Jan 20,2022 07:17

ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వైసిపి తీవ్రంగా విమర్శించింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇస్తామని ఊరించింది. చివరికి టిడిపి ప్రభుత్వాన్ని మించిపోయి ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి ముఖ్యమంత్రి తనకున్న పరిమితులను చెప్పటమంటే...తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటిని తుంగలో తొక్కిన లెక్కలోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి పేరుతో ఉద్యోగుల మీద దాడి చేస్తుందని ముందుగా ఊహించినదే జరిగింది. సంక్షేమ పథకాలకు ఎవరూ వ్యతిరేకం కాదు. సంక్షేమ పథకాలతో పాటుగా ఉద్యోగుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత, వారి సంక్షేమాన్ని చూడాల్సిన కర్తవ్యం ప్రభుత్వంపై ఉంటుంది. కనీస నైతిక సూత్రాలకు వైసిపి ప్రభుత్వం తిలోదకాలివ్వటం స్పష్టంగా బైటపడింది.
                                    కనీస నైతిక సూత్రాలకు తిలోదకాలు
పిఆర్‌సి నివేదిక వచ్చినప్పుడు దానిని వెల్లడించకుండా, చర్చ పెట్టకుండా వైసిపి ప్రభుత్వం దాచి పెట్టింది. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా నివేదికను వెల్లడించకుండానే, ప్రభుత్వ సెక్రటరీలతో కమిటీ వేసి సిఫార్సులు చెయ్యమన్నది. సెక్రటరీల కమిటీ సిఫార్సు చేసిన 14.29 శాతం కంటే ఎక్కువగా తాము 23.29 శాతం ఎక్కువ ఇస్తున్నామని ముఖ్యమంత్రి ప్రకటించారు. ఇంటెరిమ్‌ రిలీఫ్‌ గా ఇచ్చిన 27 శాతం కంటే తాము ఇచ్చింది తక్కువ అనేది చెప్పలేదు. సమావేశంలో కూర్చున్న ఉద్యోగుల ప్రతినిధులు ఎవ్వరూ మారు మాట్లాడలేదు. ముఖ్యమంత్రి దగ్గర ఎవ్వరూ మాట్లాడకూడదని ముందుగానే ఇచ్చిన సూచనలను పాటించారు. దాంతో ఉద్యోగుల ప్రయోజనాలు ఒక్కొక్కటే కాలరాయటం కొనసాగింది. వై.ఎస్‌ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సైతం ఇంటెరిమ్‌ రిలీఫ్‌గా ఉన్న 21 శాతాన్ని 16 శాతానికి తగ్గించి ఉద్యోగులకు అన్యాయం చేశారు.
ఇంటెరిమ్‌ రిలీఫ్‌ కంటే ఫిట్‌మెంట్‌ తక్కువ ఇవ్వటం పిఆర్‌సి చరిత్రలోనే మొదటిసారి. డిఏ ను బేసిక్‌లో కలిపి దాని మీద ఫిట్‌మెంట్‌ ఇవ్వకుండా బేసిక్‌ మీద మాత్రమే ఫిట్‌మెంట్‌ ఇచ్చి దానికి డిఏ ను కలపడం కూడా కనీస సూత్రాలకు విరుద్ధం. స్థూల వేతనాలు తగ్గకుండా చూస్తామని ప్రభుత్వ సలహాదారులు చెప్పిన మాట కూడా ఖరారు కాకుండా, చివరికి స్థూల వేతనాలు తగ్గటమే ఖరారైంది. ఫిట్‌మెంట్‌ సంగతి వదిలేసిన జెఎసి నాయకత్వం హెచ్‌ఆర్‌ఎ, సిసిఎ లకు పరిమితం కావటం నష్టం చేసింది. చివరికి హెచ్‌ఆర్‌ఎ, సిసిఎ లు కూడా కోతకు గురిఅయ్యాయి. ఉద్యోగులు ప్రభుత్వానికి ఎదురు కట్టాల్సి రావడం విచారకరం. 5 సంవత్సరాలకు ఒకసారి ఉన్న పిఆర్‌సిని 10 ఏళ్లకు మార్చి వైసిపి ప్రభుత్వం ఉద్యోగులకు తీవ్ర అన్యాయం చేసింది. పెన్షనర్లకు అదనపు పెన్షన్‌ వచ్చే వయస్సు అర్హతను పెంచి వారికి నష్టం చేసింది. సిపిఎస్‌ రద్దు విషయం తేల్చకుండా వాయిదా వేసింది. గ్రామ సచివాలయ ఉద్యోగుల రెగ్యులరైజేషన్‌కు కూడా కట్టుబడలేదు.
                                కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు నష్టం
కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరూ శాశ్వతంగా ఉండే పనులలోనే ఉన్నారు. అటువంటప్పుడు వారి సర్వీసులను రెగ్యులరైజ్‌ చెయ్యాల్సిన బాధ్యత, నైతికత ప్రభుత్వం మీద ఉంటుంది. కాని, మిగతా ప్రభుత్వాల మాదిరిగానే వైసిపి ప్రభుత్వం కూడా వీరిని విభజించి పాలిస్తోంది. డైరెక్ట్‌ కాంట్రాక్ట్‌, థర్డ్‌ పార్టీ కాంట్రాక్టు అని విభజించినా... వారిద్దరూ చేసే పని ఒక్కటే. 2016లో వచ్చిన సుప్రీం కోర్టు తీర్పుకు కూడా కొన్ని పరిమితులున్నాయి. సుప్రీంకోర్టు మినిమం బేసిక్‌ మాత్రమే ఇవ్వాలని చెప్పగా, కాంట్రాక్ట్‌ వర్కర్స్‌ చట్టం నిబంధనలలో పర్మినెంట్‌ వర్కర్లు చేసే పనినే కాంట్రాక్ట్‌ వర్కర్లు చేస్తుంటే కాంట్రాక్టు వర్కర్లకు పర్మినెంట్‌ వర్కర్ల వేతనాలు, డి.ఎ, అలవెన్సులు, ఇతర బెనిఫిట్లన్నీ కల్పించాలని ఉంది. సమాన పనికి సమాన వేతనానికి కాంట్రాక్ట్‌ వర్కర్ల చట్టం రూల్స్‌లో చెప్పింది మాత్రమే సరితూగుతుంది.
ఇలావుండగా... కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులందరిని పర్మినెంట్‌ చేస్తామనే వాగ్దానంతో జగన్‌ మోహన్‌ రెడ్డి అధికారంలోకి వచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా తాము అధికారం లోకి వస్తే అందరినీ పర్మినెంట్‌ చేస్తామని అసెంబ్లీలో చంద్రబాబు నాయుడికి సవాలు విసిరారు. కాని ఇప్పుడు ఆయన అడుగుజాడల్లోనే నడుస్తున్నారు. కనీసం డైరెక్ట్‌ కాంట్రాక్ట్‌ ఉద్యోగులను కూడా పర్మినెంట్‌ చెయ్యటం గురించి పట్టించుకోవటం లేదు.
ఈ పిఆర్‌సి లో వీరి వేతనాల నిర్ణయంలో కూడా గతంలో మాదిరిగానే తీవ్రమైన అన్యాయం జరిగింది. అందరి ముందు పిఆర్‌సి ప్రకటించే సమయంలో కాంట్రాక్ట్‌ ఉద్యోగులకు మినిమం బేసిక్‌ అమలు చేస్తామని, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు ఇప్పుడు వస్తున్న వేతనాల మీద 30 శాతం పెంచుతామని ప్రకటించారు. ఆచరణలో ఈ రెండు అవాస్తవాలైనాయి. అంతిమంగా ఇచ్చిన జీవో లలో జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వ బాట పట్టింది. కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు అన్యాయం చేసింది.
                                      పిఆర్‌సి ని వెంటనే సవరించాలి
11వ పిఆర్‌సి లో పర్మినెంట్‌ ఉద్యోగులకు, పెన్షనర్లకు, కాంట్రాక్టు, ఔట్‌సోర్సింగ్‌ ఉద్యోగులకు, గ్రామ సచివాలయ ఉద్యోగులకు జరిగిన నష్టాన్ని నివారించి న్యాయమైన వేతన సవరణ జరిగేలా పిఆర్‌సిని సవరించాలి. వీరంతా పెద్ద సంఖ్యలో ఉన్నారని, వీరికి జరిగిన నష్టాన్ని నివారించకపోతే రాజకీయంగా వైసిపి నష్టపోయే అవకాశముందని గుర్తించాలి. గత ప్రభుత్వాల అనుభవం కూడా దీనినే రుజువు చేసింది. చంద్రబాబు నాయుడు లాగానే తాను కూడా నిరాటంకంగా అధికారంలో ఉంటానని జగన్‌ మోహన్‌ రెడ్డి భావిస్తున్నారు. అలా ఉండాలంటే పిఆర్‌సి ని ఉద్యోగులకు అనుకూలంగా సవరించి రాజకీయంగా నష్టపోకుండా చూసుకోవటం మంచిది.
తెలంగాణ ప్రభుత్వం స్కీం వర్కర్లకు ఇచ్చిన పిఆర్‌సి పెరుగుదల 30 శాతాన్ని అమలు చేసింది. అంగన్‌వాడీ వర్కర్లు, హెల్పర్లకు రూ.5 లక్షలు రిటైర్మెంట్‌ బెనిఫిట్‌ ప్రకటించింది. జగన్‌ మోహన్‌ రెడ్డి ప్రభుత్వం కూడా తెలంగాణ ప్రభుత్వం మాదిరిగా స్కీం వర్కర్లకు ఇప్పుడు వస్తున్న వేతనాలపై 30 శాతం పెంచాలి. రిటైర్మెంట్‌ బెనిఫిట్లు అమలు చెయ్యాలి.
రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న కేంద్ర ప్రభుత్వ వాగ్దానాలను అమలు చేయించుకోవటానికి కేంద్రంతో పోరాడాలి. ముఖ్యంగా రెవిన్యూ లోటును, పోలవరం ప్రాజెక్టుకు తాను ఖర్చు పెట్టిన నిధులను, మిగతా వాగ్దానాలను...కేంద్రం రాబడిలో తనకు రావలసిన న్యాయమైన వాటాను సాధించుకోవాలి. దీనితోపాటు రోడ్డు, రైల్వే వంటి మౌలిక సౌకర్యాలు, పారిశ్రామిక అభివృద్ధి పైన కూడా శ్రద్ధ పెట్టాలి. భేషజాలకు పోకుండా, రాజకీయ కక్షలకు తావు లేకుండా అమరావతినే పరిపాలనా రాజధానిగా కొనసాగించి అభివృద్ధి చేసి ఆదాయాన్ని పెంచుకోవాలి. అంతవరకు ఆగకుండా, ఉద్యోగులకు చేసిన అన్యాయాన్ని ముందుగా సవరించాలి. ఉద్యోగులకు, కార్మికులకు ఎవరికైనా సరే నాలుగైదు సంవత్సరాలకు ఒకసారి వేతన సవరణ జరగాలి. నిజ వేతనాలలో పడే కోతను నివారించటానికి వేతనాల పెంపు తప్పనిసరి. ఆ పెంపు కూడా న్యాయంగా ఉండాలి. అలా జరగకపోతే ఎక్కడైనా, ఏ ప్రభుత్వంలోనైనా ఉద్యోగులు పోరాడి న్యాయమైన వేతనాన్ని సాధించుకుంటారు. ఏ రంగంలోనైనా ఇదే జరుగుతుందని చరిత్ర చెప్తున్నది. వైసిపి ప్రభుత్వం దీన్ని గుర్తించి ఉద్యోగుల ప్రతినిధులతో మరలా చర్చించి పిఆర్‌సి లో ఉద్యోగులకు అనుకూలంగా అవసరమైన మార్పులు చెయ్యాలి.
       ప్రతిపక్షంలో వున్నప్పుడు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వైసిపి తీవ్రంగా విమర్శించింది. ఉద్యోగులకు మెరుగైన పిఆర్‌సి ఇస్తామని ఊరించింది. చివరికి టిడిపి ప్రభుత్వాన్ని మించిపోయి ఉద్యోగి వ్యతిరేక ప్రభుత్వంగా మిగిలింది. ఆర్థిక పరిస్థితి సరిగా లేదు కాబట్టి ముఖ్యమంత్రి తనకున్న పరిమితులను చెప్పటమంటే...తాను ఇచ్చిన వాగ్దానాలన్నింటిని తుంగలో తొక్కిన లెక్కలోకి వస్తుంది. ఆర్థిక పరిస్థితి పేరుతో ఉద్యోగుల మీద దాడి చేస్తుందని ముందుగా ఊహించినదే జరిగింది.     పి. అజయ కుమార్ ( వ్యాసకర్త : సిఐటియు రాష్ట్ర ఉపాధ్యక్షులు )