ప్రజాశక్తి- జక్కా వెంకయ్య, టి.నర్సింహయ్య, సున్నం రాజయ్య నగర్ (తాడేపల్లి) : సిపిఎం మహాసభల్లో వివిధ రంగాల నుంచి హాజరైన ప్రతినిధులు గత నాలుగేళ్ల కాలంలో తాము నిర్వహించిన పోరాటాల గురించి, భవిష్యత్తు కర్తవ్యాల గురించీ బృందాల వారీగా చర్చించారు. అనంతరం మహాసభకు వాటి సారాంశాన్ని నివేదించారు. నిరుద్యోగ సమస్యపై ఈకాలంలో పెద్దఎత్తున పోరాటాలు జరిపామని, విద్య, ఉపాధి హక్కులకై 4 జాతాలు నిర్వహించామని యువజన రంగం ప్రతినిధులు రామన్న, జయచంద్ర తెలిపారు. భవిష్యత్తులోనూ ఈ పోరాటాలను ఉధృతం చేస్తామని పేర్కొన్నారు. ఫీజు రియంబర్స్‌మెంటు, ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణ అంశాలపై రాష్ట్రవ్యాపితంగా లక్షలాది విద్యార్థులను కదిలించి, పోరాడామని విద్యార్థిరంగం ప్రతినిధి ప్రసన్న వివరించారు. లాఠీఛార్జీ, కేసులూ ప్రయోగించినా విద్యార్థులు ఎదురొడ్డి నిలిచారని చెప్పారు.
మద్యంషాపులకు నిరసనగా 2 జీపుజాతాలు నిర్వహించామని, అనేకచోట్ల నివాస ప్రాంతాల్లో ఉన్న మద్యం దుకాణాలు మూయించామని మహిళాసంఘం ప్రతినిధులు అలివేలు, జ్యోతి తెలిపారు. గురజాడ, కందుకూరి వంటి మహానీయుల వర్థంతి సభలను వేలాదిమంది విద్యార్థులతో జరిపామని తెలిపారు. సమకాలీన సమస్యలపై తాము నిర్వహించిన సాంస్క ృతిక కార్యక్రమాల గురించి ఆ రంగం ప్రతినిధి అనిల్ తెలిపారు. గిరిజన సంఘం ప్రతినిధి రాంబాబు మాట్లాడుతూ... ఆందోళనా కార్యక్రమానికి ముందు రాత్రి నాయకులను హౌస్ అరెస్టు చేసినా- వేలాదిమంది మహిళలు వెనకడుగు వేయకుండా ఐటిడిఎను ముట్టడించిన వైనాన్ని వివరించారు. సామాజిక రంగంలో చేసిన కృషిని, అనుభవాలను ఆనందబాబు, క్రాంతి తెలిపారు. డప్పు కళాకారులకు గుర్తింపు కార్డులు, పెన్షన్లు, ప్రభుత్వ కార్యక్రమాల్లో ప్రదర్శనల అవకాశం తమ పోరాటం ద్వారా సాధించగలిగామని తెలిపారు. పట్టణ సంస్క రణల వ్యతిరేక పోరాటాన్ని స్థానిక సమస్యలతో మేళవించి జరపాలని పట్టణ నివాసితుల రంగం ప్రతినిధి కొండారెడ్డి అన్నారు.
న్యాయవాద రంగంలో వివిధ పరీక్షార్థులకు శిక్షణ ఇస్తున్నామని, జూనియర్ న్యాయవాదులకు ఆర్థిక సహాయం తమ పోరాటం ద్వారానే సాధ్యమైందని ఆ రంగం ప్రతినిధి శ్రీనివాసరావు చెప్పారు. సైన్సు రంగం నుంచి మురళీధర్, శ్రీనివాస్ మాట్లాడుతూ.. యూత్‌ఫెస్ట్, మహిళా ఫెస్ట్ ద్వారా అనేక శాస్త్రీయ ప్రదర్శనలూ, సదస్సులూ నిర్వహించినట్టు చెప్పారు. సోషల్ మీడియా నుంచి జయప్రకాశ్ మాట్లాడుతూ, వాస్తవాలను వివరించి చెప్పటానికి, ఉద్యమాలకు ప్రచారం కల్పించటానికి మరింత కృషి జరగాల్సి ఉందని అన్నారు. సాహిత్యరంగం నుంచి సత్యాజీ మాట్లాడుతూ, వివిధ సందర్భాల్లో నిర్వహించిన జనకవనాలకు మంచి స్పందన లభించిందని చెప్పారు. ప్రస్థానం పత్రిక జనవరి సంచికను 'మాలపల్లి' శత వసంతాల ప్రత్యేక రచనలతో వెలువరిస్తున్నట్టు చెప్పారు. ఆవాజ్ నుంచి చిష్ట్టీ మాట్లాడుతూ, ఎన్‌ఆర్‌సి, సిఎఎ చట్టాలకు వ్యతిరేకంగా సాంస్కృతిక కార్యక్రమాలూ, సమీకరణలు చేపట్టినట్టు చెప్పారు. వైద్యారోగ్య రంగాల్లో ప్రజారోగ్యవేదిక చేపట్టిన కార్యక్రమాలను కామేశ్వరరావు వివరించారు. శిక్షణ, సేవ, సాంస్కృతిక ప్రదర్శనలు - పోటీలు, పరిశోధక రంగాల్లో విజ్ఞానకేంద్రాలు చేస్తున్న ప్రయత్నాలను జివిఎన్ నర్సింహారావు తెలిపారు. విశాఖ రైల్వేజోన్, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ తదితర అంశాలపై ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక కృషిని రెడ్డి శంకరరావు వివరించగా; కడప ఉక్కు, రైతాంగ సమస్యలపై రాయలసీమ అభివృద్ధి వేదిక పోరాటాలను నాగరాజు విశదీకరించారు. రాష్ట్రంలో మానవ హక్కుల సంఘం ఏర్పాటయ్యే విధంగా తాము చేసిన సుదీర్ఘమైన కృషి ఉపయోగపడిందని పౌరహక్కుల సంఘం ప్రతినిధి సురేష్ కుమార్ తెలిపారు. పిడిఎఫ్‌కు చెందిన ఎమ్మెల్సీలు మండలిలో ప్రజాపక్షంగా బలంగా గొంతు వినిపిస్తున్నామని ఆ రంగం ప్రతినిధి సాబ్జీ చెప్పారు. పీఆర్సీ, విద్యారంగంలో మార్పులు విషయంలో ప్రభుత్వం ఏకపక్షంగా వ్యవహరిస్తుందని, ఆ వైఖరిని తాము సోదాహరణంగా ఎండగడుతున్నామని చెప్పారు.










