కోవిడ్-19 మహమ్మారి వచ్చి రెండేళ్లయినా ప్రపంచాన్ని ఇప్పటికీ అది వణికిస్తూనే ఉంది. కోవిడ్ థర్డ్ వేవ్ మన దేశంలో సామూహిక వ్యాప్తి దశకు చేరుకున్నట్టు ప్రభుత్వం అంగీకరించింది. సామూహిక వ్యాప్తి అంటే వైరస్ ఎవరి నుంచి వచ్చిందో గుర్తించలేని స్థితికి చేరుకోవడమన్నమాట. ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్-కోవిడ్ జినోమిక్స్ సీక్వెన్సింగ్ కన్సార్టియం) కోవిడ్ పరిస్థితిపై ఇచ్చిన వారాంతపు నివేదికలో ఈ విషయం వెల్లడించగానే ప్రభుత్వం దానికి అంగీకరించింది. డెల్టాతో పోల్చితే ఒమిక్రాన్ తీవ్రత తక్కువే అయినా దాని కన్నా వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఒమిక్రాన్ సోకినవారిలో లక్షణాలు స్వల్పంగా ఉండడం, ఆసుపత్రుల్లో చేరే రోగుల సంఖ్య స్వల్పంగా ఉండడం, అంతకుముందు వచ్చిన ఆల్ఫా, డెల్టాలతో పోల్చితే ప్రాణ నష్టం కూడా కొంత తక్కువగా ఉండడంతో ప్రభుత్వం సామూహిక వ్యాప్తి దశను అంగీకరించింది. మొదటి వేవ్ ప్రారంభ దశలో అంటే 2020 ఫిబ్రవరిలో 15 కేసులు బయటపడగానే అమెరికా దానిని సామూహిక వ్యాప్తి దశకు చేరినట్లు ప్రకటించింది. భారత్ మాత్రం 2020 అక్టోబర్ లో దీనిని అంగీకరించినా, అది కూడా కొద్ది రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలకు మాత్రమే పరిమితమని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ సింగ్ సెలవిచ్చారు. మోడీ అసమర్థ నిర్వాకాన్ని కప్పిపుచ్చేయత్నమే తప్ప ఇది మరొకటి కాదు. 2021 మే నెలలో పెద్దయెత్తున విరుచుకుపడిన రెండో వేవ్‌లో కోవిడ్ కేసులు విపరీతంగా పెరిగి, ఆసుపత్రుల్లో బెడ్ల కొరత, ఆక్సిజన్ కొరత, శివ గంగ శవగంగగా మారడం వంటి భయానక పరిస్థితి నెలకొన్నప్పుడూ సామూహిక వ్యాప్తి దశకు కోవిడ్ చేరిందనే విషయాన్ని గుర్తించేందుకు ప్రభుత్వం నిరాకరించింది. కోవిడ్ మరణాల విషయంలో వాస్తవాలను ప్రభుత్వం దాచిపెడుతోందన్న విమర్శలు గుప్పుమన్నాయి. ప్రస్తుతం వ్యాక్సిన్ల వల్లకానీ, ఇప్పటికే వైరస్ బారిన పడడం వల్ల కానీ చాలా మందిలో హైబ్రిడ్ ఇమ్యూనిటీ పెరిగింది. ఒమిక్రాన్ వేరియంట్ తీవ్రత తక్కువగా ఉండడంతో కోవిడ్ విరగడ అయినట్టు భావించి, ట్రేసింగ్, టెస్టింగ్‌పై అశ్రద్ధ వహిస్తున్నది. సామూహిక వ్యాప్తి స్థాయికి వచ్చాక కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఆసుపత్రుల్లో చేరేవారి సంఖ్య, ఐసియు కేసులతోబాటు మరణాలు పెరుగుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ప్రపంచవ్యాపితంగా రోజుకు 22 లక్షల కేసులు 50 వేల మరణాలు నమోదవుతున్నాయి. మన దేశంలో ఒక్క రోజులోనే నాలుగు లక్షల కేసులు, 489 మరణాలు చోటు చేసుకున్నాయి. గడచిన 241 రోజుల్లో ఇదే అత్యథికం. ఆసుపత్రుల్లో చేరుతున్నవారు, మృతుల్లో ఎక్కువమంది వ్యాక్సిన్ వేయించుకోనివారు, వయసు పైబడినవారు, శ్వాసకోశ సంబంధ వ్యాధులు, ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారేనని నివేదికలు ఘోషిస్తున్నాయి. కోవిడ్‌ను ఎదుర్కోవడంలో వ్యాక్సిన్ అత్యంత కీలకం. దీనర్థం వ్యాక్సినే కోవిడ్‌ను పూర్తిగా నివారిస్తుందని కాదు. వ్యాక్సిన్ వేయించుకున్నవారికి కోవిడ్ వచ్చినా ప్రాణాపాయ స్థితి పెద్దగా ఉండదు. వ్యాక్సిన్‌తో బాటు శాస్త్రీయమైన పద్ధతులు అనుసరించేందుకు, ప్రజారోగ్య వ్యవస్థను మెరుగుపరిచేందుకు ప్రభుత్వం కృషి చేయాల్సిన అవసరం ఉంది. ఈ మూడు అంశాల్లోను కేంద్ర ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నది. మూడో వేవ్ ముంచుకొస్తుందని ముందుగానే హెచ్చరికలు ఉన్నా వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేసేందుకు ఎలాంటి చర్యలు చేపట్టలేదు. ఫలితంగా ఇప్పటికీ 50 కోట్ల మందికి టీకా అందని పరిస్థితి. వీరందరికీ టీకాలు వేయాలంటే మరో వంద కోట్లు డోసులు అవసరం. దేశ జనాభా మొత్తానికి బూస్టర్ డోసులు ఇవ్వాలంటే మరో 140 కోట్ల డోసులు కావాలి. హెల్త్ వర్కర్లల్లో 5.5 శాతం, ఫ్రంట్‌లైన్ వర్కర్లలో 6.8 శాతం, అరవై ఏళ్లు పైబడిన వారిలో 16.2 శాతం మందికి ఇప్పటికీ వ్యాక్సిన్ రెండు డోసులు అందలేదు. ఈ స్థితిలో వ్యాక్సిన్ ఉత్పత్తిని పెంచడానికి బదులు ఆ కంపెనీలకు ఇచ్చే ఆర్డరు ప్రభుత్వం తగ్గించడం అత్యంత బాధ్యతారాహిత్యం. మొదటి రెండు వేవ్‌ల అనుభవం తరువాత కూడా ప్రజారోగ్య వ్యవస్థ పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నది. ప్రభుత్వ తీరు చూస్తుంటే కోవిడ్ మహమ్మారి మామూలు జలుబు లాంటిదేనని, ఇది ముగింపు దశకు వచ్చేసిందని భావిస్తున్నట్లుగా ఉంది. ఇది చాలా ప్రమాదకరం. ఒమిక్రానే చివరి వేరియంట్ కాదు, మరిన్ని వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు ఉన్నాయని డబ్ల్యుహెచ్‌ఓ వంటి అంతర్జాతీయ సంస్థలు హెచ్చరిస్తున్నందున దీనిపై ఉదాసీనత ఎంతమాత్రం పనికిరాదు.










