Jan 30,2022 07:08

ఎప్పుడైనాసరే కొందరు నాయకుల చుట్టూ పరిభ్రమణం కంటే విశాల జనరాశుల పాత్ర గుర్తించడం ముఖ్యం. అయితే తమకు సంబంధమే లేని స్వాతంత్య్ర పోరాటంతో సంధానం చేసుకోవడం, కొంతమందిని కాంగ్రెస్‌ నుంచి విడదీసి వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడ్డం మోడీ పాలనలో వ్యూహం. ఈ క్రమంలో వారి బోధనలూ ఆశయాలు తారుమార వుతుంటాయి. గాంధీజీ మత సామరస్య సందేశం వెనక్కు కొట్టడం అలాంటిదే. సరిగ్గా ఆ కారణం చేతనే మనం దాన్ని మరింత గట్టిగా నొక్కి చెప్పవలసి వస్తుంది. వర్తమానంలో చేసే పోరాటాలతో పాటు చారిత్రక వారసత్వం కూడా సవ్యంగా కాపాడుకోవలసి వుంటుంది.

మహాత్మా గాంధీ! భారత స్వాతంత్య్ర పోరాటానికి సారథిగా చరిత్రలోనూ ప్రజల హృదయాల లోనూ నిలిచిపోయిన జాతిపిత. దేశం మూల మూలలకీ స్వరాజ్య పోరాటం పిలుపు విస్తరింపజేసిన నేత. బ్రిటిష్‌ రాజధాని లండన్‌లో వుండగా స్వాతంత్య్ర స్ఫూర్తి పెంచుకుని, దక్షిణాఫ్రికాలో శ్వేతజాతి దురహంకారంపై పోరాడి, మాతృ దేశ విముక్తి కోసం అంకితమైన ఆదర్శనేత. ఆ క్రమంలో నిరాడంబరత్వం, త్యాగనిరతి, కష్ట సహష్ణుత వంటి లక్షణాలకు ప్రతీకగా నిలిచి మహాత్ముడు అనిపించుకున్న వ్యక్తి. గాంధీజీ నిర్వహించిన ఉద్యమాలు, ఉపసంహారాలపై అనేక విమర్శలున్నాయి. అయితే స్వాతంత్య్ర మౌలిక లక్ష్యాన్ని సచేతనంగా వుంచడం, రవి అస్తమించని బ్రిటిష్‌ సామ్రాజ్యవాద పాలకులు ఏదో విధంగా చర్చలకు రావలసిన పరిస్థితి కల్పించడం ఆయన నాయకత్వ నైపుణ్యంలో భాగమైంది. 'ఆ అర్థనగ ఫకీరు బ్రిటిష్‌ చక్రవర్తితో మాట్లాడటాన్ని నేను ఊహించలేను' అన్న చర్చిల్‌ వంటి వారికి గాంధీ ఆచరణతోనే సమాధానమిచ్చారు. ఇంతటి శక్తి గాంధీకి లభించిందంటే కేవలం ఆయన నైతిక నిష్ట కారణం కాదు. భిన్న మతాలతో కూడిన ఈ దేశంలో హిందూ ముస్లిం ఐక్యత, మత సామరస్యాన్ని ప్రాతిపదికగా చేసుకోవడం అందుకు దారితీసింది. 1920ల తర్వాత క్రమంగా ఆయన పట్టు పెరిగిన కొద్ది ఈ దిశలో అనుసరించిన వ్యూహాలను విచ్ఛిన్నం చేసేందుకు పరాయి పాలకులు విభజించి పాలించే విధానం అనుసరించారు. మొదట ఆర్‌.ఎస్‌.ఎస్‌, తర్వాత ముస్లింలీగ్‌, హిందూ మహాసభ వంటివి అందుకు సాధనాలయ్యాయి. మత కలహాలూ రగిలించాయి. చివరకు అది దేశ విభజనకు దారితీసింది.
    దేశ స్వాతంత్య్ర పోరాట సారథి అయినా ఆయన స్వతంత్రం తర్వాత అధికార వ్యవస్థలో భాగం కాలేదు సరికదా వేడుకల లోనూ పాలుపంచుకోలేదు, ఆ మత మారణహోమం మధ్య శాంతి సామరస్యాల కోసమే తల్లడిల్లిపోయారు. నౌఖాలిలో శాంతిస్థాపన కోసం ఆయన చివరి యాత్ర చేశారు. తిరిగి వచ్చాక కొంత కాలానికే హిందూ మతోన్మాది పూర్వాశ్రమ ఆర్‌.ఎస్‌.ఎస్‌ వాది, వి.డి.సావర్కర్‌ శిష్యుడు నాథూరాం వినాయక్‌ గాడ్సే 1948 జనవరి 30న ఆయనను అమానుషంగా కాల్చిచంపాడు. మన జీవితాల్లోంచి దీపకాంతి నిష్క్రమించింది అని తొలి ప్రధాని నెహ్రూ జోహారులర్పించారు. గాంధీజీ హత్యకు గాడ్సే పథకాలు, ముందు రోజుల్లో ప్రత్యక్షంగా రెక్కి నిర్వహించిన విషయం బయిటకు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోకపోవడం తీవ్ర విమర్శకు గురైంది. అప్పటి హోంమంత్రి సర్దార్‌ పటేల్‌ గాంధేయవాదిగా పేరు. నెహ్రూకు ఆయనకూ మధ్య గాంధీజీ హత్యకు ముందు నెహ్రూ, పటేల్‌ మధ్య విభేదాల పరిష్కారం కోసం ఆఖరిసారి చర్చలు జరిపి ప్రార్థన సమయం ఆలస్యమైందని హడావుడిగా వెళ్లారు. ఆ సమయంలో పాదాభివందనం చేస్తానంటూ వచ్చిన గాడ్సే గుళ్ల వర్షం కురిపించారు. 'హే...రాం...' అంటూ ఆయన ప్రాణాలు వదిలారని రాజ్‌ఘాట్‌లో ఆయన సమాధిపైనా ఆ అక్షరాలే లిఖించారు (అలా అనలేదని కొంతమంది పరిశోధించారు). అదేమోగాని రఘుపతి రాఘవ రాజారాం అన్న గాంధీ ఈశ్వర అల్లా తేరే నామ్‌ అంటూ అన్ని మతాలు ఒక్కటేనని చాటారు. నేను హిందువును, ముస్లిమును, క్రైస్తవుణ్ని, యూదును అంటూ అన్ని మతాలు ఒకటేనని చెప్పిన గాంధీ పలుకులు సుప్రసిద్ధం.
 

                                                        బైబై టు 'అబైడ్‌ విత్‌ మి'

ప్రముఖ స్కాట్లాండ్‌ కవి రాసిన ''అబైడ్‌ విత్‌ మి'' (నాతో వుండు) అన్న క్రైస్తవ ప్రార్థనా గీతం కూడా ఆయనకు చాలా ఇష్టం. ప్రతి ఏటా రిపబ్లిక్‌ దినోత్సవ సైనిక పాటవ ప్రదర్శనల తర్వాత జనవరి 29న క్రమపద్ధతిలో నిష్క్రమించేప్పుడు అబైడ్‌ విత్‌ మి గీతాన్ని వినిపించడం రాజ్యాంగ ఆమోదం నాటి నుంచి కొనసాగుతున్న ఆనవాయితీ. ఈ ఏడాది ఆజాదీ కా అమృతోత్సవ్‌ అంటూనే మోడీ సర్కార్‌ ఆ పాటను ఎత్తివేసింది. 1962లో చైనాతో జరిగిన సాయుధ ఘర్షణ సందర్భంలో లతా మంగేష్క్‌ర్‌ పాడిన ఆయే వతన్‌కె లోగ్‌ను ఆ స్థానంలో ప్రవేశపెట్టింది. 2020 లోనే ఈ ప్రయత్నం చేసినా విమర్శలు రావడంతో 2021లో పునరుద్ధరించి ఇంతలోనే మళ్లీ తొలగించారు. గాంధీజీ పట్ల ఈ ప్రభుత్వం గౌరవం ఏపాటిదో తెలియడానికి ఇది తాజా ఉదాహరణ. వాజ్‌పేయి హయాంలోనే సావర్కార్‌ను పార్లమెంటులో ప్రతిష్టించగా ఇప్పుడు మోడీ హయాంలో ఏకంగా గాడ్సే నామస్మరణ వరకూ వచ్చాం. కేంద్రం ప్రకటనల్లోనూ, మోడీ ప్రవచనాల్లోనూ పలుసార్లు గాంధీజీ ప్రస్తావన వస్తున్నా అది స్వచ్ఛభారత్‌ ప్రచారానికే. ప్రపంచ ప్రసిద్ధమైన గాంధీ ప్రతీక తొలగించలేరు గనక అరకొరగా అసందర్భంగా ఆయనను ప్రస్తావిస్తుంటారు.
 

                                                      ముప్పయ్యేళ్లు.. కొత్త కోణాలు

నిజానికి 1992 డిసెంబర్‌ 6న అయోధ్యలో వివాదాస్పద బాబ్రీ మసీదు/రామజన్మభూమి కట్టడాన్ని సంఘపరివార్‌ కుట్రతో కూల్చివేసిన తర్వాత 1993 జనవరి 30 గాంధీ జయంతిని వామపక్షాలు, ఇతర లౌకిక శక్తులు ప్రతిజ్ఞా దినంగా పాటించాయి. గాంధీజీ మత సామరస్య వారసత్వం కొత్త అర్థం సంతరించుకుంది. మరో పదేళ్లకు 2002లో గుజరాత్‌లో మోడీ ముఖ్యమంత్రిగా వుండగా ఘోర జాతి హత్యాకాండ ఈ క్రమంలో మరో హెచ్చరిక అయింది. కార్పొరేట్‌ శక్తుల వత్తాసుతో మోడీ నిరాఘాటంగా కొనసాగడమే కాదు ప్రధాని కూడా కాగలిగారు. రిలయన్స్‌ అంబానీ ఆ రోజుల్లో గుజరాత్‌లో పారిశ్రామికవేత్తల సభల్లో మాట్లాడుతూ గాంధీజీ, ధీరూభారు, మోడీలు దేశానికి గుజరాత్‌ ఇచ్చిన కానుకలని కొనియాడారు. మోడీ ప్రధాని అయ్యాక సర్దార్‌ పటేల్‌ను ఎక్కువ చేసి నెహ్రూను వెనక్కు నెట్టడానికి పథకం ప్రకారం ప్రయత్నం మొదలైంది. పటేల్‌ గాంధీజీ హత్యానంతరం ఆర్‌.ఎస్‌.ఎస్‌ ను నిషేధించిన వ్యక్తి పటేలే. అయితే తర్వాత నెహ్రూ విదేశ పర్యటనలో వున్నప్పుడు ఈ నిషేధం తొలగించిందికూడా ఆయనే. రిపబ్లిక్‌ దినోత్సవాన నేతాజీ హాలోగ్రామ్‌ను ఆవిష్కరించడం ద్వారా ఆయననూ తమ ఖాతాలో కలుపుకోవడానికి సర్కారు ప్రయత్నాలు తీవ్రం చేసింది. ఇండియా గేట్‌ దగ్గర గతంలో కింగ్‌ జార్జి విగ్రహం తొలగించిన ఖాళీ పీఠంపై నేతాజీ విగ్రహం నెలకొల్పుతున్నారు. నేతాజీ కూడా ఆర్‌.ఎస్‌.ఎస్‌ తరహా భావజాలన్ని ఆమోదించేవ్యక్తి కాదు. ఎర్రకోటపై ప్రధానిగా చేసిన తొలి ప్రసంగంలోనే నెహ్రూ, నేతాజీ లేకపోవడం లోటుగా వుందని గుర్తు చేసుకున్నారు. కనుక నెహ్రూను ఆయననూ ప్రత్యర్థులుగా చూపడమూ చారిత్రికత కాదు. నేతాజీ గాంధీని ఎదిరించి కాంగ్రెస్‌ అధ్యక్షుడుగా ఎన్నికవడానికి సుందరయ్య నాయకత్వంలో ఆంధ్ర ప్రతినిధులు ఓటు చేయడం చాలా సహాయపడింది. నేతాజీ నాజీ జర్మనీ సాయం తీసుకోవడం సరికాదని కమ్యూనిస్టులు విమర్శించారే గాని తన వ్యక్తిత్వాన్ని, దేశభక్తిని ప్రశ్నించిందిలేదు. బెంగాల్‌ ప్రభుత్వం పంపిన నేతాజీ శకటాన్ని నిరాకరించిన మోడీ ఆయన హాలోగ్రామ్‌ను ఆవిష్కరించి ద్వంద్వనీతి ప్రదర్శించుకున్నారు.
 

                                                              ఒకో చోట ఒకో చిచ్చు

గాంధీజీ, నేతాజీ, పటేల్‌ ఎవరైనా సరే దేశభక్తులూ మత సామరస్య వాదులే గాని మతతత్వాన్ని సహించేవారు కాదు. వారిలో ఒకరికి వ్యతిరేకంగా ఒకరిని ముందుకు తేవడం ప్రస్తుత పాలకుల కుటిల నీతికి దర్పణం. కానీ వారు అలాంటి వాటిలో సిద్ధహస్తులు. రాజా మహేంద్ర ప్రతాప్‌ రష్యాలో లెనిన్‌ను కలిసి, నేతాజీ కంటే ముందే ఆఫ్ఘనిస్తాన్‌లో ప్రవాస ప్రభుత్వం ఏర్పాటు చేసిన వ్యక్తి. ఇప్పుడు యు.పి ఎన్నికల కోసం ప్రత్యేకించి జాట్‌ ఓట్ల కోసం ఆయన పేరిట యూనివర్సిటీ ప్రారంభించారు మోడీ. అలాగే అమిత్‌ షా శివాజీ భజన చేస్తున్నారు. ఇవన్నీ మత రాజకీయ పాచికలే. అదే సమయంలో గాంధీజీ పాదుకొల్పిన సామరస్య లౌకిక సంప్రదాయాలను వమ్ము చేసే వక్రనీతీ చూడవలసి వుంటుంది. బిజెపి నేతల ప్రచారాలు మీడియా, సోషల్‌ మీడియా కథనాల ద్వారా వీటినే వేగంగా ప్రజల బుర్రల్లోకి జొప్పించే ప్రయత్నం పెద్దఎత్తునే సాగుతున్నది. హైదరాబాద్‌ చార్మినార్‌ నుంచి గుంటూరులో జిన్నా టవర్‌ వరకూ విద్వేష ప్రచారాస్త్రాలవుతున్నాయి. పేర్ల మార్పిడి ప్రతిపాదనలు చరిత్రను తారుమారు చేసి చూపిస్తున్నాయి. చార్మినార్‌లో వివాదాస్పద భాగ్యలక్ష్మి ఆలయం బిజెపి ప్రదర్శనల ప్రారంభ బిందువుగా మారింది. హైదరాబాద్‌ను భాగ్యనగర్‌గా మార్చాలని చెప్పడానికి చరిత్రలో ఆధారం లేని భాగమతిని తీసుకొస్తున్నారు. వాస్తవానికి బాగ్‌ అంటే తోట. బషీర్‌బాగ్‌, బాగ్‌ అంబర్‌పేట, బాగ్‌ లింగ్‌పల్లి ఇలా బాగ్‌ల మయంగా వుంది గనక హైదరాబాద్‌ను బాగ్‌నగర్‌ అనాలని బెర్నియర్‌ అనే పాశ్చాత్య చరిత్రకారుడు ఎప్పుడో రాశాడు. ఇక జిన్నా టవర్‌ ఆయన కాంగ్రెస్‌లో వున్న కాలంలోనే నిర్మాణమైంది. వాస్తవానికి బిజెపి ఇటీవలి వరకూ పాలించిన ముంబాయిలో జిన్నా నివాసం జిన్నా హౌస్‌ ఇప్పటికీ వుంది. జిన్నా మనవడైన పారిశ్రామికవేత్త నస్లీవాదియా బిజెపికి నిధులను సమకూర్చడం అందరికీ తెలుసు. వారే గుంటూరులో జిన్నా టవరెక్కి టక్కరి వేషాలు వేస్తారు. ఇది స్వచ్ఛ భారత్‌ ప్రచారం మాటున కక్ష భారత్‌ ను రగిలించే ద్వంద్వనీతి రాజకీయం.
 

                                                        ముందు నుంచే వెనక్కు !

దేశ చరిత్ర తోనూ, చారిత్రిక వాస్తవాలతోనూ చెలగాటమాడే ఈ తరహా ఉదాహరణలు ఆర్‌.ఎస్‌.ఎస్‌, బిజెపిల చరిత్రలో కోకొల్లలు. వాస్తవం ఏమంటే చరిత్ర అంటే జరిగిపోయిందే గాని చరిత్ర కథనం వర్తమానంలో జరుగుతుంది. గతం నుంచి వర్తమానానికి రావడమే కాదు, వర్తమానం నుంచి గతాన్ని చూపడమూ చూడడమూ చరిత్రలోనే జరుగుతుంది. చరిత్ర విజేతల ఖడ్గంతో రాయబడుతుందంటారందుకే. గతాన్ని నేటి అవసరాలకు అనుగుణంగా వక్రీకరించి చూపడం పాలకులకు ఎప్పుడూ అలవాటే. వ్యతిరేక అనుకూల ప్రచారాలు అలానే నడుస్తాయి. కమ్యూనిస్టులపై నిరంతరం అనేక అసత్య ప్రచారాలు చేసే పాలకులు వారు సాధించిన సానుకూల విజయాలు సాగించిన విప్లవాల గురించి పొరబాటున కూడా ప్రస్తావించరు. కాంగ్రెస్‌ హయాంలోనూ గాంధీ కుటుంబం ఆమోదించిన నాయకులనే ఎక్కువ చేసిన మాట అసత్యం కాదు. ఎప్పుడైనాసరే కొందరు నాయకుల చుట్టూ పరిభ్రమణం కంటే విశాల జనరాశుల పాత్ర గుర్తించడం ముఖ్యం. అయితే తమకు సంబంధమే లేని స్వాతంత్య్ర పోరాటంతో సంధానం చేసుకోవడం, కొంతమందిని కాంగ్రెస్‌ నుంచి విడదీసి వకాల్తా పుచ్చుకున్నట్టు మాట్లాడ్డం మోడీ పాలనలో వ్యూహం. ఈ క్రమంలో వారి బోధనలూ ఆశయాలు తారుమారవుతుంటాయి. గాంధీజీ మత సామరస్య సందేశం వెనక్కు కొట్టడం అలాంటిదే. సరిగ్గా ఆ కారణం చేతనే మనం దాన్ని మరింత గట్టిగా నొక్కి చెప్పవలసి వస్తుంది. వర్తమానంలో చేసే పోరాటాలతో పాటు చారిత్రక వారసత్వం కూడా సవ్యంగా కాపాడుకోవలసి వుంటుంది. గాంధీజీని ఆర్‌.ఎస్‌.ఎస్‌ తరహాలో మలుచుకునే ఈ అతితెలివి వ్యూహాలను అప్రమత్తంగా గమనిస్తూనే ఆయన నిజమైన వారసత్వాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ప్రజాస్వామిక వాదులపై వుంటుంది.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి