Feb 04,2022 06:52

రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధం కావడంలేదు. ఉద్యోగులపై బదులు కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కేంద్రీకరించి వుంటే కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన వాటిలో కొన్నింటినైనా సాధించుకోవటం సాధ్యమై ఉండేది. రాష్ట్ర ప్రజలు సైతం ప్రభుత్వం వెనుక ఉండేవారు. రాష్ట్రానికి రావలసిన న్యాయమైన హక్కుల కోసం పోరాటానికి పూనుకోకుండా... కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం...ఉద్యోగుల వేతనాలపై దాడి చేయటం సరైనది కాదు. దీనివలన జగన్‌ ప్రభుత్వం ప్రజలకు మరింత దూరమవుతుంది.

     వై.ఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డి నాయకత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం, వైఎస్‌ఆర్‌సిపిలు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులపై యుద్ధం ప్రకటించాయి. ఈ విధంగా చేయటానికి ఉద్యోగులు చేసిన నేరం ఏమీ లేదు. వేతన సవరణలో తమకు న్యాయంగా పెరగవలసిన జీతాలు, అలవెన్సులను రాష్ట్ర ప్రభుత్వం తగ్గించటమే ఉద్యోగుల ఆందోళనకు కారణం. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులతో చర్చించి సమస్యను పరిష్కరించుకోవలసింది పోయి, పంతంగా వ్యవహరించటంతో సమస్య జఠిలమౌతున్నది. బిజెపి నాయకత్వం లోని రాష్ట్ర ప్రభుత్వాలు కూడా అమలు చేయటానికి సాహసించని... కేంద్ర ప్రభుత్వపు, నీతి ఆయోగ్‌ ఆదేశాలను...రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం ఆలోచన లేకుండా అమలు చేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకు పెంచిన జీతాలు, అలవెన్స్‌లలో కోత పెట్టటం అందులో భాగమే. ఈ చర్యలను నిరసిస్తూ ఆందోళనకు దిగిన ఉద్యోగులపై అణచివేత చర్యలు అందులో భాగంగా ఉన్నాయి.
    రాష్ట్ర ప్రయోజనాలకు విఘాతం కలిగిస్తున్న కేంద్ర ప్రభుత్వం, బిజెపి లను వదిలివేసి, తన వేలితో తన కన్ను పొడుచుకున్న విధంగా వైఎస్‌ఆర్‌సిపి ప్రభుత్వం ఉద్యోగులపై యుద్ధం చేస్తున్నది. కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం రాష్ట్రానికి తీరని ద్రోహం చేస్తున్నది. విభజన హామీలు, ప్రత్యేక హోదా, రాష్ట్ర ఆర్థికలోటు భర్తీ, పోలవరం ప్రాజెక్టుకు పెరిగిన అంచనాల మేరకు నిధులు మంజూరు, కడప ఉక్కు, విశాఖ రైల్వే డివిజన్‌, కేంద్ర విద్య, వైద్య కేంద్రాల ఏర్పాటు తదితరాలన్నింటిలోనూ రాష్ట్రానికి అన్యాయమే చేస్తున్నది. పైగా రాష్ట్రంలోని ఒకే ఒక భారీ పరిశ్రమ విశాఖ ఉక్కును ప్రైవేటు వారికి కట్టబెట్టటానికి పూనుకున్నది. ఇన్ని విధాలుగా రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటానికి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికీ సిద్ధం కావడంలేదు. ఉద్యోగులపై బదులు కేంద్ర ప్రభుత్వంపై పోరాటానికి కేంద్రీకరించి వుంటే కేంద్రం నుండి రాష్ట్రానికి రావలసిన వాటిలో కొన్నింటినైనా సాధించుకోవటం సాధ్యమై ఉండేది. రాష్ట్ర ప్రజలు సైతం ప్రభుత్వం వెనుక ఉండేవారు. రాష్ట్రానికి రావలసిన న్యాయమైన హక్కుల కోసం పోరాటానికి పూనుకోకుండా... కేంద్ర ప్రభుత్వ ఆదేశానుసారం...ఉద్యోగుల వేతనాలపై దాడి చేయటం సరైనది కాదు. దీనివలన జగన్‌ ప్రభుత్వం ప్రజలకు మరింత దూరమవుతుంది.
    రాష్ట్ర ప్రభుత్వం ఐ.ఆర్‌ కన్నా సవరించిన వేతనాలను తగ్గించింది. ఐఆర్‌ 27 శాతం ఇచ్చి, వేతన సవరణలో దానికి 23 శాతానికి కుదించింది. ఎందుకు కుదించారని ఉద్యోగులు ప్రశ్నిస్తే రాష్ట్ర పరిస్థితిని, ఆదాయాన్ని ఉద్యోగులు కూడా పరిగణన లోకి తీసుకోవాలని చెబుతున్నది. తొమ్మిది నెలల క్రితం ఐ.ఆర్‌ ప్రకటించినపుడు లేని కొత్త పరిస్థితులు ఇపుడేం వచ్చాయనేది రాష్ట్ర ప్రభుత్వమే సమాధానం చెప్పాలి. వచ్చిన మార్పల్లా ఒకటే. సరళీకరణ విధానాల అమలు వేగాన్ని పెంచిన కేంద్ర ప్రభుత్వం ఉద్యోగుల సంఖ్యను, వారికి ఇస్తున్న వేతనాలను తగ్గించాలని రాష్ట్రాలపై ఒత్తిడి తెస్తున్నది. మన రాష్ట్రంపై కూడా ఇదే విధంగా వత్తిడి చేస్తున్నది. ఈ మధ్య రాష్ట్రానికి వచ్చిన నీతి ఆయోగ్‌ అధికారులు కూడా ఉద్యోగుల వేతనాల తగ్గింపుపై ప్రభుత్వంతో ప్రత్యేకంగా చర్చించి వెళ్ళారు. అందుకనుగుణంగానే రాష్ట్ర ప్రభుత్వం ఐ.ఆర్‌ కన్నా ఉద్యోగుల వేతనాల పెంపులో కోతలు విధించింది. నిన్న రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ కోసం నియమించిన కమిటి, దానికి నిర్దేశించిన అంశాలను పరిశీలిస్తే ఇది మరింతగా స్పష్టమౌతుంది. ప్రస్తుతం చెల్లిస్తున్న జీతభత్యాలను సమీక్షించి, వాటిని తగ్గించటానికి ఉన్న అవకాశాలను పరిశీలించాలని, సంస్థ ఆర్థిక పరిస్థితులను పరిగణనలోకి తీసుకొని సిఫార్సులు చేయాలని సూచిస్తూ, గత సాంప్రదాయాలకు భిన్నంగా వేతన సవరణ కోసం విద్యుత్‌ సంస్థలతో సంబంధం లేని ఐఎఎస్‌ అధికారిని నియమించింది. దీనితో ప్రభుత్వ అభిప్రాయం ఏమిటో స్పష్టమౌతున్నది. వేతన సవరణ అంటే పెరిగిన ధరలకు అనుగుణంగా ఉద్యోగులు, కార్మికులకు వేతనాలు పెంచటం అన్నదాని స్థానంలో వేతనాలను తగ్గించటం అనే మార్పును తీసుకురావాలని రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నట్లు ఈ అంశాలు స్పష్టం చేస్తున్నాయి.
    రాష్ట్ర ఆదాయాన్ని గురించి ఉద్యోగులు ఆలోచించాలని చెబుతున్న ప్రభుత్వం ఆదాయాన్ని ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టటానికి ఎందుకు పూనుకున్నది? దేశంలో సౌర విద్యుత్‌ ధరలు వేగంగా తగ్గుతున్నాయి. 2010లో మొదటగా సౌర విద్యుత్‌ ఉత్పత్తి కేంద్రం ప్రారంభమైనపుడు యూనిట్‌ విద్యుత్‌ సగటు ధర 12.16 రూపాయలు ఉండగా, 2016లో 4.35 రూపాయలకు, 2017లో 3.30 రూపాయలకు తగ్గింది. 2021లో 2.14 రూపాయలకు పడిపోయింది. 11 సంవత్సరాలలో ఆరు రెట్లు తగ్గింది. విద్యుత్‌ రంగంలో సాంకేతికాభివృద్ధి వేగాన్ని పరిగణనలోకి తీసుకుంటే రానున్న 10 సంవత్సరాలలో 10 రెట్లకు పైగా ధరలు తగ్గే అవకాశం ఉంది. అంటే సౌర విద్యుత్‌ యూనిట్‌ పావలా, పది పైసలకు రావచ్చు. ఒకసారి పరికరాలను నెలకొల్పిన తర్వాత విద్యుత్‌ ఉత్పత్తి కోసం పెట్టాల్సిన అదనపు ఖర్చు ఉండదు. కాబట్టి ఈ విధమైన తగ్గుదలకు అన్ని విధాలైన అవకాశాలు ఉన్నాయి. ఇటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నపుడు గత సంవత్సరపు రేటు 2.14 రూపాయల కన్నా ఎక్కువగా యూనిట్‌కు 2.49 రూపాయల చొప్పున 10,000 మెగావాట్లను 25 సంవత్సరాల పాటు రాజస్థాన్‌లో ఉన్న అదాని కంపెనీ నుండి కొనటానికి ఎందుకు పూనుకుంటున్నారు? రాష్ట్రంలో ఉన్న రైతులకు రోజుకు తొమ్మిది గంటల చొప్పున విద్యుత్‌ సరఫరా చేయటం కోసం ఈ ఒప్పందం చేసుకుంటున్నట్లు ప్రభుత్వం చెబుతున్నది. 25 సంవత్సరాలకు చేసుకుంటున్న ఈ ఒప్పందం వలన రోజుకు 9 కోట్ల యూనిట్లు, యూనిట్‌కు సగటున రెండు రూపాయలు అదనంగా చెల్లిస్తున్నామని లెక్కించినా రోజుకు 18 కోట్లు, సంవత్సరానికి 6,570 కోట్లు, 25 సంవత్సరాలలో 1,64,250 కోట్ల రూపాయలు అదాని కంపెనీకి అదనంగా చెల్లిస్తాం. రోజుకు తొమ్మిది గంటల సరఫరా ప్రకారం లెక్కిస్తే రాష్ట్రానికి వచ్చే నష్టం ఇది. రోజుకు సరఫరా అదనంగా పెరిగితే గంటకు రెండు కోట్ల రూపాయల చొప్పున అదనంగా చెల్లించాలి. అదాని కంపెనీకి అప్పనంగా కట్టబెడుతున్న దానిలో ఉద్యోగులకు ఇస్తున్నది ఇరవయ్యో వంతు కూడా లేదే! రాష్ట్రం ముఖం చూడని వారికి లక్షల కోట్ల రూపాయలు కట్టబెడుతూ రాష్ట్ర ప్రజలలో భాగం అయిన ఉద్యోగులకు తామిచ్చిన మధ్యంతర భృతి ప్రకారం వేతనాలు పెంచటానికి ఎంత యుద్ధం చేస్తున్నారు! వైసిపి ప్రభుత్వం రాష్ట్ర ప్రజల కోసం పనిచేస్తున్నదా, అదాని కంపెనీ కోసం పని చేస్తున్నదా ?

                            పెరుగుతున్న రాష్ట్ర జిడిపిలో ఉద్యోగులు, ప్రజలకు వాటా దక్కుతున్నదా ?

రాష్ట్ర జిడిపి 2013-14లో రూ. 4,64,272 కోట్ల నుండి 2019-20లో 11.05 లక్షల కోట్ల రూపాయలకు పెరిగింది. 2020-21, 2021-22 సంవత్సరాల జిడిపి పెంపుదలను కూడా కలుపుకుంటే రాష్ట్రం చీలిపోయిన తర్వాత ఆదాయం దాదాపు మూడు రెట్లు పెరిగింది. రాష్ట్రం చీలిపోయినపుడు ప్రస్తుత ధరలలో తలసరి ఆదాయ పెరుగుదల 2014-15లో 13.08 శాతం ఉండగా, 2015-16లో 15.10, 2016-17లో 13.27, 2017-18లో 14.86, 2018-19లో 10.78, 2019-20లో 11.53 శాతం చొప్పున పెరిగింది. 2014-15లో తలసరి ఆదాయం 1,04,679 రూపాయలు ఉండగా, 2019-20లో 1,88,069 రూపాయలకు పెరిగింది. 2020-21, 2021-22 సంవత్సరాలను కూడా కలుపుకుంటే గత ఏడు సంవత్సరాలలో 100 శాతానికి పైగా తలసరి ఆదాయం పెరిగింది. ఉద్యోగుల జీతాల పెంపు కోసం ఆందోళనకు దిగగానే ప్రభుత్వం రాష్ట్ర ఆదాయం అంతా వారికే ఖర్చు పెడుతున్నట్లు ప్రచారం చేస్తున్నది. జీతాలను ఓ వైపు కుదిస్తూ మరోవైపు అంతా ఉద్యోగులే తింటున్నారని ప్రచారం చేయటంలో అర్ధం ఏమిటి? సాధారణ ప్రజలకు ఆ మాత్రం ఆదాయాలు కూడా పెరగటం లేదనేది నిజమే. రాష్ట్ర ఆదాయంలో ప్రజలకు సరైన వాటా ఎందుకు దక్కటంలేదో, ఆదాయంలో ప్రజలకు తగిన భాగం అందించటానికి తీసుకున్న చర్యలేమిటో వివరించాల్సింది రాష్ట్ర ప్రభుత్వమే.
   అందువలన రాష్ట్ర ప్రభుత్వం అడ్డగోలు వాదనలు, అనవసర యుద్ధాలు విరమించి, ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించటానికి పూనుకోవాలి. అశుతోశ్‌ మిశ్రా కమిషన్‌ నివేదికను ఉద్యోగ సంఘాలకు అందించి, ఆ నివేదికలో చేసిన సిఫార్సుల ఆధారంగా ఉద్యోగ సంఘాలతో చర్చించి, వేతనాలు సవరించటానికి పూనుకోవాలి. విద్యుత్‌ ఉద్యోగుల వేతన సవరణ కోసం గత సాంప్రదాయం ప్రకారం విద్యుత్‌ సంస్థల లోని అధికారులతో వేతన సవరణ కమిటీని ఏర్పాటు చేసి, ఉద్యోగుల వేతనాల పెంపుదలకు అవసరమైన సూచనలు చేసే విధంగా అధ్యయనాంశాలను మార్చాలి.

ఎ. కోటిరెడ్డి

ఎ. కోటిరెడ్డి