Jan 17,2021 17:14

సెలబ్రిటీల నుంచి సామాన్యుల వరకూ ప్రసారమాధ్యమాల్లో ఎదుర్కొంటున్న ప్రధానమైన సమస్య ట్రోలింగ్‌.. వ్యక్తిగత అభిప్రాయాలను చెప్పుకునే హక్కు అందరికీ ఉంటుంది. అయితే.. గతంలో సెలబ్రిటీల మాటలపై లిమిట్‌గా ట్రోలింగ్‌ జరిగేది. అయితే అది కాస్త శృతిమించి వ్యక్తిగత అభిప్రాయాలపైనా ఈ మధ్య ట్రోలింగ్‌ విపరీతంగా జరుగుతోంది. పరిస్థితి ముదిరి పాకాన పడుతోందనడానికి నటి సమీరారెడ్డిపై జరిగిన ట్రోలింగే ఇందుకు నిదర్శనం.

ట్రోలర్స్‌ పాలిట ఉక్కు 'సమీరం'

పూర్తి పేరు : సమీరారెడ్డి
పుట్టిన తేదీ : 1978, డిసెంబర్‌ 14
పుట్టిన ప్రాంతం : రాజమండ్రి, ఆంధ్రప్రదేశ్‌
నివాస ప్రాంతం : ముంబై, మహారాష్ట్ర
భర్త : అక్షరు వర్దే
పిల్లలు : హన్స్‌ వర్దే, నైరా వర్దే
తల్లిదండ్రులు : చింతపోలిరెడ్డి, నక్షత్రరెడ్డి
సోదరులు : మేఘనారెడ్డి, సుష్మారెడ్డి

    తెలుగమ్మాయి అయినా హిందీలోనే ఎక్కువ సినిమాలు చేసింది. 'జై చిరంజీవ, నరసింహుడు, అశోక్‌' సినిమాలతో తెలుగు ప్రేక్షకుల ఆదరణ పొందిన నటి సమీరారెడ్డి తనకు ఎదురైన చేదు అనుభవం గురించి ప్రసార మాధ్యమాల్లో వ్యక్తిగత అభిప్రాయంగా ఓ వీడియోను పోస్ట్‌ చేసింది. గత సంవత్సరం జులైలో నైరా అనే పాపకు జన్మనిచ్చింది. ఈ సందర్భంగా రెండో గర్భం నుంచి విముక్తి అంటూ తన ప్రసవ సమయంలో అనుభవించిన బాధను వివరించింది. దీంతో అసలు కథ అక్కడే మొదలైంది. తన అభిప్రాయాన్ని వక్రీకరిస్తూ అనేకమంది ట్రోలింగ్‌ మొదలుపెట్టారు. అయితే అప్పటికే ఆరేళ్ల కుమారుడు హన్స్‌ వర్దేకు సమీరా తల్లి. అయితే ఆమె బేబీ బంప్‌ చిత్రాన్ని సామాజిక మాధ్యమాల్లో పోస్ట్‌ చేయడంతో భారీగా ట్రోలింగ్‌ జరిగింది. దీనికి అవాక్కైన సమీరా వీడియో ద్వారా గట్టి సమాధానం చెప్పారు.
    తాను గర్భంతో ఉన్నపుడు ఎదుర్కొన్న మనోవేదన గురించి గుర్తు చేసుకుంది. 'పెళ్ళయ్యాక తనకు కూడా తల్లి కావాలనే కోరిక ఉన్నా గర్భవతి అయిన తర్వాత తనలో వచ్చిన మార్పులు చూసి తనకే నచ్చలేదని పేర్కొంది. ఆ సమయంలో పడిన బాధ కూడా వర్ణనాతీతమని, తాను ముందుగా సిద్ధపడలేదు కానీ అలా జరిగిపోయింది!' అంటూ నెటిజన్స్‌తో తన పర్సనల్‌ ఒపీనియన్‌ని పంచుకుంది.
   'తొలిసారి ప్రెగెంట్‌ అయినప్పుడు తనకు తానే నచ్చకపోయేదాన్నని.. మరోవైపు సోషల్‌ మీడియాలో తన గురించి జనాలు చేసే కామెంట్స్‌ కూడా దారుణంగా ఉండేవి!' అని గుర్తుచేసుకుంది. బాడీ షేమింగ్‌ చేసి, దారుణంగా బాధ పెట్టేవాళ్లని పోస్ట్‌లో పేర్కొంది.
'నా బాడీ గురించి నీచంగా ట్రోల్‌ చేసేవారు. అవన్నీ నన్ను మానసికంగా బాధపెట్టేవి. కానీ రెండోసారి ప్రెగెన్సీ వచ్చినపుడు అలాంటివి పట్టించుకోలేదు' అని చెప్పింది. 'అయితే శరీరంలో వచ్చిన మార్పులపై బాధలేదు.. మరోసారి అమ్మను అవుతున్నాను అనే ఆనందమే ఎక్కువగా ఉండేది. దీనిపై ట్రోల్‌ చేసినా తనకు పెద్దగా ఇబ్బంది అనిపించలేదు' అని తెలిపింది. 'ఇద్దరు పిల్లల తల్లిని కాబట్టి కచ్చితంగా మునపటి షేప్‌ రావడానికి టైమ్‌ పడుతుందనే విషయం అర్థం చేసుకున్నా, ఏదేమైనా నీచమైన ట్రోలింగ్‌ తనకే కాదు.. తనలాంటి అనేకమంది అమ్మాయిలకూ బాధ కలిగించే విషయమే!' అంటుంది సమీరా.
   అయితే గతంలోనూ 'మీటూ' ఉద్యమంలో ఆమె గట్టిగానే స్పందించారు. బాలీవుడ్‌లో నెపోటిజమ్‌ ఎక్కువగా ఉంటుందని.. బ్యాగ్రౌండ్‌ లేకపోతే అక్కడ ఆఫర్స్‌ కూడా రావని సంచలన కామెంట్స్‌ చేసింది. దాంతో పాటు ముద్దు సీన్స్‌ చేయడానికి ఒప్పుకోలేదనీ తనను కొన్ని సినిమాల నుంచి తీసేశారనీ అప్పట్లో తన అభిప్రాయాన్ని గట్టిగానే చెప్పింది సమీరా.