Feb 11,2022 21:01

ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : సుస్థిరత సాధించడానికి ఈ బడ్జెట్‌ దోహదపడుతుందని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ అన్నారు. కేంద్ర బడ్జెట్‌పై రాజ్యసభలో జరిగిన చర్చకు ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్‌ శుక్రవారం సమాధానమిచ్చారు. బడ్జెట్‌లో పేదలకు ఎలాంటి హామీలు ఇవ్వలేదని ప్రతిపక్షాలు చేసిన విమర్శలపై స్పందించిన ఆమె.. ''మానసిక పేదరికం గురించి మాట్లాడాలా? కాస్త స్పష్టంగా చెప్పండి'' అని అన్నారు. దీనికి శివసేన ఎంపీ ప్రియాంక చతుర్వేది అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆర్థిక మంత్రి పేదలను ఎగతాళి చేస్తున్నారని మండిపడ్డారు. దీనిపై స్పందించిన ఆర్థిక మంత్రి ''నేను పేదలను ఎగతాళి చేయడం లేదు. పేదలను అపహాస్యం చేసిన వారితోనే మీ పార్టీ పొత్తు పెట్టుకుంది. మీ (కాంగ్రెస్‌ పార్టీని ఉద్దేశిస్తూ) మాజీ అధ్యక్షుడు గతంలో పేదరికానికి కొత్త అర్థం చెప్పారు. 'పేదరికం అంటే.. దుస్తులు, తిండి, డబ్బు లేకపోవడం కాదు. అది కేవలం మానసిక స్థితి మాత్రమే. ఆత్మ విశ్వాసంతో దాన్ని అధిగమించొచ్చు అని అన్నారు. ఆ పేదరికం గురించే మాట్లాడమంటారా?'' అని అన్నారు. ''రాబోయే 25 ఏళ్లు భారతదేశానికి ముఖ్యమైనవి. భారతదేశం కోసం ఒక విజన్‌ కలిగి ఉన్నాం. 65 సంవత్సరాలు కాంగ్రెస్‌ అధికారంలో ఉన్నప్పుడు ఒక కుటుంబాన్ని ఆదుకోవడం, నిర్మించడం, ప్రయోజనం పొందడం తప్ప ఎటువంటి దృక్పథం లేదు'' అని అన్నారు. కోవిడ్‌-19 మహమ్మారి కారణంగా దెబ్బతిన్న ఆర్థిక వ్యవస్థ నిలదొక్కుకోవడానికి, సుస్థిరత సాధించడానికి ఈ బడ్జెట్‌ దోహదపడుతుందన్నారు. ఈ ఏడాది బడ్జెట్‌ లక్ష్యం ఆర్థిక వ్యవస్థ సుస్థిరంగా కోలుకోవడమేనని చెప్పారు. ఈ మహమ్మారి వల్ల భారత దేశ ఆర్థిక వ్యవస్థ తీవ్రంగా దెబ్బతిందన్నారు. తాను నేరుగా ప్రజల నుంచి ఎన్నిక కాలేదని, తనకు క్షేత్రస్థాయి వాస్తవాలు తెలియవని ప్రతిపక్షాలు ఆరోపించడంపై నిర్మల సీతారామన్‌ మండిపడ్డారు. ప్రతిపక్ష పార్టీల ప్రభుత్వాలు ఉన్న కాలంలోని రాజ్యసభ సభ్యులు కూడా వాస్తవానికి దూరంగానే ఉన్నారా? అని ప్రశ్నించారు. మాజీ ప్రధాన మంత్రి మన్మోహన్‌ సింగ్‌ కూడా వాస్తవాలకు సంబంధం లేకుండా వ్యవహరించారా? అని నిలదీశారు.