


ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : కరోనా కష్టకాలంలో నెలకొన్న పరిస్థితులను ఆసరాగా చేసుకుని విద్యారంగాన్ని మరింతగా ప్రైవేటీకరించడానికి కేంద్ర ప్రభుత్వం సిధ్దమవుతోందా? విద్యారంగ నిపుణులు ఈ ప్రశ్నకు అవుననే సమాధానమిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో చేసిన ప్రతిపాదనలే దీనికి కారణం. విద్యాహక్కు వంటి అంశాలను నామమాత్రంగా కూడా ప్రస్తావించకుండా డిజిటలీకరణకు పెద్ద పీట వేయడం పెద్ద సంఖ్యలో విద్యార్థులకు నష్టదాయకంగా మారుతుందని చెబుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో విద్యారంగానికి 1,04,277.72 కోట్ల రూపాయల అంచనాతో బడ్జెట్‌ను ప్రతిపాదించారు. దీనిని ఉన్నతవిద్య, పాఠశాల విద్య, అక్షరాస్యతలకు విభజించారు. దీనిని కూడా పరిగణలోకి తీసుకుంటే పాఠశాల విద్య, అక్షరాస్యత కార్యక్రమాలకు 63,449.37 కోట్లు, ఉన్నత విద్యకు 40,828.35 కోట్ల రూపాయలు కేటాయించారు. మొత్తంమీద గత ఏడాది విద్యారంగానికి 88వేల కోట్ల రూపాయలు కేటాయించగా, ఈ ఏడాది అదనంగా 16 వేల కోట్ల రూపాయలు ఇచ్చినట్టైంది. అయితే, ఈ అదనపు కేటాయింపుల వల్ల దేశ వ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది పేద విద్యార్థులకు ఒరిగిందేమి లేకపోవడం విశేషం.దాదాపుగా రెండు సంవత్సరాలుగా కరోనా కారణంగా దేశ వ్యాప్తంగా విద్యాసంస్థలు మూత పడిన సంగతి తెలిసిందే. దీంతో చదువులు కోల్పోయిన విద్యార్థులను ఆదుకోవడాని కేంద్ర ప్రభుత్వం ఏదైనా ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రకటిస్తుందని విద్యావేత్తలు, నిపుణులు ఆశించారు. దీనికి భిన్నంగా కేంద్ర ప్రభుత్వం డిజిటలీకరణను ప్రకటించింది. వివిధ భాషల్లో 200 టివి ఛానళ్లను ఏర్పాటు చేయడంతో 1-12 తరగతుల విద్యార్థులకు అదనపు విద్యను భోదించవచ్చని ప్రతిపాదించింది. అలాగే, సైన్స్-గణితం సబ్జెక్టుల కోసం 750 వర్చ్యువల్ ల్యాబులను, నైపుణ్య అభివృధ్ధి కోసం 75 స్కిలింగ్ ఇ ల్యాబులను ప్రతిపాదించింది. ఇవ్వన్నీ ప్రైవేటు భాగస్వామ్యంలో ఏర్పాటవుతున్నాయి. అదే విధంగా డిజిటల్ యూనివర్శిటీని ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటిం చారు. దీని ఏర్పాటుకు పబ్లిక్ రంగంలో ఉన్న విశ్వవిద్యాలయాలు సహకరిస్తాయని ఆర్థికశాఖ మంత్రి తెలిపారు.
కరోనా వ్యాప్తి అనంతరం చేసిన సర్వేల ప్రకారం దేశ వ్యాప్తంగా 80 శాతం మంది విద్యార్థులు డిజిటల్ నిరక్షరాస్యతలో ఉన్నారు. డిజిటల్ వ్యవస్థకు సంబంధించి మౌళికవనరులు కూడా వీరికి అందుబాటులో లేవు. విద్యాహక్కు ఫోరమ్ కో ఆర్డినేటర్ మిత్రా రంగరాజన్ ఇదే విషయాన్ని ప్రస్తావిస్తూ 'ఆ 80 శాతం మంది సంగతేమిటని అడగాల్సిఉంది. దేశ ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ విద్యారంగాన్ని మరింత ప్రైవేటీక రించడానికి మోడీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్య ఇది' అని అన్నారు. మధ్యాహ్నా భోజన పథకం ( పిఎం పోషణ్ శక్తి నిర్మాణ్)కు గత మూడు సంవత్స రాలుగా నిధుల కేటాయింపులు తగ్గిపోతుం డటాన్ని కూడా పలువురు ప్రస్తావిస్తున్నారు. 2020-21లో ఈ పథకానికి 12,900 కోట్ల రూపాయలు కేటాయించగా, 2021-22లో 11,500 కోట్లు, తాజా బడ్జెట్‌లో 10,223.75 కోట్ల రూపాయలు కేటాయించారు. ఎస్.సి. ఎస్‌టిల బాలికల విద్యకు ఉన్న ప్రోత్సహకాలను పూర్తిగా నిలిపివేశారు.










