ప్రజాశక్తి - అమరావతి బ్యూరో :సిపిఎం రాష్ట్ర నూతన కార్యదర్శిగా ఎన్నికైన వి.శ్రీనివాసరావు విద్యార్థిదశ నుండే ఉద్యమాల్లోకి వచ్చారు. చిన్నప్పుడే విద్యార్థులకు నోటు పుస్తకాలు కావాలని కార్యరంగంలోకి దిగారు. ప్రత్యర్థుల దాడులకు గురయ్యారు. ప్రత్యక్ష భూపోరాటంలో అరెస్టయి జైలు జీవితం అనుభవించారు. ప్రకాశం జిల్లా మర్రిపూడి మండలం కెల్లంపల్లి వి.శ్రీనివాసరావు స్వగ్రామం. ఆయన తల్లిదండ్రులు వెంకటస్వామి, రమణమ్మ వ్యవసాయం రంగంలో ఉన్నారు. శ్రీనివాసరావుకు ఇద్దరు కుమార్తెలు. 1974-76లో నెల్లూరు జిల్లా కావలి జవహర్ భారతి కళాశాలలో ఇంటర్ చదివారు. అప్పటికే అక్కడ ప్రస్తుత సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బి.వి.రాఘవులు డిగ్రీ చదువుతూ విద్యార్థి సంఘం అధ్యక్షులుగా పోటీచేశారు. ఆయన తరుపున శ్రీనివాసరావు ప్రచారం చేశారు. 1975లో ఎమర్జెన్సీ విధించారు. ఆ సమయంలో ప్రదర్శన, ర్యాలీ చేయడంతో ఆర్‌డిఓ కేసు పెడతామని, జైల్లో పడేస్తామని బెదిరించారు. 1976లో డిగ్రీ మొదటి సంవత్సరంలో విద్యార్థులకు పుస్తకాలు, సదుపాయాలు కావాలని పోరాటం చేస్తూ ఎస్‌ఎఫ్‌ఐ కళాశాల కార్యదర్శిగా ఎన్నికయ్యారు. సెమిస్టర్‌కు వ్యతిరేకంగానూ, హాస్టల్లో సదుపాయాలు కల్పించాలని, ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ స్కూల్ విద్యార్థులకు సదుపాయాలు కల్పించాలని ఆందోళనలు చేపట్టారు. రౌడీల దాడులను ఎదుర్కొన్నారు. 1978-79లో ఎస్‌ఎఫ్‌ఐ నెల్లూరు జిల్లా అధ్యక్షులుగాను, 1979-82 వరకూ కార్యదర్శిగానూ పనిచేస్తూ న్యాయవిద్యలో చేరారు. చివరి సంవత్సరంలో విద్యార్థి సంఘ నేతగానే కావలిలో భూపోరాటంలో పాల్గన్నారు. 11 రోజులపాటు జైల్లో ఉన్నారు. అనంతరం పరీక్షలు పూర్తిచేశారు. అప్పుడే నెల్లూరులోని వివిధ విద్యాసంస్థలకు జరిగిన విద్యార్థి ఎన్నికల్లో ఎస్‌ఎఫ్‌ఐ విజయం సాధించింది. విద్యాభ్యాసం పూర్తవగానే డివైఎఫ్‌ఐ నెల్లూరు పట్టణ అధ్యక్షులుగా బాధ్యతలు నిర్వహించారు. 1982-84లో డివైఎఫ్‌ఐ జిల్లా కార్యదర్శిగా ఉంటూనే రాష్ట్ర కార్యదర్శిగానూ బాధ్యతలు చేపట్టి విజయవాడ వచ్చారు. అప్పట్లో నిరుద్యోగం, రిక్రూట్‌మెంట్‌పై బ్యాను విధించగా దానికి వ్యతిరేకంగా జరిగిన పోరాటంలో పాల్గన్నారు. యువజన, విద్యార్థి, నిరుద్యోగ ఆందోళనలతో అప్పటి ముఖ్యమంత్రి ఎన్‌టి రామారావు రిక్రూట్‌మెంట్‌పై నిషేధం ఎత్తేశారు. 1985లో గుంటూరులో జరిగిన మహాసభలో రాష్ట్ర కమిటీ సభ్యులుగా ఎన్నికయ్యారు. 1992లో రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ఆ సమయంలో రైతులకు ప్రమాదకరంగా మారిన మోన్‌శాంటో బిటి విత్తనాలకు వ్యతిరేకంగా పెద్దఎత్తున పోరాటాలు చేపట్టారు. రైతు రక్షణ యాత్రలు నిర్వహించారు. 1997లో పార్టీ రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులయ్యారు. 2000 సంవత్సరంలో ప్రజాశక్తి పత్రిక సంపాదకులుగా బాధ్యతలు చేపట్టారు. 2005లో కేంద్ర కమిటీ సభ్యులుగానూ ఎన్నికయ్యారు. అనంతరం ఏర్పాటు చేసిన కేంద్ర కార్యదర్శివర్గ సభ్యులయ్యారు. దళిత శోషణ్ ముక్తిమంచ్ (డిఎస్‌ఎంఎం) వ్యవస్థాపక కన్వీనర్‌గా ఉన్నారు. ప్రసుత్తం అదే సంఘానికి జాతీయ కార్యదర్శిగా వ్యవహరిస్తున్నారు. కేంద్రస్థాయిలో రైతుల సమస్యలపైనా, పేదల భూ సమస్యలపైనా పోరాటాలు నిర్వహించారు. ఎపి భవన్ ముందు ధర్నా సమయంలో పోలీసులు అరెస్టు చేసి జైల్లో పెట్టారు. 2018లో తిరిగి రాష్ట్ర కమిటీ బాధ్యతల్లోకి వచ్చి కార్యదర్శివర్గ సభ్యులుగా ఉన్నారు.










