ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్‌లో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి (పిఎంకిసాన్) లబ్ధిదారులు సంఖ్య క్రమంగా తగ్గుతుంది. కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్ తోమర్ లోక్‌సభలో ఒక ఎంపి అడిగిన ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019-20లో ఏపిలో 49,19,109 పిఎం కిసాన్ లబ్ధిదారులు ఉన్నారని, 2020-21 నాటికి 48,22,281 కి లబ్ధిదారుల సంఖ్య తగ్గింది. దాదాపు 96,828 మంది రైతులు పిఎంకిసాన్ పథకం నుంచి తొలగించబడ్డారు. 2021-22(మార్చి 10 వరకు) 45,68,568 లబ్ధిదారులు ఉన్నారు. అంటే గతేడాదితో పోల్చితే మరో 2,53,650 మంది రైతులు పిఎం కిసాన్ పథకానికి దూరం అయ్యారు. తెలంగాణలో పిఎంకిసాన్ లబ్ధిదారుల సంఖ్య పెరిగింది.
ఏపికి కేటాయింపు కంటే మంజూరైన ఇళ్లు తక్కువ
ఆంధ్రప్రదేశ్‌కు పిఎంఎవై-జి కింద కేటాయించిన ఇళ్లు కంటే, మంజూరైన ఇళ్లు చాలా తక్కువ ఉన్నాయి. లోక్‌సభలో కేంద్ర గ్రామీణాభివద్ధి శాఖ సహాయ మంత్రి సాధ్వి నిరంజన్ జ్యోతి ఒక ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. ఏపికి 2,56,270 ఇళ్లు మంత్రిత్వ శాఖ కేటాయించింది. కానీ 67,846 మాత్రమే మంజూరు అయ్యాయి. అందులో 46,708 ఇళ్లు నిర్మాణం పూర్తి అయిందని, 21,138 ఇళ్లు నిర్మాణం నిర్మాణ దశలో ఉన్నాయని కేంద్ర మంత్రి తెలిపారు.
ఏపిలో 14,314, తెలంగాణలో 29,492 పోలీసు ఉద్యోగాలు ఖాళీ
ఏపిలో 14,314, తెలంగాణలో 29,492 పోలీసు ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయని కేంద్ర హౌం సహాయ మంత్రి నిత్యానంద్ రారు తెలిపారు. లోక్‌సభలో కేంద్ర మంత్రి ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానం ఇస్తూ ఏపిలో 73,894 మంజూరైన పోలీసు ఉద్యోగాలని, అందులో 59,553 పోస్టులు భర్తీ చేశారని, ఇంకా 14,3141 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. .
ఏపి నుంచి రూ.66,478 కోట్లు
ఏపి నుంచి ప్రత్యక్ష పన్నులు, జిఎస్టీ రూపంలో రూ.66,478 కోట్లు కేంద్రానికి వచ్చాయని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి తెలిపారు. ఆంధ్రప్రదేశ్ నుంచి 2020-21లో ప్రత్యక్ష పన్నుల రూపంలో రూ.40,314.07 కోట్లు, జిఎస్టీ రూపంలో రూ.26,164 కోట్లు కేంద్రానికి వచ్చాయని ఎంపి జివిఎల్ నరసింహారావు అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థిక శాఖ సహాయమంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. అంతేగాక ఆంధ్రప్రదేశ్‌కు 2021-22 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు రూ. 969.50 కోట్లు రాష్ట్రంలోని గ్రామ పంచాయతీలతో సహా గ్రామీణ స్థానిక సంస్థలకు కేంద్రం విడుదల చేసిందని టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ ప్రశ్నకు కేంద్ర మంత్రి సమాధానం ఇచ్చారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి 2021-22 సంవత్సరానికి గాను ఏపీకి రూ.1524 కోట్లు, తెలంగాణకి రూ.308 కోట్ల జిఎస్టీ బకాయిలు రావాల్సి ఉందని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఎంపి సుజనా చౌదరి అడిగిన ప్రశ్నకు కేంద్రమంత్రి రాజ్యసభలో సమాధానం ఇచ్చారు.
నిధులు పెండింగ్ ఉంటే మద్దతు ధర ఎలా..?
కేంద్ర మంత్రి సమాధానంతో ఏకీభవించటం లేదు : ఎంపి మిథున్ రెడ్డి
రాష్ట్రానికి ఇవ్వాల్సిన చెల్లింపులు పెండింగ్‌లో ఉంటే రైతులకు మద్దతు ఎలా వస్తుందని కేంద్రాన్ని వైసిపి ఎంపి మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ధరల మద్దతు పథకంలో భాగంగా ఈ ఏడాది గతేడాది కంటే 62 శాతం తగ్గించి కేవలం రూ.1,500 కోట్లు మాత్రమే బడ్జెట్‌లో కేటాయించి రైతులకు ఎలా న్యాయం చేస్తారని మంగళవారం లోక్‌సభ ప్రశ్నోత్తరాల సమయంలో మిథున్‌రెడ్డి ప్రశ్నించారు. ఆంధ్రప్రదేశ్‌కు ఐదేళ్లుగా రూ.1700 కోట్లు పైగా పెండింగ్ ఉందని, పెండింగ్‌లపై కేంద్రం నిర్ణయం వెల్లడించాలని కోరారు. దీనికి కేంద్ర వ్యవసాయ శాఖ సహాయ మంత్రి కైలాష్ చౌదరి సమాధానమిస్తూ.. మద్దతు ధర నిరంతరం పెరుగుతోందని తెలిపారు. సేకరించిన ధాన్యానికి సంబంధించి మూడు రోజుల్లో సొమ్ములు నేరుగా రైతుల ఖాతాల్లోకి పంపుతామని తెలిపారు. దీనిపై మిథున్ రెడ్డి స్పందిస్తూ తాను కేంద్ర మంత్రి సమాధానంతో ఏకీభవించటం లేదని అన్నారు.
మత్స్యకారులకు నష్టాన్ని భర్తీ చేయండి
భారత నావికాదళాల విన్యాసాలు స్వాగతించదగినవే అయినప్పటికీ వాటి వల్ల మత్స్యకారుల జీవనోపాధిపై ప్రభావం చూపుతున్నాయని వైసిపి ఎంపి మోపిదేవి వెంకటరమణ ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖపట్నంలో నౌకదళ విన్యాసాలతో విధించిన ఆంక్షలు చేపల వేట, చేపల వ్యాపారంపై ప్రభావం చూపుతున్నాయన్నారు. నౌకదళ విన్యాసాల సమయంలో రోజువారీ చేపల వేట, వ్యాపారం లేకపోవడంతో సంప్రదాయ, చిన్నచిన్న మోటారుబోట్ల మత్స్యకారులు జీవనోపాధి కోల్పోతున్నారన్నారు. విశాఖపట్నంలో నౌకాదళాల కార్యక్రమాలు, విన్యాసాల సమయంలో చేపలవేట, చేపల వ్యాపార కార్యక్రమాలపై విధించిన ఆంక్షల కారణంగా మత్స్యకారులకు జరిగిన నష్టాన్ని భర్తీచేయాలని కేంద్రానికి విజ్ఞప్తి చేశారు.
రివర్ ర్యాంచింగ్ ప్రతిపాదన రాలేదు
ప్రధానమంత్రి మత్స్య సంపద యోజన పథకం కింద రివర్ ర్యాంచింగ్‌కు సంబంధించి ఏపి ప్రభుత్వం ప్రతిపాదన పంపలేదని కేంద్ర ప్రభుత్వం తెలిపింది. ఆక్వా ఉత్పత్తుల్లో ఏపి దేశంలోనే తొలి స్థానంలో ఉందని, రాష్ట్రంలో మత్స్య అభివద్ధికి కేంద్రం వాటాగా రూ.115.60 కోట్లు విడుదల చేశామని వైసిపి ఎంపి ఎంవివి సత్యనారాయణ, గొడ్డేటి మాధవిలు అడిగిన ప్రశ్నకు కేంద్ర మత్స్య శాఖ మంత్రి పురుషోత్తం రూపాలా మంగళవారం లోక్‌సభలో లిఖితపూర్వక సమాధానమిచ్చారు.
రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం వాటా ఇవ్వాలని ఎలా అడుగుతారు?
రాష్ట్ర విభజన అనంతరం రూ.16వేల కోట్ల ఆర్థిక లోటులో ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను రైల్వే ప్రాజెక్టుల నిమిత్తం వాటా ఇవ్వాలని ఎలా అడుగుతారని కేంద్రాన్ని వైసిపి ఎంపి లావు శ్రీకష్ణదేవరాయలు ప్రశ్నించారు. బడ్జెట్‌లో ఏపీలో రైల్వే పనుల నిమిత్తం రూ.9వేల కోట్లు కేటాయించారని సంతోషించాలో బాధపడాలో అర్థంకావడం లేదన్నారు. రాష్ట్ర విభజన కన్నా ముందుగానే కోటిపల్లి-నరసాపురం , గూడూరు-దుగరాజపట్నం, నడికుడి-శ్రీకాళహస్తి ఖమ్మం-ప్రొద్దుటూరు, కొండపల్లి-కొత్తగూడెం, కడప-బెంగళూరు, భద్రాచలం-కొవ్వూరు, తుముకూరు-రాయగఢ, మరికుప్పం-కుప్పం రైల్వే లైన్లు అనుమతించారని వాటిలో చాలా వరకూ పురోగతిలో లేవని గుర్తుచేశారు. చెబుతున్నారన్నారు.
రద్దు చేసిన పాసింజర్ రైళ్లు పునరుద్ధరించాలి
కరోనా సమయంలో రద్దు చేసిన పాసింజర్ రైళ్లను పునరుద్ధరించాలని ఎంపి బి.వి.సత్యవతి డిమాండు చేశారు. పలాస-విశాఖ, విశాఖ-విజయవాడ, విశాఖ-రాజమండ్రి, విశాఖ-కాకినాడ పాసింజర్లు రద్దు వల్ల సామాన్య ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. విశాఖ నుంచి విజయవాడ మీదుగా హైదరాబాద్‌కు బుల్లెట్ ట్క్రెన్ నడపాలని ఆమె కోరారు. నెల్లిమర్ల, గరివిడి , అనకాపల్లి, యలమంచిలి, నర్సీపట్నం రోడ్ వంటి స్టేషన్లలో సదుపాయాలు మెరుగుపరాచాల్సి ఉందన్నారు. రాష్ట్రంలో 23 బౌద్ధ స్మారకాలు, ప్రాంతాలు గుర్తించారని వాటిని అభివద్ధి చేయడానికి పర్యాటక రైళ్లు ఏర్పాటు చేయాలని కోరారు.










