- బడ్జెట్‌లో కౌలు రైతుల ప్రస్తావన ఏది ?
ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రైతాంగాన్ని ఆదుకోవాలనే ధ్యాస కేంద్ర ప్రభుత్వానికి ఏ మాత్రమూ లేదని, ఏడాది పాటు జరిగిన రైతు ఉధ్యమంలో 735మంది రైతులు అమరులయ్యారని వారి కుటుంబాలకు ఆర్ధిక సహకారం అందిస్తామని లిఖిత పూర్వకంగా హామీనిచ్చి బడ్జెట్‌లో ఒక్క రూపాయి కూడా కేటాయించలేదని కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష,ప్రధాన కార్యదర్శులు వై.రాధాకృష్ణ, పి.జమలయ్య విమర్శించారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటనను విడుదల చేశారు. రైతు ఉద్యమంలో అమరులైన కుటుంబాలకు తక్షణమే ప్రభుత్వం ఆర్థిక సహకారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కౌలు రైతులకు ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి పథకం కింద పెట్టుబడి సాయం అందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం రూ.39.45 లక్షల కోట్లతో 2022-23 సంవత్సరానికి బడ్జెట్ ప్రవేశపెట్టినప్పటికీ... బడ్జెట్‌లో కౌలు రైతులకు సంబంధించి ఎటువంటి ప్రస్తావనా లేదని, సెంటు భూమి కూడా సాగుచేయని భూ యజమానులకు సంవత్సరానికి రూ.6వేలు సాగు పెట్టుబడి నిమిత్తం ఇస్తున్నారని వివరించారు. వాస్తవంగా పంటలు పండిస్తున్న కౌలు రైతులకు పెట్టుబడి సాయం, పంట రుణాలివ్వకుండా మొండి చెయ్యి చూపడం చాలా దుర్మార్గమన్నారు. ఈ ఏడాది ఎరువుల ధరలు 50 శాతం, పురుగుమందులు ధరలు, విత్తనాల ధరలు 40 నుంచి 50శాతం, వ్యవసాయ యంత్ర పరికరాలు 30 శాతం పెరిగాయన్నారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో ఎకరానికి రూ.5వేలనుంచి రూ.7వేల వరకు అదనంగా పెట్టుబడి ఖర్చులు పెరిగాయన్నారు. కౌలు రైతులకు పెట్టుబడి సాయం, పంటరుణాలు, కిసాన్ క్రెడిట్ కార్డులు జారీ చేయాలని ఎపి కౌలు రైతు సంఘం కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.










