Feb 02,2022 09:30
  • విశాఖ స్టీల్‌, ఎల్‌ఐసి, హెచ్‌పిసిఎల్‌ ప్రయివేటీకరించొద్దు

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌లో రాష్ట్రానికి సంబంధించిన విభజన హామీలు లేవని వైసిపి పార్లమెంటరీ పార్టీ నేత వి.విజయసాయిరెడ్డి విమర్శించారు. మంగళవారం నాడిక్కడ ఏపి భవన్‌లో వైసిపి ఎంపిలతో కలిసి మీడియాతో ఆయన మాట్లాడారు. ''కేంద్ర బడ్జెట్‌ పూర్తిగా నిరుత్సాహపరిచింది. చాలా అంశాలపై ఎలాంటి ప్రస్తావన లేదు. ఆర్థిక మంత్రి చెప్పిన సబ్‌ కా వికాస్‌ అసలు లేదు. రాష్ట్రాలకు ప్రయోజనకారిగా ఏ మాత్రం లేదు'' అని అన్నారు.
    ''కేంద్ర పన్నుల్లో రాష్ట్ర వాటా అత్యల్పంగా ఉంది. రాష్ట్రాలకు మూలధన వ్యయం కింద లక్ష కోట్లు ఇస్తామన్నారు. ఇప్పుడున్న ఫార్ములా మేరకు రాష్ట్రానికి కేవలం రూ.4 వేల కోట్లే. వెంటనే ఆ ఫార్ములాను సవరించాలి. రాష్ట్ర వాటా పెంచాలి. గత ఏడాది ఏపికి వచ్చింది కేవలం రూ.35 వేల కోట్లు మాత్రమే. అదే సమయంలో ఉత్తరప్రదేశ్‌కు ఏకంగా రూ.1.53 లక్షల కోట్లు. ఆ స్థాయిలో వ్యత్యాసం ఉంది. వెంటనే దీన్ని సవరించాలి'' అని తెలిపారు. ''ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి 2020-21లో ద్రవ్యలోటు 5.38 శాతం కాగా, ఆ తర్వాత ఏడాది అంటే 2021-22లో ద్రవ్యలోటు 3.49 శాతం'' అని అన్నారు. ''ఉపాధి హామీలో కవరేజ్‌ ఏ మాత్రం పెంచలేదు. కేంద్ర ప్రభుత్వంలో దాదాపు 8 లక్షల ఉద్యోగాలు ఖాళీగా ఉన్నా, ఏ ప్రకటనా లేదు. పిఎం కిసాన్‌ పథకంలో భూమిలేని రైతులను పూర్తిగా వదిలేశారు. ధాన్యం సేకరణకు స్పష్టమైన పాలసీ లేదు'' అని అన్నారు. ''ఎల్‌ఐసి, హెచ్‌పిసిఎల్‌ వంటి లాభాలు గడిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థలను ప్రైవేటీకరించాలన్న కేంద్రప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తున్నాం. విశాఖ ఉక్కు కంపెనీ కూడా లాభాల్లో ఉందని, అమ్మవద్దని కోరుతున్నాం'' అని పేర్కొన్నారు.