Nov 19,2022 15:10

ప్రజాశక్తి-అమరావతి : విద్యుత్ రాయితీ, దాణా రేట్లు తగ్గేలా చర్యలు , రొయ్యలకు మద్దతు ధర ప్రకటించి సంక్షోభంలో పడిన ఆక్వారంగాన్ని ఆదుకోవాలని కోరుతూ సీఎం జగన్ కి టిడిపి జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ లేఖ రాశారు. ఈ లేఖలో సిఎం జగన్ ఇచ్చిన హామీలు అమలు కాకపోవడమే నేటి ఆక్వారంగ సంక్షోభానికి కారణమని పేర్కొన్నారు. దేశంలోనే ఆక్వా ఉత్పత్తుల్లో ప్రథమస్థానంలో వున్న ఆంధ్రప్రదేశ్ జగన్ పాలనలో ఆక్వా హాలీడే దిశగా సాగుతోందని తెలిపారు. ఆక్వా అసోసియేషన్ల పేరుతో ప్రకటనలు ఆక్వారంగ సంక్షోభాన్ని పరిష్కరించలేవని తెలిపారు. రొయ్యలు పెంపకం చేపట్టే రైతుల పాలిట శాపంగా మారిన సమస్యలు యుద్ధప్రాతిపదికన పరిష్కరించినప్పుడే ఆక్వారంగానికి పూర్వవైభవం వస్తుందన్నారు. ఆక్వా పరిశ్రమకి  విద్యుత్ యూనిట్ కు రూ.1.50కే ఇస్తానని హామీ ఇచ్చి గద్దెనెక్కాక మాట తప్పారని తెలిపారు. కంటి తుడుపుగా ప్రకటించిన విద్యుత్ రాయితీ అడ్డగోలు నిబంధనతో అందకుండా పోతోందన్నారు. మరోవైపు దాణా రేట్లు, రొయ్యలకి వ్యాధులు సోకకుండా వాడే మందుల ధరలు మండిపోతున్నాయని వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర ఆక్వా కల్చర్‌ అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఏపీ సడా) కింద నమోదు చేసుకున్న 10 ఎకరాల్లోపు చెరువులలో రొయ్యల పెంచే  రైతులకే విద్యుత్‌ రాయితీ వర్తించేలా జీవో ఇవ్వడం ఆక్వా రంగం పాలిట శాపంగా మారిందన్నారు.. ఆక్వారంగం రైతులు తీవ్రనష్టాలతో అప్పులు పాలవుతున్నారని పేర్కొన్నారు. రొయ్యలు పెంపకం చేపట్టి అప్పులు పాలయ్యే బదులు ఆక్వా హాలీడే వైపు మొగ్గు చూపడం ఆందోళన కలిగిస్తోందని తెలిపారు. ప్రభుత్వాలకు ఆదాయం, ప్రత్యక్షంగా పరోక్షంగా లక్షలాది మందికి ఉపాధి కల్పించే ఆక్వారంగ సంక్షోభంలో పడటం ఆర్థిక వ్యవస్థకే ప్రమాదమన్నారు.. తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కుంటున్న ఆక్వా రంగాన్ని ఆదుకోవడానికి ఉదారంగా వ్యవహరించాల్సిన ప్రభుత్వం ఒంటెద్దు పోకడలతో కొత్త చట్టాలు తెచ్చి వేధింపులకు గురిచెయ్యడం, ఆక్వా రంగం రైతుల్ని తీవ్ర మానసిక ఆందోళనకు గురిచేస్తుందని వెల్లడించారు.. ప్రభుత్వం యుద్ధప్రాతిపదికపై స్పందించి ఆక్వా రైతులందరికీ యూనిట్ విద్యుత్తును రూ.1.50 చొప్పున ఇవ్వాలని, నాణ్యమైన రొయ్య పిల్లలను సరఫరా చేయాలని డిమాండ్ చేశారు.. దాణా రేట్లు తగ్గేలా చర్యలు తీసుకోవాలని, పెరిగిన ఉత్పత్తి వ్యయానికి 50% కలిపి రొయ్యలకి మద్దతు ధర ప్రకటించాలని లేఖలో పేర్కొన్నారు.