న్యూఢిల్లీ : రానున్న మూడేళ్లలో 400 వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టనున్నట్లు ఆర్ధికశాఖా మంత్రి నిర్మలా సీతారామన్ చెప్పారు. కేంద్ర బడ్జెట్ ప్రసంగంలో ఆమె ఈ విషయం వెల్లడించారు. ఇప్పటికే వంద వందే భారత్ రైళ్లను ప్రవేశపెట్టాలని గతంలోనే నిర్ణయించగా..ఇప్పుడు అదనంగా మరో 400 రైళ్లను వచ్చే మూడేళ్లలో ప్రవేశపెట్టనున్నారు. భారత రైల్వే సంస్థే ఈ రైళ్లను రూపొందించనుంది. గతంలో స్టీల్‌తో రైలు పెట్టేలను తయారు చేసేవారు. కానీ వందే భారత్ రైళ్లను మాత్రం తక్కువ బరువున్న అల్యూమినియంతో తయారు చేయబోతున్నారు. దీని వల్ల ఒక్క రైలుకు 50 టన్నుల బరువు తగ్గనుంది. దీంతో రైళ్లను నడిపేందుకు ఇంధనం, విద్యుత్ ఖర్చు తక్కువగా ఉంటుంది. ఇప్పటికే దేశంలో 75 రూట్లలో 44 వందే భారత్ రైళ్లను 2023 అగస్టు 15 నాటికి ప్రవేశపెడతామని ప్రధాని మోడీ గతంలోనే ప్రకటించారు.. కాగా రైతుల ఉత్పత్తులకు గిరాకీ పెంచే లక్ష్యంతో వన్ స్టేషన్-వన్ ప్రొడెక్ట్ అనే కాన్సెప్ట్‌ను అమలుచేయబోతున్నట్లు నిర్మలాసీతారామన్ చెప్పారు. రానున్న మూడేళ్లలో వంద సరుకు రవాణా టెర్మినల్స్‌ను కూడా నిర్మించబోతున్నట్లు చెప్పారు. గత ఏడాది రైల్వేలకు పెట్టుబడి వ్యయం కింద రూ.2.14 లక్షల కోట్లు కేటాయించగా, ఈ ఏడాది రూ. 2.38 లక్షల కోట్లను ప్రతిపాదించారు. వీటిల్లో లక్ష కోట్ల రూపాయలను బడ్జెటేతర మార్గాల ద్వారా సమకూర్చుకుంటామని తెలిపారు.










