Jan 20,2022 07:23

ప్రతిష్టాత్మకంగా జరిగే రిపబ్లిక్‌ డే పరేడ్‌లో మన రాష్ట్రంతో పాటు, అనేక రాష్ట్రాల శకటాలను కేంద్ర ప్రభుత్వం తిరస్కరించడం రాజ్యాంగ విలువలను తుంగలో తొక్కడమే! రాజ్యాంగంలో పేర్కొన్న ఫెడరల్‌ సూత్రాలకు, సమానత్వానికి ఈ చర్య విరుద్ధం. రాజ్యాంగానికి, దాని విలువలకు పునరంకితమౌతామని ప్రతిన చేయడానికే గణతంత్ర దినోత్సవాలను జరుపుకుంటాం. పైగా ఇది 75 సంవత్సరాల స్వాతంత్య్రోద్యమ అమృత ఉత్సవాలను జరుపుకుంటున్న సంవత్సరం. అందుకే, ఈ ఏడాది జరిగే గణతంత్ర దినోత్సవాలకు ఎంతో ప్రాధాన్యత ఉంది. అయితే, రాజ్యాంగంలో పేర్కొన్న సమాఖ్య స్ఫూర్తిని ధ్వంసం చేయడానికి కేంద్రంలోని నరేంద్రమోడీ ప్రభుత్వం ఆ ఉత్సవాలనే వేదికగా చేసుకోవడానికి బరితెగించడం అత్యంత దురదృష్టకరం! దక్షిణాది రాష్ట్రాలలో ఒక్క కర్ణాటక మినహా మిగిలిన అన్ని రాష్ట్రాల శకటాలకు తిరస్కారమే ఎదురుకావడం వివక్ష కాక మరేమిటి? కర్ణాటక బిజెపి పాలిత రాష్ట్రమని ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. దాంతో పాటు, ఆ పార్టీ ఏలుబడి లోని ఉత్తరప్రదేశ్‌, గుజరాత్‌, అరుణాచల్‌ ప్రదేశ్‌, హర్యానా, మేఘాలయ, జమ్ము-కాశ్మీర్‌, ఉత్తరాఖండ్‌, గోవా రాష్ట్రాలతో పాటు త్వరలో ఎన్నికలు జరగనున్న మరో రెండు, మూడు రాష్ట్రాల శకటాలకు మాత్రమే అనుమతి ఇవ్వడంలో అర్థమేమిటి? ఒక రకంగా బిజెపి పాలిత రాష్ట్రాలకే శకటాల ప్రదర్శన పరిమితం కావడం లేదా? దీనిని వివక్ష, పక్షపాతమని కాక మరేమంటాం?
శకటాల రూపకల్పన అంటే ఆషామాషీ కాదు. అవి ఆ రాష్ట్ర ప్రజల ఆత్మగౌరవానికి, సాధించిన ప్రగతికి, సాధించబోయే లక్ష్యాలకు ప్రతీకలు. అందుకే, రాష్ట్ర ప్రభుత్వాలు శకటాల తయారీని ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. అమృతోత్సవాల సందర్భం కావడంతో స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తి, ఆ ఫలాలు ప్రజలకు అందిన తీరుకు పట్టం కట్టేలా శకటాలను రూపొందించాలన్నది ఈ ఏడాది కేంద్ర ప్రభుత్వ నిర్దేశం! స్వాతంత్య్ర పోరాట ఘనతను చాటి చెప్పే అవకాశం కావడంతో అన్ని రాష్ట్రాలు మరింత పట్టుదలగా స్పందించాయి. తమ రాష్ట్రాల విశిష్టతలను చాటి చెప్పేలా శకటాలను రూపొందించాయి. ఇవన్నీ ప్రదర్శనకు నోచుకోవడమంటే దేశ ప్రజలను ఒక్క తాటిపై నడిపిన మహోజ్వల పోరాట చరిత్రను మళ్లీ గుర్తు చేయడమే! అదే జరిగితే స్వాతంత్య్ర పోరాటానికి సంబంధించిన అసలు నిజాలు వెలుగులోకి వస్తాయి. బిజెపి, సంఘ పరివార్‌లు ఆ మహత్తర పోరాటం గురించి ఇంతకాలం ప్రచారం చేసిన అసత్యాలు, స్వాతంత్య్ర సాధనలో తమ పాత్ర ఇసుమంత కూడా లేదన్న నిజం దేశ ప్రజానీకం ముందు బట్టబయలవుతాయి. కేరళ ప్రభుత్వం రూపొందించిన నారాయణ గురు శకటాన్ని, తమిళనాడు ప్రభుత్వం రూపొందించిన తొలి స్వాతంత్య్ర సమరయోధురాలు వేలునాచయ్యర్‌ శకటాన్ని, మన రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాతీయ పతాక రూపకర్త పింగళి వెంకయ్య శకటాన్ని, పశ్చిమ బెంగాల్‌ ప్రభుత్వం రూపొందించిన సుభాష్‌ చంద్రబోస్‌ శకటాన్ని తిరస్కరించడం వెనుక ఈ దుగ్ధే కనిపిస్తోంది. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటి చెప్పాల్సిన గణతంత్ర దినోత్సవాలను సైతం ఏకపక్షంగా మార్చడం, లౌకిక విలువలను పరిహసించేలా వ్యవహరించడం రాష్ట్రాల హక్కులపైన, రాజ్యాంగంపైనా దాడి చేయడంగానే చూడాలి. ఒక పక్క స్వాతంత్య్రోద్యమ స్ఫూర్తిని రాష్ట్రాల శకటాలు వ్యక్తం చేయాలని అంటూనే మరోపక్క ఆ స్ఫూర్తిని దెబ్బతీసేలా వ్యవహరించడంలోనే మోడీ ప్రభుత్వపు నయవంచన వెల్లడవుతోంది.
తమ రాష్ట్ర శకటాన్ని తిరస్కరించడాన్ని కేరళ ప్రభుత్వం తీవ్రంగా నిరసించింది. పశ్చిమ బెంగాల్‌ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రధానికి లేఖ రాశారు. తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం తిరస్కరించిన శకటాన్ని తమ రాష్ట్ర ఉత్సవాల్లో ప్రదర్శించడంతో పాటు, రాష్ట్రమంతా తిప్పుతామని, కేంద్ర ప్రభుత్వ తీరును ప్రజల ముందు ఎండగడతామని ప్రకటించింది. దేశంలోని మిగిలిన రాష్ట్రాలు కూడా తమ నిరసనను ఏదో రూపంలో వ్యక్తం చేస్తున్నాయి. కానీ, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మాత్రం ఈ విషయం ఏమాత్రం పట్టకపోవడం విచారకరం! ఈ ధోరణి చూస్తే ఆత్మగౌరవ నినాదంతో ఒకప్పుడు ఉవ్వెత్తున ఎగిసిన తెలుగుజాతి ఇదేనా అనిపించకమానదు. ఇప్పటికైనా రెండు రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించాలి. లౌకిక, ప్రజాతంత్ర స్ఫూర్తితో కేంద్ర ప్రభుత్వ వివక్షతను ఖండించాలి.