Dec 29,2021 22:28

- మతోన్మాద బిజెపిని అడ్డుకుందాం
-రాజకీయ నిర్మాణ నివేదికపై చర్చకు సమాధానమిస్తూ మధు

ప్రజాశక్తి ా జక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్‌ (తాడేపల్లి) :ప్రజా వ్యతిరేక విధానాలపై రాజీలేని పోరాటం కొనసాగుతుందని సిపిఎం 26వ రాష్ట్ర మహాసభ ముగింపు రోజైన బుధవారం నాడు ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు స్పష్టం చేశారు. రాజకీయ నిర్మాణ నివేదికపై జరిగిన చర్చల్లో జిల్లాల నుంచి 37 మంది, ప్రజా సంఘాల నుంచి 36 మంది పాల్గన్నారు. ఈ చర్చకు మధు సమాధానమిచ్చారు. ప్రాథమిక శాఖ నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం వరకూ పటిష్ట నిర్మాణంతో పార్టీని బలోపేతం చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన వివరించారు. దేశవ్యాప్తంగా మతతత్వ బిజెపి ప్రజల్లో చీలికలు తీసుకొచ్చేందుకు పనిచేస్తోందని, రాష్ట్రంలోనూ చాప కింద నీరులా వివిధ రూపాల్లో దాని కార్యాకలాపాలు విస్తరిస్తున్నాయని తెలిపారు. బిజెపి ప్రమాదాన్ని ఎప్పటికప్పుడు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
రాష్ట్రంలో జనరంజక హామీలతో అధికారంలోకి వచ్చిన వైసిపి ప్రభుత్వం ప్రజల్లో అనేక భ్రమలు కల్పించిందనీ, ఇప్పుడు ఆ భ్రమలన్నీ తొలగిపోతున్నాయని తెలిపారు. గతంలో టిడిపి ప్రభుత్వం వ్యవహరించిన విధంగానే వైసిపి కూడా బిజెపి పట్ల మెతక వైఖరి అవలంబిస్తోందని చెప్పారు. రాష్ట్రంలో వైసిపి ప్రభుత్వం తీసుకొచ్చిన ప్రజా వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సూత్రబద్ధమైన వైఖరితో పోరాటాలు చేశామని ఆయన తెలిపారు. మతోన్మాద చర్యలను, నయా ఉదారవాద, ఆర్థిక సరళీకరణ విధానాలపై ఇక ముందు కూడా పోరాటాలు కొనసాగించాలన్నారు. రాజధానిగా అమరావతి ఉండాలని, రాజధాని ప్రాంత ప్రజల సమస్యలను పరిష్కరించాలని తొలి నుంచి పోరాడుతున్నది కూడా సిపిఎం ఒక్కటేనని ఆయన తెలిపారు. విభజన హామీలను నీరుగార్చి ద్రోహం చేసిన బిజెపితో కలిసి ఇతర పక్షాలు ఆందోళనలు చేపట్టిన సందర్భంలో మినహా రాజధాని ప్రాంత ప్రజల పక్షాన సూత్రబద్ధ పోరాటం చేస్తున్నది కూడా సిపిఎం మాత్రమేనని మధు ఉద్ఘాటించారు.
దశలవారీ మద్య నిషేదం అమల్జేయాలని, ఇసుక విధానాన్ని ప్రజానుకూలంగా సవరించాలని, శాసన మండలి రద్దు నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని, ప్రపంచ బ్యాంకు షరతులకు తలగ్గి పాఠశాల విద్యారంగంలో తీసుకొచ్చిన వినాశకర విధానాలను ఉపసంహరించుకోవాలని పోరాటాలు సాగించామనీ, అలాగే మున్సిపల్‌ కార్మికుల సమస్యలపైనా పోరు సాగించామని చెప్పారు. ఇటు వైసిపి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక చర్యలను, అటు బిజెపి మతోన్మాద విధానాలను తిప్పికొట్టేలా ఇక ముందు కూడా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అధికారంలో ఉన్న వైసిపి, ప్రతిపక్ష టిడిపి రెండూ కూడా ఎన్‌డిఎలో లేకున్నా బిజెపికి వంత పాడుతున్నాయని, జనసేన కూడా బిజెపి పంచన చేరిందనీ, రాష్ట్ర ప్రయోజనాలకు ప్రమాదకరమైన బిజెపిని ఒంటరిపాటు చేసే దిశగా ఈ పార్టీలపై ఒత్తిడి పెంచేందుకు కృషి చేయాలన్నారు. మతోన్మాదానికి, బడా కార్పొరేట్‌ అనుకూల విధానాలను వ్యతిరేకిస్తూ విశాల ప్రజా పోరాటాలను నిర్మిండం ద్వారా ప్రజా పునాధిని పెంచుకొని స్వతంత్ర బలాన్ని పెంపొందించుకోవాలని ఆయన పిలుపునిచ్చారు.
కరోనా సమయంలో పార్టీ శ్రేణులు చేసిన సేవలను ఆయన కొనియాడారు. వలస కార్మికులను సొంతూళ్లుకు పంపడం మొదులుకొని ఐసోలేషన్‌ సెంటర్ల నిర్వహణ వరకు దాదాపు రూ.15 కోట్ల విలువైన సేవలను ప్రజలకు అందించామని పార్టీ శ్రేణులను అభినందించారు. భీమవరం మహాసభ నుంచి గడిచిన నాలుగేళ్లలో కొత్తకొత్త ప్రాంతాలకు భూపోరాటాలు, రైతు, వ్యవసాయ కార్మిక ఉద్యమాలు విస్తరించాయని తెలిపారు. కేంద్రం తీసుకొచ్చిన లేబర్‌ కోడ్‌లకు వ్యతిరేకంగా చేపట్టిన మూడు బంద్‌లను సిఐటియు రాష్ట్రంలో జయప్రదంగా నిర్వహించిందని అభినందించారు.