Apr 11,2021 17:13

అసలు పేరు : బాలాత్రిపురసుందరి
ముద్దుపేరు : అంజలి, బాలా
పుట్టిన తేదీ: 1986, జూన్‌ 16
పుట్టిన ప్రాంతం : తూర్పుగోదావరి జిల్లా రాజోలు
చదువు: బిఎస్సీ మ్యాథ్స్‌
హాబీస్‌ : డ్యాన్సింగ్‌, మ్యూజిక్‌
ఇష్టమైన ఆహారం : దక్షిణాది వంటకాలు
ఇష్టమైన నటులు : కమల్‌ హాసన్‌, రజనీకాంత్‌, శోభన
నివాస ప్రాంతం: చెన్నయ్‌
తల్లి: పార్వతీదేవి, భారతీదేవి (పెంపుడు తల్లి)
సోదరులు : రవిశంకర్‌, బాపూజీ
ఫెమినిజం అనే విషయాన్ని మంచిమార్గంలో వాడితే మంచిదనేది నా ఉద్దేశం. అలాగే పెళ్లికి ముందు శృంగారం (ప్రీమారిటల్‌ సెక్స్‌) అనేది వ్యక్తిగత విషయం. వారివారి ఇష్టాలను బట్టి ఉంటుంది. ఎవరి ఆలోచనలు బట్టి అది ఆధారపడి ఉంటుంది. నేను గతంలో కొన్ని గుర్తుండిపోయే క్యారెక్టర్స్‌ చేశాను. వాటిలో వకీల్‌సాబ్‌ క్యారెక్టర్‌ తప్పకుండా ఉంటుందని చెప్పగలను. తెలుగు, తమిళంలో కొన్ని ఎగ్జైటింగ్‌ చిత్రాలు చేస్తున్నాను. వాటి వివరాలు త్వరలో చెబుతాను అని తెలుగు సినీ నటి అంజలీ చెబుతున్నారు.
'నిశ్శబ్దం' తర్వాత అంజలి తెలుగులో నటించిన చిత్రం 'వకీల్‌సాబ్‌'. పవర్‌స్టార్‌ పవన్‌కల్యాణ్‌ ప్రధానపాత్రలో నటించిన ఈ సినిమాలో అంజలి ఓ కీలకపాత్రలో కనిపించనున్నారు. వేణు శ్రీరామ్‌ దర్శకత్వం వహించారు. దిల్‌రాజు నిర్మాత. నివేదా థామస్‌, అనన్య, ప్రకాశ్‌రాజ్‌ ముఖ్య భూమికలు పోషించారు. 'పింక్‌' రీమేక్‌గా ఈ సినిమా రానుంది. ఏప్రిల్‌ 9న విడుదల కానుంది. ఇటీవలే ప్రీరిలీజ్‌ ఈవెంట్‌ కూడా జరుపుకున్న నేపథ్యంలో అంజలి గురించిన విశేషాలు..
ఫొటో సినిమాతో 2006లో వెండితెరకు పరిచయమైంది. 2007లో 'ప్రేమలేఖ రాశా'లో నటించినా తగిన గుర్తింపు దక్కలేదు. తర్వాత 'షాపింగ్‌ మాల్‌'లో తన నటనతో అబ్బురపరిచింది. అనంతరం మురగదాస్‌ జర్నీతో మంచిపేరు తెచ్చుకుంది. అనంతరం అనేక తెలుగు, తమిళ్‌ చిత్రాల్లో నటిస్తూ
అగ్రతారగా ఎదిగింది. ప్రస్తుతం వకీల్‌ సాబ్‌లో ప్రధానపాత్రలో నటించింది. చిత్ర ప్రమోషన్‌లో భాగంగా మాట్లాడుతూ 'దర్శకుడు శ్రీరామ్‌ వేణు నన్ను అప్రోచ్‌ అయినప్పుడు పింక్‌ సినిమా రీమేక్‌ చేస్తున్నాం. కానీ తెలుగు నేటివిటీకి తగినట్లు కొత్తగా ఉంటుందని చెప్పారు. సినిమా గురించి ఆయన చెప్పిన కాన్సెప్ట్‌ బాగా నచ్చింది. మేము ఈ సినిమాలో చేసిన మార్పులు వకీల్‌సాబ్‌ ట్రైలర్‌ చూశాక మీకు అర్థమయ్యి ఉంటుంది. హిందీ పింక్‌తో వకీల్‌సాబ్‌ని కంపేర్‌ చేసి చెప్పలేను' అన్నారు. ఈ సినిమా ప్రమోషన్‌ కోసం హైదరాబాద్‌ వచ్చిన అంజలి నగర పోలీసులు ఎం.జె మార్కెట్‌లో నిర్వహించిన ట్రాఫిక్‌ అవగాహన కార్యక్రమంలో పాల్గొన్నారు. ట్రాఫిక్‌ రూల్స్‌ పాటించడం వల్ల మనతో పాటు అవతలి వారిని కూడా సేవ్‌ చేసిన వాళ్ళం అవుతామని అంజలి చెప్పుకొచ్చారు.
నో చెప్పకూడదనే రైట్‌ ఎవరికీ లేదు...
అయితే ప్రస్తుతం సమాజంలో మహిళలపై అనేక అఘాయిత్యాలు జరుగుతున్నాయని. వాటిని ప్రశ్నించడంలో, ఎదుర్కోవడంలో మనం ఇంకా వెనుకబడే ఉన్నామని అంటున్నారు అంజలి. అయితే యువకులు ఒక్క విషయాన్ని గుర్తుంచుకోవాలని 'మీకు ఇష్టమైతే ఎస్‌ లేకుంటే నో చెప్పడం మీ ఛాయిస్‌. ''నో'' చెప్పకూడదు అని ప్రశ్నించే రైట్‌ ఎవరికీ లేదు. ఇష్టపడటం ఇష్టపడకపోవడం అమ్మాయి నిర్ణయానికే వదిలేయాలి వకీల్‌సాబ్‌ సినిమాలోనూ పవన్‌ ఇదే విషయాన్ని చెప్పబోతున్నారు' అని తెలిపారు.
ఆయన వస్తుంటే సెట్‌ అంతా సైలెన్స్‌...
పవన్‌ కల్యాణ్‌తో నటించడం మొదట్లో కొన్ని రోజులు ఇబ్బందిగానే ఉండేది. ఆయన వస్తుంటే సెట్‌లో పిన్‌డ్రాప్‌ సైలెన్స్‌ ఉంటుంది. నేను జనరల్‌గా ఎక్కువగా మాట్లాడతాను. అలాంటి టైమ్‌లో నా వల్ల మిగతా వారు ఏదైనా డిస్ట్రబ్‌ అవుతారా అని భయపడ్డాను. పవన్‌ చాలా ఇన్‌పుట్స్‌ ఇస్తూ సినిమా చేయించారు. అవన్నీ చూశాక మన క్యారెక్టర్‌ మనం సరిగ్గా చేస్తే సరిపోతుంది అనే నమ్మకం వచ్చింది. నాకూ, నివేదా, అనన్యకు మధ్య చాలా సీన్స్‌ ఉంటాయి. మా మధ్య రిలేషన్‌ లేకుంటే క్యారెక్టరైజేషన్స్‌ సరిగ్గా రావు. మా మధ్య చాలా తక్కువ టైమ్‌లో బౌండింగ్‌ ఏర్పడింది. అందువల్ల నటించేప్పుడు చాలా ఈజీ అయ్యింది.
కోర్ట్‌ సీన్‌ చేశాక ఉద్వేగానికి లోనయ్యాను...
సినిమా ఇండిస్టీలో నాయికలకు కొన్ని చేదు సందర్భాలు ఎదురవుతుంటాయి అంటారు. అయితే ఇక్కడ సెలబ్రిటీ, సాఫ్ట్‌వేర్‌ ఎంప్లారు అని కాదు అమ్మాయి అమ్మాయే. ట్రైలర్‌లో ఒక డైలాగ్‌ ఉంటుంది. అవును డబ్బులు తీసుకున్నాం అని. ఆ ఒక్క సీన్‌ చాలు నా క్యారెక్టర్‌ ఎంత బలంగా ఉంటుంది అని చెప్పేందుకు. ఈ సీన్‌ మరోరోజు చేయాల్సింది. కానీ ఆ రోజు సడెన్‌గా షూట్‌ చేశాం. ఈ కోర్ట్‌ సీన్‌ చేశాక, నేను వణికిపోయాను. అంత ఉద్వేగానికి గురయ్యాను. ఇలాంటి ఎమోషనల్‌ సీన్స్‌ చేసేప్పుడు నటిగా నేనూ ఉద్వేగపడతాను. అలా అయితేనే సీన్‌ కరెక్ట్‌గా వస్తుంది. వకీల్‌ సాబ్‌లో ప్రకాష్‌రాజ్‌తో మరోసారి పనిచేసే అవకాశం వచ్చింది. మన ఎదుట ఉన్న ఆర్టిస్ట్‌ బాగా నటిస్తేనే, మనకూ ఆ టైమింగ్‌ వస్తుంది. వాళ్లు ఫెర్మార్మ్‌ చేయకుంటే మనమూ డల్‌ అవుతాం.
''మగువా..'' కోసం చాలా మాంటేజ్‌లు చేశాం..
''మగువా మగువా'' పాట హిందీలో లేదు. మహిళల మీద ఈ పాట చేయడం సినిమాలో చేసిన మంచి మార్పు. ''మగువా'' పాట విన్నప్పుడు మన ఫేస్‌లో ఒక సంతోషం వస్తుంది. ఈ సాంగ్‌ కోసం చాలా మాంటేజ్‌లు షూట్‌ చేశాం. వాటిలో బెస్ట్‌ అనిపించుకున్నవి పాటలో పెట్టాం. పింక్‌ హిందీ, తమిళ చిత్రాల్లో మగువాలాంటి పాట ఉండదు. ట్రైలర్‌లో చూసిన సీన్‌ చేశాక పవన్‌ క్లాప్‌ కొట్టి, నన్ను అప్లాజ్‌ చేశారు. సాధారణంగా పవన్‌ ఎక్స్‌ప్రెసివ్‌గా ఉండరు. కానీ ఆయన ప్రశంసించాక సంతోషం కలిగింది.
              ఏ నాయికైనా తన కెరీర్‌ను ఎలా ప్లాన్‌ చేసుకుంటున్నారు అనే దానిపై ఆమె కెరీర్‌ ఆధారపడి ఉంటుంది. నాకు కెరీర్‌లో ఎప్పుడూ గ్యాప్‌ రాలేదు. నచ్చిన సినిమాలు ఎంపిక చేసుకుంటూ నటిస్తున్నాను. నేను ఇప్పుడు ఏ దారిలో వెళ్తున్నానో భవిష్యత్‌లోనూ అలాగే కంటిన్యూ చేస్తానని తెలిపారు.