Apr 16,2023 23:33

సమావేశంలో మాట్లాడుతున్న గోవిందరావు

ప్రజాశక్తి - టెక్కలి: మూలపేట పోర్టు పేరుతో ఆరు వేల ఎకరాలను అదానీకి కట్టబెట్టేందుకు జగన్‌ ప్రభుత్వం సిద్ధమవుతుందని సిపిఎం జిల్లా కార్యదర్శి డి.గోవిందరావు, కార్యదర్శివర్గ సభ్యులు భవిరి కృష్ణమూర్తి, జిల్లా కమిటీ సభ్యులు ఎన్‌.షణ్ముఖరావు విమర్శించారు. స్థానిక ఆదిత్య కళ్యాణ మండపంలో కొల్లి ఎల్లయ్య అధ్యక్షతన ఆదివారం సమావేశం నిర్వహించారు. దేశ సంపదను అదానీకి కట్టబెట్టడంలో మోడీతో జగన్‌ పోటీ పడుతున్నారని విమర్శించారు. రాష్ట్రంలో ఇప్పటికే కృష్ణపట్నం గంగవరం పోర్టుతో పాటు హైడ్రో పవర్‌ ప్రాజెక్టులను అదానీకి ఇచ్చేశారని చెప్పారు.
మూలపేట పోర్టుకు 580 ఎకరాలను మాత్రమే సేకరిస్తామని ప్రజలకు చెప్పిన ప్రభుత్వం, అసెంబ్లీలో ప్రవేశపెట్టిన సోషియో ఎకానమీ సర్వే పత్రాల్లో 1010 ఎకరాలు సేకరిస్తున్నామని పేర్కొందని తెలిపారు. అధికారులతో ప్రభుత్వం అబద్దాలు చెప్పిస్తోందన్నారు. వాస్తవానికి కేంద్ర ప్రభుత్వ ఉప్పు భూములు 2,200 ఎకరాలు, సిఆర్‌జెడ్‌ భూములు 750 ఎకరాలు, తంపర భూములు 1500 ఎకరాలు, ఈస్ట్‌కోస్ట్‌ ఎనర్జీ భూములు 2,020 ఎకరాలు మొత్తం కలిపి 6,470 ఎకరాలకు పైగా కట్టబెట్టేందుకు సిద్ధమవుతోందన్నారు.
ప్రభుత్వం అదానీ కోసం ఉందో, మత్స్యకారుల కోసం ఉందో మత్స్యశాఖ మంత్రి సీదిరి అప్పలరాజు చెప్పాలని డిమాండ్‌ చేశారు. పోర్టు నిర్మాణంతో ఆరు మండలాల్లోని వేలాది ఎకరాలు ముంపునకు గురవుతాయని ఆందోళన వ్యక్తం చేశారు. పర్యావరణానికి, రైతులకు తీవ్ర నష్టం కలిగిస్తుంటే టిడిపి వైఖరి ఏమిటో ఎమ్మెల్యే అచ్చెన్నాయుడు డిమాండ్‌ చేశారు. భావనపాడు ఫిషింగ్‌ హార్బర్‌ నిర్మించాలని డిమాండ్‌ చేశారు. సమావేశంలో సిపిఎం నాయకులు హెచ్‌.ఈశ్వరరావు, పాలిన సాంబమూర్తి, బగాది వాసు, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.