Jul 03,2023 21:15
  • వైసిపి, టిడిపిలకు వి శ్రీనివాసరావు హెచ్చరిక

ప్రజాశక్తి- కృష్ణా ప్రతినిధి, గన్నవరం : బిజెపితో అంటకాగితే మహారాష్ట్రలో ఎన్‌సిపి, శివసేనలకు పట్టిన గతే వైసిపి, టిడిపిలకు పడుతుందని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు హెచ్చరించారు. బిజెపితో అంటకాగిన పార్టీలను ముక్కలు చేయడం, ఆ తర్వాత మింగేయడం ఆ పార్టీ నైజమని తెలిపారు. 14 రోజులుగా సాగుతున్న 'పోలవరం నిర్వాసితుల పోరుకేక' మహా పాదయాత్ర సోమవారం కృష్ణా జిల్లా గన్నవరం నుంచి ఉత్సాహంగా ముందుకు సాగింది. గన్నవరం మండలం విఎన్‌.పురం, పురుషోత్తపట్నం మీదుగా మధ్నాహ్నానికి ముస్తాబాదకు చేరుకుంది. అక్కడ తీన్మార్‌ వాయిద్యాలతో గ్రామ మాజీ సర్పంచ్‌ బొమ్మారెడ్డి రాజశేఖరరెడ్డి, పలువురు రైతులు, సిపిఎం, ప్రజాసంఘాల నాయకులు యాత్ర బృందానికి ఎదురేగి ఘన స్వాగతం పలికారు. అనంతరం మర్రిచెట్టు సెంటర్లో సిపిఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్లం వెంకటేశ్వరరావు అధ్యక్షతన జరిగిన సభలో శ్రీనివాసరావు మాట్లాడుతూ కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం ఉమ్మడి పౌరస్మృతి బిల్లు (కామన్‌ సివిల్‌ కోడ్‌) తీసుకొచ్చి ప్రజల మధ్య మత వైషమ్యాలు రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తోందని విమర్శించారు. వైవిద్యం కలిగిన మన దేశంలో హిందూత్వం పేరుతో ఆధిపత్య ధోరణులను ప్రజలపై రుద్దే ప్రయత్నాలను చేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయాలు వైసిపి, టిడిపి, జనసేన పార్టీలకు అర్థం కావడం లేదని, అందుకే బిజెపికి తోక పార్టీలుగా నడిచేందుకు ప్రయత్నిస్తున్నాయని వివరించారు. ఇదే విధానం కొనసాగితే ఆ పార్టీలను బిజెపి మిగేయడం ఖాయమన్నారు.

  • త్యాగధనుల రుణం తీర్చుకోవాలి

త్యాగధనులైన పోలవరం నిర్వాసితుల రుణం తీర్చుకోవాల్సిన బాధ్యత రాష్ట్రంలోని ఐదు కోట్ల మంది ప్రజలపై ఉందని వి.శ్రీనివాసరావు పేర్కొన్నారు. పోలవరం ప్రాజెక్టు వలన విద్యుత్‌, సాగు, తాగునీరు ప్రయోజనాలు పొందనున్న మనందరం అక్కడి త్యాగధనులకు అండగా ఉండాలని, మద్దతు, సంఘీభావం తెలియజేయాలని కోరారు. పదేళ్ల నుంచి పోలవరం నిర్వాసితుల సమస్య ముందుకు వచ్చినా పాలక పార్టీలు పట్టించుకోలేదన్నారు. జాతీయ ప్రాజెక్టు అయిన పోలవరం నిర్మాణానికి, నిర్వాసితులకు పునరావాసం కల్పించడానికి పూర్తి స్థాయిలో నిధులు ఇవ్వాల్సిన బాధ్యత కేంద్రానిదే తెలిపారు. కేంద్రంలోని మోడీ ప్రభుత్వాన్ని నిలదీసి నిధులు రాబట్టాలని బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంందన్నారు.
సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ పోలవరం నిర్వాసితులు తమ సమస్యల పరిష్కారం కోసం మొక్కవోని దీక్షతో ముందుకు సాగుతున్నారని అన్నారు. పుచ్చలపల్లి సుందరయ్య నడియాడిన గన్నవరం ప్రాంతంలో పోరాట స్ఫూర్తి ప్రతి ఒక్కరిలో ఉందని పేర్కొన్నారు. గిరిజనులకు న్యాయం జరిగే వరకూ ఈ ప్రాంత ప్రజలు వారికి అండగా నిలవాలని కోరారు. గిరిజన సంఘం నాయకురాలు మొడియం నాగమణి, ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్‌, డివైఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి డి.రాము, ఎస్‌ఎఫ్‌ఐ నాయకులు ప్రసన్న కుమార్‌, సిపిఎం కృష్ణా జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు కళ్లం వెంకటేశ్వరరావు, గిరిజనుల పోరాట సంఘం నాయకులు నాగమణి తదితరులు ప్రసంగించారు.

polavaram-porukeka-maha-padayatra-14th-day-meeting-vvr
బహిరంగ సభలో మాట్లాడుతున్న వి వెంకటేశ్వర్లు 

 

polavaram-porukeka-maha-padayatra-14th-day-meeting-vvr
బహిరంగ సభలో మాట్లాడుతున్న ఎస్ఎఫ్ఐ నాయకులు ప్రసన్న

 

బహిరంగ సభలో మాట్లాడుతున్న
బహిరంగ సభలో మాట్లాడుతున్న నిర్వాసితుల సమస్యలు అధ్యయనం చేసిన బృంద సభ్యులు వై.రాము

 

 సమస్యలు అధ్యయనం చేసిన బృంద సభ్యులు వై.రాము
బహిరంగ సభలో మాట్లాడుతున్న ప్రజానాట్యమండలి రాష్ట్ర కార్యదర్శి అనిల్