Jul 08,2023 21:12
  • ప్రతి పది ఇళ్ళకు ఏడు ఇళ్ళలో ఇదే పరిస్థితి
  • ఐక్యరాజ్య సమితి అధ్యయనంలో వెల్లడి

ఐక్యరాజ్య సమితి : నీటి సదుపాయం లేని ఇళ్ళలో జీవించే 180కోట్ల మంది ప్రజలకు ప్రధానంగా తాగునీరు తీసుకువచ్చేది మహిళలు, బాలికలేనని యునిసెఫ్‌, ప్రపంచ ఆరోగ్య సంస్థలు వెలువరించిన కొత్త నివేదికలో పేర్కొన్నాయి. సాధారణంగా ప్రతి పది ఇళ్ళకు గానూ ఏడు ఇళ్ళలో 15ఏళ్ళు అంతకుపైబడిన బాలికలు, మహిళలు నీటినిమోసుకు వస్తారని ఆ నివేదిక పేర్కొంది. ప్రతి పది ఇళ్ళకుగానూ మూడు ఇళ్ళల్లో నీటిని మోసుకువచ్చే బాధ్యత పురుషులదిగా వుంది. ఈ నీటిని తీసుకురావడం కోసం సుదూర ప్రయాణాలు చేయడం కూడా చాలా సర్వసాధారణమైన అంశంగా వుంటుంది. దీనివల్ల వారికి చదువుకోవడానికి సమయం తగ్గిపోతుందని, లేదా ఇతర పనులు చేసుకోవడానికి, విశ్రాంతి తీసుకునే సమయం కోల్పోతారని నివేదిక పేర్కొంది. నీటిని మోసుకువచ్చే క్రమంలో పొంచి వుండే ప్రమాదాలు, గాయాలు గురించి ఇక చెప్పక్కర్లేదు. ఇప్పటికి కూడా 50కోట్ల మందికి పైగా ప్రజలు ఇతర కుటుంబాలతో కలిసి తమ పారిశుధ్య సదుపాయాలను పంచుకోవాల్సి వస్తోంది. దీనివల్ల మహిళల గోప్యత, వారి భద్రత దెబ్బతింటోంది. అందుబాటులో వును డేటా ప్రకారం, 51 దేశాల్లో నిరుపేద కుటుంబాల్లోని మహిళలు, కిశోరప్రాయంలోని బాలికలు, వికలాంగులు ఇటువంటి సౌకర్యాలు లేక ఇబ్బందులు పడుతున్నారని నివేదిక పేర్కొంది. ''2000-2022 మధ్య కాలంలో ఇళ్ళకు తాగునీరు, పారిశుధ్యం, శుభ్రతపై పురోగతి'' అను శీర్షికతో జరిగిన అధ్యయనంలో 172 పేజీల నివేదిక వెలువడింది. లింగ సమానత్వానికి దోహదపడే ఈ విషయంలో పురోగతి సాధించడానికి మరింత కృషి, చర్యలు అవసరమనిపేర్కొంది. జాతీయ గణాంకాలు అందుబాటులో వును దేశాల్లో లింగ అసమానతలపై కూలంకష విశ్లేషణ జరిగింది. తాగునీరు, పారిశుధ్యం, శుభ్రత (వాష్‌) అందుబాటులో లేక మహిళలు పడే ఇబ్బందులను ఈ నివేదిక ప్రముఖంగా ప్రస్తావించింది. ఇళ్ళ వద్ద కనీసం సబ్బు, నీరుతో తమ చేతులు కడుక్కోలేనివారు దాదాపు 200కోట్ల మంది వున్నారని నివేదిక అంచనా వేసింది. అయితే, 2015-2022 మధ్య కాలంలో వాష్‌కుసార్వజనీన లభ్యత సాధించడం దిశగా కొంత పురోగతి చోటు చేసుకుందని అధ్యయనంలో వెల్లడైంది.