Jan 28,2022 06:17

దేశమంతటా గణతంత్ర దినోత్సవ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ బీహార్‌లోని గయలో నిరుద్యోగులు ఒక పాసింజర్‌ రైలుకు నిప్పంటించారని, మరో రైలుపై దాడి చేశారన్న వార్త రావడం బాధాకరం. రైల్వేలో ఉద్యోగ ఖాళీల భర్తీకి నిర్వహించిన పరీక్షలు జరిపిన తీరు, ఎంపిక విధానం, ఇతర అవకతవకలకు వ్యతిరేకంగా నిరుద్యోగులు ఆందోళనలకు దిగారు. పలు చోట్ల రైల్వే ట్రాక్‌లపై బైఠాయించి, నిరసన వ్యక్తం చేశారు. అభ్యర్ధుల అభ్యంతరాలను, ఇతర సమస్యలను తీవ్రంగా పరిశీలించి, పరిష్కారిస్తామని రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్‌ ప్రకటించడం, ఆ వెంటనే ఎన్‌టిపిసి (నాన్‌ టెక్నికల్‌ పాపులర్‌ కేటగిరీస్‌) లెవల్‌ 1 పరీక్షలను రద్దు చేస్తూ రైల్వే బోర్డు నిర్ణయించడం చకచకా జరిగిపోయాయంటే ఆందోళన ఎంత తీవ్రంగా జరిగిందో విదితమవుతోంది. బీహార్‌ ఘటన సంచలనాత్మకం అవుతున్నా ఇలాంటి పరిస్థితి నివురుగప్పిన నిప్పులా దేశమంతటా ఉంది. పాలకులు ఈ ప్రమాద ఘంటికల్ని సీరియస్‌గా తీసుకొని దిద్దుబాటు చర్యలు చేపట్టడం అవశ్యం.
నిరుద్యోగం తీవ్రంగా పెరిగిపోతున్నా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధి కల్పనా చర్యలను చేపట్టకపోవడం గర్హనీయం. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలంటూ 2014 ఎన్నికల్లో హామినిచ్చి గద్దెనెక్కిన నరేంద్ర మోడీ ఆ ఊసే ఎత్తలేదు. కొత్త ఉద్యోగాలివ్వలేదు సరికదా ఉన్న ఉద్యోగులకు ప్రమోషన్లు సైతం ఇవ్వకపోవడం దారుణం. గత ఆరేళ్లుగా కేంద్ర మంత్రిత్వ శాఖల్లో ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టకపోవడంతో 30 శాతం కొలువులు ఖాళీగా ఉండిపోయాయని సిఎస్‌ఎస్‌ ఫోరం పేర్కొంది. అధికార కార్యకలాపాలు సజావుగా సాగేందుకు అత్యంత కీలకమైన కేంద్ర సెక్రటేరియట్‌ సర్వీసెస్‌ (సిఎస్‌ఎస్‌) లోని మధ్యతరగతి ర్యాంకు నుంచి సీనియర్‌ ర్యాంకులకు చెందిన అధికారులకు పదోన్నతి కల్పించలేదు. అనేక మంది ఉద్యోగులు, అధికారులు తాము రిటైర్‌ అవబోతున్నామని, న్యాయబద్ధంగా తమకు ఉద్యోగోన్నతి కల్పించాలని డిపార్ట్‌మెంట్‌ ఆఫ్‌ పర్సనల్‌, ట్రైనింగ్‌ (డిఒపిటి)కు విన్నవించినా ఫలితం లేకపోయింది. కేంద్రం కళ్లు తెరిపించాలన్న ఆశాభావంతో సిఎస్‌ఎస్‌ ఫోరం గత వారం ట్వీట్ల ఉద్యమాన్ని చేపట్టింది. సెక్షన్‌ ఆఫీసర్‌, అండర్‌ సెక్రటరీ, డిప్యూటీ సెక్రటరీ, డైరెక్టర్‌, జాయింట్‌ సెక్రటరీ ర్యాంకుల్లో 6,210 ఆఫీసర్ల పోస్టులు ఉండగా, వీటిలో 1839 ఖాళీలున్నాయి. దైనందిన పాలనా వ్యవహారాల్లో కీలక పాత్ర వహించే సిఎస్‌ఎస్‌ అధికారుల విషయంలోనే కేంద్ర ప్రభుత్వం ఇంతటి నిర్లక్ష్యం వహిస్తుంటే సాధారణ ఉద్యోగుల విషయం ఇంకేం పట్టించుకుంటుంది? కొత్త నియామకాలేం జరుపుతుంది? ఉపాధి కల్పనలోనూ సామాజిక న్యాయాన్ని అమలు చేయడంలోనూ ముందున్న ప్రభుత్వ రంగ పరిశ్రమల్ని ప్రైవేటీకరించేందుకు లేదా మూసివేసేందుకూ ప్రయత్నించడం మరింత దారుణం.
కేంద్రం తీరలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వ పనితనమేమీ అందుకు భిన్నంగా లేదు. ఏటా జాబ్‌ క్యాలెండర్‌ అంటూ తమ పార్టీ ఎన్నికల ప్రణాళికలో ఊదరగొట్టిన నేటి ముఖ్యమంత్రి గ్రామ, వార్డు సచివాలయాల్లో తప్ప ఇతర ఉద్యోగ నియామకాల గురించి పట్టించుకున్నది లేదు. కాంట్రాక్టు ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగుల క్రమబద్ధీకరణ, సమాన పనికి సమాన వేతనం వంటి హామీలూ అమలుకు నోచుకోలేదు. రిటైర్‌మెంటు వయస్సును రెండేళ్లు పెంచడంతో నిరుద్యోగ యువతీయువకుల ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. ఇప్పటికే జాబ్‌ క్యాలెండర్‌ విషయంలో నిరాశ చెందిన నిరుద్యోగుల కడుపు మంట దీంతో మరింత పెరిగింది. ఒకవైపు ఆర్థిక మాంద్యం మరోవైపు కోవిడ్‌ విపత్తు మూలంగా ఉపాధి, ఆదాయాలు లేక ప్రజా జీవనం అతలాకుతలం అవుతోంది. ఈ పరిస్థితుల్లో ప్రజలకు ముఖ్యంగా చేవ కలిగిన యువతీ యువకులకు ఉపాధి కల్పనపై కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించడం ఎంతో అవసరం. అభివృద్ధి అప్పుడే సాధ్యం. పాలకులు అందుకు పూనుకోకపోతే సంఘటితంగా ఉద్యమించి, ఉపాధి సాధించుకోవడమే యువత ముందున్న మార్గం. ఆ దిశగా కదిలి సర్కార్ల మెడలు వంచాలి. మహాకవి శ్రీశ్రీ పేర్కొన్నట్టు 'ముందు తరం దూతలు' అందుకు నడుం బిగించాలి.