- కేంద్ర బడ్జెట్‌పై సిపిఎం పొలిట్‌బ్యూరో విమర్శ
- కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌ను వ్యతిరేకించాలని పిలుపు
న్యూఢిల్లీ : 2022-23 సంవత్సరానికి కేంద్ర ఆర్థిక మంత్రి మంగళవారం ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో ప్రజల ప్రయోజనాలకు ద్రోహం జరిగిందని సిపిఎం పొలిట్‌బ్యూరో విమర్శించింది. కరోనా కారణంగా ఉపాధి కోల్పోయి, ఆదాయాల్లో భారీగా కోతలు పడి మెజారిటీ ప్రజలు ఇబ్బందులు పడుతున్న నేపథ్యంలో ఆర్థిక మంత్రి ఈ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జిడిపి) కోవిడ్ ముందు నాటి స్థాయిని కొంచెం దాటినా, వ్యక్తిగత వినిమయ వ్యయం మాత్రం ఇప్పటికీ కరోనా ముందు నాటి స్థాయికి చేరలేదు. పరిశ్రమలు పూర్తిస్థాయి సామర్ధ్యంతో పనిచేయడం లేదు. నిల్వలు కూడా పేరుకుపోతున్నాయి. దీనికి ప్రధానంగా ఆర్థిక వ్యవస్థలో అత్యల్పంగా వున్న డిమాండే కారణంగా వుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉపాధి అవకాశాలను సృష్టించే దిశగా, దేశీయ డిమాండ్‌ను పెంచేలా బడ్జెట్‌లో గట్టి చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందని స్పష్టమవుతున్నా వీటిపై దృష్టి సారించడంలో ఈ బడ్జెట్ విఫలమైంది. పట్టణ ఉపాధి హామీ పథకాన్ని తీసుకురావాల్సింది పోయి, అందుకు భిన్నంగా జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకానికి నిధుల కేటాయింపుల్లో రూ.25వేల కోట్లు కోత పెట్టింది. అలాగే ఆహార, ఇంధన, ఎరువుల సబ్సిడీలను కుదించింది. ఆరోగ్యం, గ్రామీణాభివృద్ధి రంగాలకూడా కేటాయింపుల్లో కోత విధించిందని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
2021-22 సంవత్సరానికి సవరించిన అంచనాల ప్రకారం మొత్తం వ్యయంలో రూ.1,74,909కోట్లు మేర పెరుగుదల ఉన్నట్లు బడ్జెట్ పేర్కొంది. జిడిపిలో శాతాన్ని బట్టి చూస్తే 2020-21లో 17.8శాతంగా ఉన్న ఈ వ్యయం 2022-23 బడ్జెట్ అంచనాల్లో 15.3శాతానికి పడిపోయింది. రెవిన్యూ వసూళ్లు ప్రాథమికంగా పెరిగాయి. పెరిగిన పన్ను వసూళ్లు చూస్తుంటే కరోనా సమయంలో కార్పొరేషన్ ట్యాక్స్ పెంపు, జిఎస్‌టి ద్వారా రెవిన్యూ వసూళ్లు పెరిగాయంటే, ఈ కాలంలో కార్పొరేట్లు ఎంతగా లాభాలు నొల్లుకున్నారో స్పష్టమవుతోంది, సామాన్యులపై పరోక్ష పన్నుల మోత మోగించడం ద్వారా పెట్రోలియం ధరలు పెంచేసింది. రెవిన్యూ వసూళ్లతో పోల్చుకుంటే ఖర్చు చేసిన మొత్తాలు చాలా తక్కువ . నిజానికి గతేడాది సవరించిన అంచనాల కన్నా కూడా ఇది చాలా తక్కువ అని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
వ్యయాన్ని కుదించడమనేది కేంద్ర ప్రభుత్వ వ్యయంతోనే అగలేదు. రాష్ట్రాలకు వనరుల బదిలీలను కూడా తగ్గించారు. ఫలితంగా రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఇలాగే చేయాల్సిన పరిస్థితులు తలెత్తుతున్నాయి ఈ బదలాయింపులు 2021-22 సంవత్సరానికి సవరించిన అంచనాల్లో జిడిపిలో 6.91శాతం నుండి 2022-23లో 6.25శాతానికి తగ్గాయి.
రైతులకు ఉద్దేశించిన అన్ని ప్రధాన పథకాల కేటాయింపులకు ఈసారి బడ్జెట్‌లో కోత పడింది. ఎఫ్‌సిఐ సేకరణల కోసం, వికేంద్రీకరణ సేకరణ పథకం కింద కేటాయింపు 28శాతం కుదించబడింది. కనీస మద్దతు ధరకు చట్టపరంగా హామీ కల్పించాలని రైతాంగం పోరాడుతున్న సమయంలో ఈ కేటాయింపులపై కోత పెట్టడం దారుణం. ఎరువుల సబ్సిడీకి నిధుల కేటాయింపు కూడా 25శాతం మేర తగ్గింది. పిఎం-కిసాన్ కింద, 12.5 కోట్ల రైతు కుటుంబాలకు రూ.6 వేలు చొప్పున చెల్లించడానికి రూ.75వేల కోట్లు అవసరమవుతాయి. కానీ కేవలం రూ.68వేల కోట్లు మాత్రమే కేటాయించారు. అలాగే పంటల బీమా పథకం కేటాయింపుల్లో కూడా రూ.500కోట్లు కోత పడిందని పొలిట్‌బ్యూరో పేర్కొంది.
ఇటీవలి కాలంలో, పిల్లల సంక్షేమానికి చిన్నపాటి కేటాయింపులను కూడా ప్రభుత్వం ఖర్చు చేయలేదు. పిల్లల సంక్షేమంపై సవరించిన అంచనాల వ్యయం బడ్జెట్‌లో పేర్కొన్న దానికన్నా రూ.5,700 కోట్లు తక్కువగా వుంది. పాఠశాలలు, అంగన్‌వాడీలు మూత పడడంతో ఎదురైన తీవ్ర విపత్కర పరిస్థితుల నుండి పిల్లలను బయటపడవేసేందుకు సాయపడేలా ఎలాంటి చర్యలు తీసుకోలేదని పొలిట్‌బ్యూరో విమర్శించింది.
ఎస్‌సి, ఎస్‌టిల సంక్షేమానికి నిధుల కేటాయింపులు పెంచినట్లు చూపారు. అది కూడా చాలా స్వల్పం. ప్రస్తుత ద్రవ్యోల్బణాన్ని పరిగణనలోకి తీసుకుంటే ఆ మొత్తాలు కూడా వాస్తవానికి తగ్గినట్టే పరిగణించాలి. పిఎం పోషణ్‌గా పేరు మార్చిన మధ్యాహ్న భోజన పథకానికి కేటాయింపులు పెరగలేదు. గతేడాది 35శాతం మంది బాలలు మధ్యాహ్న భోజన పథకానికి నోచుకోకపోయినా, గతేడాది కేటాయించిన రూ.10,234కోట్లకు ఒక్క రూపాయి కూడా అదనంగా ఈసారి పెంచలేదు. 2లక్షల అంగన్‌వాడీలను ఆధునీకరించే నారీశక్తి కార్యక్రమం గురించి పెద్దగా మాట్లాడిన ఆర్థిక మంత్రి, కేటాయింపులు దగ్గరకొచ్చేసరికి సవరించిన అంచనా ప్రకారం రూ.20వేల కోట్లు వద్దే ఉంచారని పొలిట్‌బ్యూరో పేర్కొంది. .
గత రెండేళ్లలో ఎల్‌పిజి సబ్సిడీలో భారీగా కోత విధిస్తూ వచ్చారు. గతేడాది, 60శాతం మేర కేటాయింపుల్లో కోత విధించారు. 2022-23 వార్షిక బడ్జెట్‌లో మరో 60శాతం మేర కోత విధించారు. ఈ-శ్రమ పోర్టల్స్ ద్వారా నమోదైన అసంఘటిత రంగ కార్మికులకు కొత్తగా ఎలాంటి కేటాయింపులు చేయలేదని పొలిట్‌బ్యూరో తెలిపింది.
గత రెండేళ్ల కాలంలో కోవిడ్ కారణంగా సంపన్నులు మరింత సంపన్నులుగా మారారు. ఆక్స్‌ఫామ్ సర్వే ప్రకారం, భారతదేశంలోని సంపన్న కుటుంబాల ఆస్తులు 2021లో రికార్డు స్థాయిలో పెరిగాయి. భారత్‌లోని మొదటి 10మంది వ్యక్తుల వద్దే 57శాతం సంపద పోగుపడింది. అయినా, ఇబ్బడిముబ్బడిగా వచ్చి పడిన సూపర్ లాభాలపై పన్ను విధించే ప్రతిపాదనేదీ బడ్జెట్‌లో లేదు. అలా పన్ను విధింపు ద్వారా వచ్చిన మొత్తాన్ని ఆకలితో అలమటించే మెజారిటీ ప్రజలకు ఊరట కలిగించేందుకు ఉపయోగించవచ్చు కానీ,దానికి కూడా ప్రభుత్వం సిద్ధపడలేదని పొలిట్‌బ్యూరో విమర్శించింది. సామాన్యులకు ఉపశమనం కలిగించే చర్యల ప్రాధాన్యతలను గుర్తించడంలో 2022-23 బడ్జెట్ పూర్తిగా విఫలమైంది. ఇది వారికి ద్రోహం చేయడమేనని పొలిట్‌బ్యూరో విమర్శించింది. ఆదాయపుపన్ను పరిధికి వెలుపల వున్న కుటుంబాలకు నెలకు రూ.7,500 చొప్పున నేరుగా నగదు బదిలీ చేయాలని, ఉచితంగా ఆహార కిట్‌లను పంపిణీ చేయాలని పొలిట్‌బ్యూరో డిమాండ్ చేసింది. ఈ ప్రజా వ్యతిరేక, కార్పొరేట్ అనుకూల బడ్జెట్‌ను నిరసించాలని ప్రజలకు పొలిట్‌బ్యూరో పిలుపునిచ్చింది.










