Dec 29,2021 22:13

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- జక్కా వెంకయ్య, టి నర్సింహయ్య, సున్నం రాజయ్య నగర్‌ (తాడేపల్లి) :ప్రజల వెన్నంటే పార్టీ నిలవాలని, వారెదుర్కొంటున్న సమస్యలపై జోక్యం చేసుకొని పని చేయాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు బివి రాఘవులు పిలుపునిచ్చారు. అదే ఉద్యమ విస్తరణకు, సంఘటితానికి మార్గమన్నారు. ఐక్యతతో ఆ కర్తవ్యాన్ని నిర్వర్తించాలని చెప్పారు. బుధవారం సిపిఎం 26వ రాష్ట్ర మహాసభ ముగింపు ఉపన్యాసం చేశారు. ఉద్యమ విస్తరణ తిరోగమనంలో పడిందని నీరసించే వారు ఈ కాలంలో అంతర్జాతీయంగా, జాతీయంగా చోటు చేసుకున్న పరిణామాలను, ఉధృత ప్రజా పోరాటాలను గుర్తెరగాలని సూచించారు. 'చిలీలో ప్రజా కంటక ప్రభుత్వాన్ని ప్రతిఘటనా ఉద్యమాలతో గద్దె దించి వామపక్ష అభ్యర్ధిని గెలిపించారు. అఘ్గనిస్తాన్‌లో తాలిబాన్లు ఛాందస వాదులైనప్పటికీ అంత పెద్ద అమెరికాను దేశం నుండి పారిపోయేలా చేశారు. జగ మొండి మోడీనే సాగు చట్టాలు ఉపసంహరించే వరకు రైతులు వదలి పెట్టలేద'న్నారు. ఈ అనుభవాలే ఉద్యమ గమనానికి గుణపాఠాలని వివరించారు. సరళీకరణ విధానాలచ్చాక ప్రజల జీవితాల్లో పెను మార్పులచ్చాయని, అందుకనుగుణంగా పోరాట పంథాను రూపొందించుకోవాలని చెప్పారు. కూలి, వేతనాల పెంపు, భూపంపిణీ వంటి వర్గ సమస్యలపై పోరాడుతూనే, నివాస ప్రాంతాల్లో ప్రజలెదుర్కొంటున్న సమస్యలపై అధ్యయనం చేసి పోరాటాల్లోకి ప్రజలను సమీకరించాలన్నారు. సరళీకరణ వల్లనే మతతత్వ, అస్థిత్వ వాదాలు ప్రబలుతున్నాయని, వాటిని సమర్ధవంతంగా ఎదుర్కోవాలంటే ప్రజలెదుర్కొంటున్న ఇబ్బందులపై కేంద్రీకరించడమొక్కటే మార్గమన్నారు. విద్య, వైద్యం ఇత్యాది సేవలను ప్రజలు కొనుక్కోవాల్సి వస్తోందని రాఘవులు వివరించారు. సామాజిక పోరాటాలు నిర్వహించాలని, కళా, సాంస్కృతిక రంగాల్లో పని చేయాలన్నారు.