విశాఖ ఉక్కు ఉద్యమానికి అంతకంతకూ మద్దతు పెరుగుతోంది. ప్రైవేటీకరణ చేసి తీరుతామని కేంద్రం కుండబద్దలు కొట్టిన తర్వాత ఊపందుకున్న ఉద్యమం.. క్రమంగా విస్తరిస్తోంది. అన్ని రంగాల నుంచీ ఉద్యమానికి మద్దతు లభిస్తోంది. దీనిపై సినీ ప్రముఖులు నుంచి నటులు అందరూ తమ అభిప్రాయాల్ని సామాజిక మాధ్యమాల ద్వారా తెలుపుతున్నారు. ఉక్కు ఉద్యమాన్ని, పరిశ్రమ కోసం మహనీయులు చేసిన త్యాగాన్ని కళ్లకు కట్టినట్లుగా 'ఉక్కు సత్యాగ్రహం' పేరుతో సినిమా చిత్రీకరిస్తున్నట్లు తెలుగుసేన ప్రతినిధి సత్యారెడ్డి తెలిపారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణను తెలుగుసేన తీవ్రంగా ఖండిస్తోందన్నారు.
ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం : చిరంజీవి
'విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని మనమందరం కలిసి ఉక్కు సంకల్పంతో కాపాడుకుందాం' అని ప్రముఖ సినీ నటుడు, మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి పేర్కొన్నారు. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేక పరిరక్షణ పోరాట కమిటీ చేస్తున్న పోరాటానికి సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నట్లు ట్విట్లర్లో పేర్కొన్నారు. ఫ్యాక్టరీ సాధనకు జరిగిన పోరాటాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. 'విశాఖ ఉక్కును పరిరక్షించుకోవడమే మనముందున్న ప్రధాన కర్తవ్యం. ఇది ప్రాంతాలకు, పార్టీలకు, రాజకీయాలకు అతీతమైన న్యాయ సమ్మతమైన హక్కు' అని పేర్కొన్నారు.
ఆంధ్రుల హక్కు : కోన వెంకట్
'స్టీల్‌ప్లాంట్‌ను ప్రైవేటు సంస్థలు లాభాల బాటలో నడిపిస్తే మరి ఆ పని ప్రభుత్వం ఎందుకు చేయలేదు. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ మాత్రమే కాదు, అది మా హక్కు డియర్ మోడీజీ? విశాఖ ఉక్కును కాపాడండి' అంటూ సినీ రచయిత కోన వెంకట్ ట్విట్టర్లో పోస్టు చేశారు.
ప్రైవేట్ వాళ్లకిస్తే ప్రాఫిట్లోకెళ్తుందా? : ఆర్పి పట్నాయక్
'లాస్లో నడుస్తుంది కాబట్టి విశాఖ ఉక్కుని అమ్మేస్తున్నాం అని కేంద్రం అంటుంది. ప్రైవేట్ వాళ్ళు తీసుకుని లాస్లో అయితే నడపరు కదా. లాస్లో నడుస్తున్న విశాఖ ఉక్కు ప్రైవేట్ వాళ్ళకి ఇవ్వగానే ప్రాఫిట్లోకి వెళ్తుందంటే. ఆ లాజిస్టిక్స్ ఏమిటో స్టడీ చేసి, వాటిని ఇంప్లిమెంట్ చేసే దిశగా కేంద్రం పని చేయాలి. కనీసం ఒకటి రెండు సంవత్సరాలు ఒక అవకాశం ఇస్తే బాగుంటుంది. విశాఖ ఉక్కు కోసం పోరాడుతున్న వాళ్ళకి ఒక సామాన్య పౌరునిగా రాజకీయ పార్టీలకు అతీతంగా నా సంపూర్ణ మద్దతు తెలియజేస్తున్నాను' అని సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ అన్నారు.
రియల్ దందా కోసమేనా : వేణు ఊడుగల
'కార్మిక సంఘాల అంగీకారం లేకుండా గుట్టుచప్పుడు కాకుండా స్టీల్‌ప్లాంట్ అమ్మేయాలనుకోవడం దుర్మార్గం. ప్రభుత్వ నిర్వహణలో ఉన్నప్పుడు వచ్చిన నష్టాలు ప్రైవేటులో రావనుకుంటే ప్రభుత్వాలు తమ వైఫల్యాలను అంగీకరించినట్లే కదా! ఇదంతా మిగులు భూముల కోసం రియల్ దందా చేయడానికే అనిపిస్తోంది' అని విరాటపర్వం సినిమా దర్శకుడు, కవి వేణు ఊడుగల తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. 'ప్రైవేటీకరణను వెంటనే ఆపి, నిర్వాసితుల సంగతి చూడాలి. వారికి పూర్తిగా పరిహారం చెల్లించాలి కదా.. ఈ మిగులు భూములను నిర్వాసితుల సమస్య శాశ్వత పరిష్కారం కోసం ఉపయోగించాలి' అని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నాను.
ముల్షీ ప్యాట్రన్ గుర్తొస్తోంది : తిరువీర్
'చిరంజీవిగారు, ఆర్పీ పట్నాయక్‌గారు చెప్పేదే నేనూ చెప్తున్నా.. నష్టాల్లో ఉన్న సంస్థను ప్రైవేటు వారు ఎలా లాభాల్లో నడపగలరు అని' సినీ నటుడు తిరువీర్ ట్వీట్ చేశారు. ఈ విషయం తల్చుకుంటే మరాఠీ సినిమా 'ముల్షీ ప్యాట్రన్' గుర్తొస్తోంది. ప్రభుత్వరంగ సంస్థలే నిర్వాసితుల్ని గాలికి వదిలేస్తే ప్రైవేటు వారు వేటు వేయక ఊరుకుంటారా? విశాఖకు ప్రైవేటీకరణ ప్రక్రియ వెంటనే ఆపాలి. నిర్వాసితుల ఆర్.కార్డ్ తదితర సమస్యలు పరిష్కరించాలి అన్నారు.
ఉత్తరాంధ్రకు ఉక్కును దూరం చేయొద్దు : జోగిబ్రదర్
విశాఖ ఉక్కు పరిశ్రమ ఉత్తరాంధ్రకు తలమానికం. ఎన్నో ప్రయాసలకోర్చి దాన్ని నిలబెట్టుకున్నాం. మా ఉత్తరాంధ్ర కష్టం ప్రస్తుత పరిశ్రమ. దాన్ని దూరం చేయకండి. చేసినవాళ్లకి పుట్టగతులుండవు. నిర్వాసితులకు ఉద్యోగాలిచ్చి పరిహారం చెల్లించాలి' అని సినీ నటుడు కృష్ణం రాజు (జోగి బ్రదర్స్) అన్నారు.
నిర్వాసితుల సంగతేంటి? : పింగళి చైతన్య
'విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరించడం అన్యాయం. వెంటనే ప్రైవేటీకరణను ఆపాలి. 40 ఏళ్లుగా నిర్వాసితులుగా ఉన్నవారికి తక్షణం న్యాయం చేయాలి' అని సినీ గేయ రచయిత, సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత పింగళి చైతన్య అన్నారు.
32 మంది బలిదానాలు మర్చిపోయారా? : బమ్మిడి జగదీశ్వరరావు
'ప్రభుత్వం ప్రజల కాళ్ల కింద నేలను లాగేసుకొని హక్కుదారుల్ని నిర్వాసితుల్ని చేసింది. లాభాలొస్తే జేబులో వేసుకుంది. నష్టాలొస్తే వ్యాపారం చేయడం మా విధి కాదంటోంది. సర్వీసు సెక్టార్‌ను బిజినెస్ సెక్టార్‌గా చూసే కొత్త దృష్టిని అలవర్చుకొంది. ప్రైవేటువారికి ఘనంగా గనులు కట్టబెట్టి, తమ ఆధీనంలోని ప్లాంటుకు గనులు ఇవ్వలేమంది. చివరికి ప్రజల పోరాటాలను, 32 మంది బలిదానాలను మర్చిపోయింది. ప్రజల ఉమ్మడి సొత్తును, సంపదను లాక్కొని, అనుయాయుల చేతుల్లో పెట్టేస్తోంది. తాను నడపలేని చేతకానితనాన్ని నిందించుకోకుండా ప్రైవేటు వారిని కీర్తిస్తోంది. రాజు చేసిన తప్పులకు ప్రజలకు కొరడా దెబ్బలు తప్పవని అర్థమవుతుంది' అని మాటల రచయిత, కథకుడు బమ్మిడి జగదీశ్వరరావు విమర్శించారు.
కార్మిక, ఉద్యోగుల కష్టార్జితం : పెద్దింటి అశోక్‌కుమార్
'విశాఖ ఉక్కు కర్మాగారం కార్మికులు, ఉద్యోగుల కష్టార్జితం. చెమటోడ్చి నిలబెట్టుకున్నారు. ఏవో సాకులు చెప్పి వారిని నిలువునా ముంచి దాన్ని అమ్ముకునే నైతిక హక్కు ప్రభుత్వానికి ఎక్కడిది? 40 ఏళ్లు గడిచినా ఉక్కు నిర్వాసితులకు ఇంతవరకూ న్యాయం చేయలేదు. ఇప్పటికైనా అన్యాయమైన ఆ కుటుంబాలకు తగిన పరిహారం చెల్లించాలి. ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణను కేంద్రం ఉపసంహరించుకోవాలి'. అని కథకుడు, సినీ మాటల, గేయ రచయిత పెద్దింటి అశోక్ అన్నారు.
తెలుగు రాష్ట్రాలకు అన్యాయం : వెంకట్ సిద్ధారెడ్డి
'నలభై ఏళ్ల పాటు వేలాది కుటుంబాలను నిర్వాసితులను చేసి వారికి పూర్తి న్యాయం చేయకపోగా, ఇప్పుడు విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటీకరణ చేయడం మరొక ఘోర అన్యాయం. గడిచిన దశాబ్దంలో రెండు తెలుగు రాష్ట్రాలకు కేంద్రం అందించిన సహకారం ఏమిటో అందరికీ తెలుసు. చూస్తుంటే కేంద్ర ప్రభుత్వం తెలుగు రాష్ట్రాలకు చేస్తున్న ఈ అన్యాయం వెనుక ఏదో పెద్ద పథకమే ఉన్నట్లు అనిపిస్తుంది. తెలుగువాళ్లే కాదు, దక్షిణాది వాళ్లంతా దీనికి వ్యతిరేకంగా పోరాడాల్సిన సమయం ఇది' అని కథకుడు, ఫిల్మ్ మేకర్ వెంకట్ సిద్ధారెడ్డి అన్నారు.
ప్రైవేటీకరించే హక్కు లేదు : కత్తి మహేష్
నిర్వాసితులకు సరైన పరిహారం ఇవ్వకుండా కట్టిన ఉక్కు కర్మాగారంలో వాళ్లు సహజ భాగస్వాములవుతారు. 40 ఏళ్లుగా నిర్వాసితులుగానే మిగిలిన వారిని కాదని ప్రైవేటీకరించే నైతిక హక్కు కేంద్రానికి లేదు. వాళ్లకి ముందు న్యాయం జరగాలి. తరువాతి వంతు ఉద్యోగులది. కాబట్టి అందరికీ న్యాయం జరగాలంటే, ముందుగా ఎవరికి అన్యాయం జరిగిందో వాళ్లకి న్యాయం జరగాలి' అని నటుడు, రచయిత, సినీ, సామాజిక వ్యాఖ్యాత కత్తి మహేష్ అభిప్రాయపడ్డారు.