ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ కింద ప్రస్తుతం ఉన్న రూ.30 కోట్లను రూ.200 కోట్లకు, నేషనల్ హెల్త్ మిషన్ కింద ప్రస్తుతం ఉన్న రూ.36,576 కోట్లను రూ.37 కోట్లకు పెంచినప్పటికీ, రాష్ట్రాలకు ఇచ్చే గ్రాంట్‌లను రూ.40,649.07 కోట్ల నుంచి రూ.35,052 .55 కోట్లకు కేంద్రం తగ్గించింది. దేశాన్ని నేడు వణికిస్తున్న కోవిడ్-19కి అడ్డుకట్ట వేసేందుకు ప్రత్యేకంగా నిధులు కేటాయించక పోవడం గమనార్హం. దేశంలో మానసిక వ్యాధిగ్రస్తుల సంఖ్య పెరుగుతున్న నేపథ్యంలో నేషనల్ టెలీ మెంటల్ హెల్త్ ప్రోగ్రామ్‌ను ప్రారంభించనున్నట్లు ఆర్థిక మంత్రి తన ప్రసంగంలో పేర్కొన్నారు. ఈ పథకం కింద మానసిక రోగులకు మెరుగైన సేవలు అందిం చాలని కేంద్రం భావిస్తోంది. ఇందుకోసం బెంగళూరులోని నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెంటర్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్, మెడికల్ స్కూల్‌ను (నిమ్‌హాన్స్) నోడల్ ఏజెన్సీగా నియమించి 23 టెలీ మెంటల్ హెల్త్ ఎక్స్‌లెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు బడ్జెట్‌లో రూ.40 కోట్లను కేంద్రం ప్రతిపాదించింది. హెల్త్ రికార్డులను డిజిటలైజేషన్ చేయనున్నట్లు బడ్జెట్ ప్రసంగంలో నిర్మలా సీతారామన్ తెలిపారు.










