాదిలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి. అభివృద్ధిపై చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి మళ్లీ ఏదో ఒక కారణంతో ప్రజల మధ్య బేధాలను సృష్టిస్తే మెజారిటీ వర్గాన్ని ఏకం చేయవచ్చనే ఆలోచన కనిపిస్తోంది. అంతేకాకుండా ముస్లిం అమ్మాయిలను చదువుకు దూరం చేసే కుట్ర సైతం కనిపిస్తోంది. అటువంటి కుట్రలను వమ్ము చేయడం దేశభక్తులందరి కర్తవ్యం.

    ప్పుడిప్పుడే విద్య ప్రాముఖ్యతను తెలుసు కుంటున్నారు. పెద్దలను ఒప్పించో.. ఎదిరించో.. ఇంటి గుమ్మాన్ని దాటుతున్నారు. ఉన్నత చదువుల వైపు అడుగులు వేస్తున్నారు. ఉద్యోగాలు చేయాలని, అభివృద్ధి వైపు పయనించాలని కలలు కంటున్నారు. అయితే ముస్లిం అమ్మాయిల అభివృద్ధిని చూడలేని కొన్ని శక్తులు వారిని వివాదాల్లోకి లాగుతున్నాయి. వస్త్రధారణ పేరిట చదువుకు దూరం చేసే కుట్రను పన్నుతున్నాయి.
    ఇటీవల కర్ణాటక లోని ఉడుపి జిల్లా కుందాపుర పట్టణ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలకు హిజాబ్‌ (తల, మెడను కప్పి వుంచే స్కార్ఫ్‌) ధరించి వచ్చిన విద్యార్థినులను లోనికి అనుమతించకుండా ప్రధాన ద్వారాన్ని మూసివేశారు. దీంతో విద్యార్థినులకు, ప్రిన్సిపాల్‌, ఇతర అధ్యాపకులకు మధ్య వాగ్వాదం జరిగింది. ప్రభుత్వ నిర్ణయం మేరకు హిజాబ్‌ ధరించి కళాశాలకు వస్తే అనుమతించే ప్రసక్తే లేదని ప్రిన్సిపాల్‌ స్పష్టం చేశారు. ప్రవేశాల సమయంలో ఈ విషయాన్ని స్పష్టం చేయకుండా ఇప్పుడు చెబితే ఎలా? అని విద్యార్థినులు ప్రశ్నించారు. మరో రెండు నెలల్లో వార్షిక పరీక్షలు ఉండగా, ఇప్పుడిలా ఆంక్షలు పెడితే ఎలాగని విమర్శించారు. వారు కళాశాల మైదానం వెలుపలే కొద్దిసేపుండి వెనుదిరిగారు. ఇది ఈ రోజు ఒక కళాశాలకే. ఒక రాష్ట్రానికే పరిమితమై ఉండొచ్చు. రేపు అన్ని రాష్ట్రాలకు, దేశానికంతటికి పాకితే ముస్లిం అమ్మాయిల చదువుపై తీవ్ర ప్రభావం చూపే అవకాశముంది.
 

                                                           కావాలనే వివాదం

ముస్లిం అమ్మాయిలు హిజాబ్‌ ధరించి రావడంపై కాషాయ శక్తులు కావాలనే వివాదాన్ని సృష్టించాయి. ముస్లిం విద్యార్థినులు హిజాబ్‌ ధరించి కాలేజికి రావడంతో, మరికొందరు విద్యార్థులు కాషాయ కండువాలు ధరించి వచ్చారు. దీంతో కాలేజి అధికారులు కుందాపూర్‌ ఎంఎల్‌ఎ హలది శ్రీనివాస్‌ శెట్టితో చర్చించారు. విద్యార్థులు యూనిఫామ్‌ నిబంధనకు కట్టుబడి ఉండాలనే నిర్ణయానికి వచ్చారు. హిజాబ్‌ తో తరగతుల్లోకి అనుమతించాలని పట్టుబట్టడంతో వారిని కళాశాల లోకి రానివ్వలేదు.
 

                                                                వాదనలు ఇలా...

ప్రభుత్వ నిబంధనలను అందరూ తప్పనిసరిగా పాటించాల్సిందే అని జిల్లా మంత్రి అంగార చెబుతున్నారు. మత సంప్రదాయాలు పాటించేందుకు విద్యాసంస్థలు వేదిక కాదని హోం మంత్రి అరగ జ్ఞానేంద్ర అంటున్నారు. పాఠశాల యాజమాన్యమేమో ఇది గర్ల్స్‌ హైస్కూల్‌ అని, ఇక్కడ హిజాబ్‌ ధరించాల్సిన అవసరం లేదని, అది కూడా క్లాసులో ఉన్నప్పుడు మాత్రమే ధరించవద్దని చెబుతున్నామని అంటోంది. 'మా స్కూల్లో ఐదారుగురు మగ లెక్చరర్లు ఉన్నారు. వారి ముందు మేం బురఖా ధరించాల్సిందే' అని విద్యార్థినులు చెబుతున్నారు.
 

                                                            మద్దతు సైతం....

విద్యార్థినులను కళాశాల లోకి అనుమతించకపోవడాన్ని జమ్ము-కాశ్మీర్‌ మాజీ ముఖ్యమంత్రులు ఒమర్‌ అబ్దుల్లా, మెహబూబా ముఫ్తీ ఖండించారు. బాలికలకు విద్య అందించాలంటూ ఇస్తున్న నినాదం ఒట్టిదేనని దీన్నిబట్టి అర్ధమవుతోందని కాశ్మీర్‌ మాజీ సీఎం మెహబూబా ముఫ్తీ తెలిపారు. హిజాబ్‌ ధరించినందుకు ముస్లిం బాలికలకు కాలేజీల్లో ప్రవేశం నిరాకరించడం రాజ్యాంగంలోని ప్రాథమిక హక్కును ఉల్లంఘించడమేనని కర్నాటకలో ప్రతిపక్ష నేత సిద్ధరామయ్య అన్నారు. ఇది రాజకీయ ప్రేరేపితమైనదిగా అభివర్ణించారు.
 

                                                 ఆహార్యంపై అభ్యంతరాలెందుకు ?

వస్త్రధారణపై ఆంక్షల ద్వారా ప్రాథమిక హక్కులను కాలరాసే ప్రయత్నం జరుగుతోంది. కేవలం వస్త్రధారణ కారణంగానే ముస్లిం బాలికలకు విద్యాహక్కు లేకుండా చేసే కుట్ర జరుగుతోంది. 'ఉత్తరప్రదేశ్‌ సీఎం యోగి ఆదిత్యనాథ్‌, బిజెపి నాయకురాలు ఉమాభారతి, భోపాల్‌ ఎంపీ ప్రజ్ఞా ఠాకూర్‌ కాషాయ వస్త్రాలు ధరించడం లేదా.. 'వ్యక్తులు ఏం ధరించాలో ఎంచుకోవచ్చు. మీరు వారి ఎంపికను ఇష్టపడవచ్చు లేదా ఇష్టపడకపోవచ్చు. కానీ అది మనందరికీ ఉన్న హక్కు. ముస్లింలు ద్వితీయ శ్రేణి పౌరులు కాదు' అంటూ ఒమర్‌ అబ్దుల్లా చేసిన ట్వీట్‌ గురించి ఆలోచించాల్సిందే.
 

                                                               హైకోర్టు నోటీసులు

హిజాబ్‌ ధరించడం తన ప్రాథమిక హక్కని, దానిని హరిస్తున్నారని నిరసన తెలుపుతున్న విద్యార్థిని ఒకరు కర్ణాటక హైకోర్టును ఆశ్రయించారు. దీనిపై ఫిబ్రవరి 8న హైకోర్టు విచారణ జరగనుంది. హిజాబ్‌ తో అమ్మాయిలు కాలేజ్‌ లో అడుగు పెట్టకూడదని ఆ కాలేజీ ప్రిన్సిపాల్‌ ఆదేశాలు జారీ చెయ్యడంతో కర్ణాటక ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు జారీ చేసింది. దీంతో పాటు ఉడిపి ఎమ్మెల్యేకి, జిల్లా విద్యాశాఖ అధికారులు, ప్రభుత్వ బాలికల కళాశాల ప్రిన్సిపాల్‌, అధ్యాపకులు, సిబ్బందిని ప్రతివాదులుగా చేరుస్తూ హైకోర్టు నోటీసులు జారీ చేసింది. అయితే గతంలోనూ కోర్టులో దీనిపై కేసు నడిచింది. విద్యార్థులు తమ ఇష్టానుసారం దుస్తులు ధరించాలనేది ప్రాథమిక హక్కని, అయితే, విద్యార్థులంతా యూనిఫాం ధరించేలా చూడటం పాఠశాలకున్న అధికారమని జస్టిస్‌ ఎ.మహ్మద్‌ ముస్తాక్‌ గతంలో తన తీర్పులో పేర్కొన్నారు. ''విద్యార్థుల హక్కులకు, మేనేజ్‌మెంట్‌ హక్కులకు పోటీ పెట్టడం సరికాదు. ఒక హక్కు ఎవరికి ఉందో ఎవరికి లేదో చెప్పాలి. ఆర్టికల్‌ 25 స్ఫూర్తిని కాపాడాలి'' సుప్రీంకోర్టు న్యాయవాది కాళేశ్వరమ్‌ రాజ్‌ అభిప్రాయపడ్డారు. ''యూనిఫామ్‌గా ఉండాలన్న కారణంతో జుత్తు వరకు కప్పుకోవాడాన్ని కూడా యాజమాన్యం నిషేధించలేదు. ఎందుకంటే దీన్ని రాజ్యాంగం అంగీకరించదు. భిన్నత్వాన్ని మన రాజ్యాంగం పరిరక్షిస్తుంది'' అని రాజ్‌ అభిప్రాయపడ్డారు.
 

                                                    పోరాడి సాధించుకున్నారు...

హైదరాబాద్‌లోని సెయింట్‌ ఫ్రాన్సిస్‌ మహిళా కళాశాలలో గతంలో మహిళల వస్త్రధారణపై ఇలాగే వివాదం జరిగింది. మోకాళ్లు దాటిన కుర్తీలు మాత్రమే వేసుకుని కళాశాలకు రావాలని కొత్త నిబంధన విధించడంతో వివాదం మొదలైంది. అంతేకాకుండా ముస్లిం విద్యార్థినులు బుర్కా లోపల ఏ డ్రెస్‌ వేసుకున్నారో చూడాలంటూ గేటు దగ్గరే తనిఖీలు నిర్వహించింది కళాశాల యాజమాన్యం. దీంతో విద్యార్థినులు ఆందోళన బాట పట్టి... కళాశాల ఎదుట బైఠాయించారు. వివాదం ఎక్కువ కావడంతో పాత డ్రెస్‌కోడ్‌ విధానమే కొనసాగుతుందని, కొత్త డ్రెస్‌ కోడ్‌ విధానాన్ని తొలగిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్‌ ప్రకటించడంతో వివాదం సద్దుమణిగింది.
 

                                                           రాజకీయాలు.. కుట్రలు...

కర్ణాటక తీర ప్రాంత విద్యాసంస్థల్లో హిజాబ్‌ కు వ్యతిరేకత ఎక్కువవుతోంది. హిజాబ్‌కు అనుమతించడాన్ని వ్యతిరేకిస్తూ ఈ ప్రాంతం లోని కొప్ప, మంగళూరుల్లోని కాలేజీల్లో నిరసన ప్రదర్శనలు కూడా జరిగాయి. రాజకీయాల కోసం విద్యా సంస్థలను పార్టీలు వాడుకోవాలని చూడడం దారుణం. దీని ద్వారా రెండు లక్ష్యాలు సాధించాలని చూస్తున్నారని స్పష్టమవుతోంది. మరో ఏడాదిలో కర్ణాటకలో ఎన్నికలు ఉన్నాయి. ఆ తర్వాత దేశవ్యాప్తంగా ఎన్నికలు జరుగుతాయి. అభివృద్ధిపై చెప్పుకోవడానికి ఏమీ లేదు కాబట్టి మళ్లీ ఏదో ఒక కారణంతో ప్రజల మధ్య బేధాలను సృష్టిస్తే మెజారిటీ వర్గాన్ని ఏకం చేయవచ్చనే ఆలోచన కనిపిస్తోంది. అంతేకాకుండా ముస్లిం అమ్మాయిలను చదువుకు దూరం చేసే కుట్ర సైతం కనిపిస్తోంది. అటువంటి కుట్రలను వమ్ము చేయడం దేశభక్తులందరి కర్తవ్యం.
 

/ వ్యాసకర్త సెల్‌ : 9640466464 /

ఫిరోజ్‌ ఖాన్‌