Feb 02,2022 07:00

రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ప్రైవేటీకరణ విధానాల్లో భాగంగా జెన్‌కో లో అత్యంత అధునాతనమైన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంటును ప్రయివేటుకు అప్పజెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకవైపు అత్యంత ఎక్కువ ధరలకు బయట ప్రయివేటువారి నుండి విద్యుత్‌ను కొంటూ...రాష్ట్ర ప్రభుత్వం చేతిలోని ఒక భారీ విద్యుత్‌ కర్మాగారాన్ని ప్రయివేటుకు అప్పజెప్పడం వల్ల...ప్రజలపై రాబోయే కాలంలో భారాలు తీవ్రంగా పడతాయి.

   నెల్లూరు జిల్లా లోని శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌ అత్యాధునికమైన సూపర్‌ క్రిటికల్‌ సాంకేతిక నైపుణ్యంతో నడుస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని జెన్‌కో సంస్థ ఆధ్వర్యంలో 1600 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో పనిచేస్తున్నది. మరో 800 మెగావాట్ల ఉత్పత్తి సామర్థ్యంతో యూనిట్‌-3 నిర్మాణం 90 శాతం పూర్తి అయ్యింది. రూ.21 వేల కోట్లు పెట్టుబడి వ్యయంతో 1490 ఎకరాల్లో నిర్మించబడిన ఈ థర్మల్‌ ప్లాంటులో ఇంజనీర్లతో సహా అన్ని రకాల కార్మికులు 1810 మంది పనిచేస్తున్నారు. థర్మల్‌ ప్లాంటు చుట్టు పక్కల గ్రామాల ప్రజలు చౌకగా భూములిచ్చి త్యాగం చేశారు. ఇటువంటి భారీ కీలకరంగ పరిశ్రమను ప్రయివేటుకు 25 సంవత్సరాలకు లీజుకు ఇవ్వాలని (21.1.2022) రాష్ట్ర క్యాబినెట్‌ నిర్ణయించడం...స్థానిక ప్రజలు, కార్మికులు, రాష్ట్ర ప్రయోజనాలకు పూర్తి వ్యతిరేకం. రాష్ట్ర ప్రభుత్వం థర్మల్‌ ప్లాంటును అదానీ గ్రూపుకి అప్పగించాలనే నిర్ణయం చేసిందని వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే కృష్ణపట్నం పోర్టును బెదిరించి లాక్కున్న 'అదానీ గ్రూపు'నకు ఇప్పుడు థర్మల్‌ ప్లాంటుపై కన్నుపడింది. చుట్టూ అనేక ప్రయివేటు థర్మల్‌ ప్లాంట్లు ఉన్నా, లాభాలు బాగా వచ్చే దామోదరం సంజీవయ్య పవర్‌ ప్లాంట్‌నే కైవసం చేసుకోవడానికి ఉత్సాహం చూపిస్తున్నది.
   దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ స్టేషన్‌కు నష్టాలు వస్తున్నాయనే పేరుతో ప్రయివేటుకు అప్పగించాలనడం దారుణం. పిచ్చికుక్క అని పేరు పెట్టి మంచి కుక్కను చంపినట్లు అత్యంత ఆధునికమైన థర్మల్‌ ప్లాంటును కారుచౌకగా ప్రయివేటుకు కట్టబెట్టాలని రాష్ట్ర ప్రభుత్వం కుట్ర చేస్తున్నది. ఈ థర్మల్‌ ప్లాంటులో ఒక యూనిట్‌ విద్యుత్‌ ఉత్పత్తి వ్యయం రూ.4.64 కాగా రాష్ట్రం లోని 3 డిస్కంలు ప్రయివేటువారి నుంచి యూనిట్‌ రూ.7 నుండి రూ.20 వరకు కొంటున్నారు. మొదట ఈ థర్మల్‌ ప్లాంట్‌ను ప్రయివేటుకు ఇచ్చి, ఆ తర్వాత విజయవాడ, ఆర్‌టిపిపి ప్లాంట్లనూ ప్రయివేటుపరం చెయ్యాలన్నది సర్కారు యోచనగా వుంది. ఇకపై ప్రైవేటు థర్మల్‌ ప్లాంట్లు ఇంకా యూనిట్‌ ఛార్జీలు పెంచడం ఖాయం. ప్రభుత్వ రంగం పోటీ లేకుండా చేయడమే ఈ థర్మల్‌ ప్లాంటును ప్రయివేటుకు అప్పగించడం. దానివల్ల రాష్ట్ర ప్రజలపై విద్యుత్‌ భారాలు పడతాయి. రాష్ట్రంలో మూడు డిస్కంలకు గత సంవత్సరం రూ.10045.61 వేల కోట్లు నష్టాలు వచ్చాయి. ఈ పేరుతో గత 20 సంవత్సరాల నుండి పైసా కూడా పెరగని కింది స్థాయి ప్రజలపై కూడా విద్యుత్‌ చార్జీలు పెంచాలని ఈ సంవత్సరం డిస్కాంలు ఇఆర్‌సి ముందు ప్రతిపాదించాయి.
    బంగారు బాతు లాంటి థర్మల్‌ ప్లాంటు ఇది. ఈ ప్లాంటుకు నష్టాలు రావడం కృత్రిమ సృష్టి మాత్రమే. 2020-21 సంవత్సరంలో ఈ ప్లాంటుకు సక్రమంగా బొగ్గు సరఫరా చేసిన ఆరు నెలలు రూ.60 కోట్లు లాభాలు వచ్చాయి. కానీ అత్యధిక కాలం రాష్ట్ర ప్రభుత్వం బొగ్గు కొరతను సృష్టించి నష్టాలు వస్తున్నాయని నెపం వేస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వ సిఫారసుతో ''నాలెడ్జ్‌'' అనే కోల్‌ కంపెనీ ద్వారా నాసిరకం బొగ్గు 4 లక్షల టన్నులు రూ.400 కోట్లు ఖర్చుతో గత సంవత్సరం దిగుమతి చేశారు. ఈ బొగ్గును ఏ థర్మల్‌ ప్లాంటులో వాడడానికి పనికిరాదని అధికారులు తేల్చారు. ఇంకా లక్షల టన్నులు పోర్టులోనే గుట్టలు పడి వుంది. దీనికి బాధ్యులు ఎవరో తేల్చి వారిపై ఎందుకు చర్య తీసుకోరు? జెన్‌కోలకు రాష్ట్ర ప్రభుత్వం రూ.800 కోట్లు బకాయి ఉంది. ఈ బకాయిలు చెల్లించకపోవడంతో జెన్‌కోలు సకాలంలో కనీసం బొగ్గు కూడా కొనుగోలు చేసే స్థాయిలో లేవు.
    ప్రభుత్వం తరపున డిస్కంలు ఇచ్చే ఆర్డర్‌ను బట్టి విద్యుత్‌ ఉత్పత్తి చేయాలి. సామర్థ్యం ఎక్కువ వున్నా ఎక్కువ విద్యుత్‌ చేస్తే ఇతర వస్తువుల్లాగా గోడౌన్లలో నిల్వ చేయడానికి వీలు కాదు. కానీ రాష్ట్ర ప్రభుత్వం పక్కనే వున్న ప్రయివేటు సంస్థలైన సెంబ్‌కార్ప్‌ (గాయత్రి) నుంచి ఎక్కువ విద్యుత్‌ తీసుకుంటూ జెన్‌కోకు తక్కువ ఆర్డర్‌ ఇస్తున్నారు. జెన్‌కో అన్ని సంస్థలకు కలిపి 30 వేల మిలియన్‌ యూనిట్లు కమిటెడ్‌ ఆర్డర్‌ ఇచ్చి దానిలో సుమారు సగం 16430 మిలియన్‌ యూనిట్లు మాత్రమే గత సంవత్సరం జెన్‌కో నుండి వాడుకుంటున్నారు. దానివల్ల 1999-20లో 47 శాతం, 2020-21లో 48 శాతం, 2021-22లో 40 శాతం మాత్రమే డిస్కంలు తీసుకోవడం వల్ల సామర్థ్యంలో సగం కంటే తక్కువ మాత్రమే విద్యుత్‌ ఉత్పత్తి చేశారు. సెంబ్‌కార్ప్‌ (గాయత్రి) నుంచి యూనిట్‌కు 10 పైసలు అదనంగా చెల్లించి కొనడం అంటే ప్రయివేటుపై రాష్ట్ర ప్రభుత్వానికి ఎంత ప్రేమో అర్థం అవుతుంది. దీనివల్ల సొంత సంస్థలను ధ్వంసం చేసి ప్రయివేటును మేపడమే కదా? దీనితో 70 శాతం కంటే తక్కువ సామర్థ్యంతో ఉత్పత్తి చేశారనే వంకతో ఎవైలబిలిటీ ఛార్జీలు ఇవ్వకుండా ఎగ్గొట్టారు.
     రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ప్రయివేటీకరణ విధానాల్లో భాగంగా జెన్‌కోలో అత్యంత అధునాతనమైన శ్రీ దామోదరం సంజీవయ్య థర్మల్‌ పవర్‌ ప్లాంటును ప్రయివేటుకు అప్పజెప్పాలనే నిర్ణయానికి వచ్చింది. ఒకవైపు అత్యంత ఎక్కువ ధరలకు బయట ప్రయివేటువారి నుండి విద్యుత్‌ను కొంటూ...రాష్ట్ర ప్రభుత్వం చేతిలోని ఒక భారీ విద్యుత్‌ కర్మాగారాన్ని ప్రయివేటుకు అప్పజెప్పడం వల్ల...ప్రజలపై రాబోయే కాలంలో భారాలు తీవ్రంగా పడతాయి. 20 సంవత్సరాల తరువాత ఈ సంవత్సరం ఏప్రిల్‌ 1వ తేదీ నుండి భారీగా పేదలపై విద్యుత్‌ ఛార్జీలు భారం మోపడానికి డిస్కంలు తమ ప్రతిపాదనను విద్యుత్‌ నియంత్రణ మండలి ముందు ఇప్పటికే ఇవ్వడమైనది. ఒక్క బల్బు వాడే 30 యూనిట్ల దగ్గర నుండి ఈ భారాలు పెరుగుతాయి. పేదలకు విద్యుత్‌ సబ్సిడీ ఎత్తివేయాలనే దుర్మార్గపు కుట్ర ఇందులో దాగి వుంది. కేంద్ర ప్రభుత్వంతో జరిగిన ఒప్పందం మేరకు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ పంపులకు విద్యుత్‌ మీటర్లు ఇప్పటికే రాష్ట్రమంతా బిగిస్తున్నారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్‌ రాబోయే కాలంలో ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం మీటర్లు బిగించినా ప్రభుత్వమే విద్యుత్‌ ఛార్జీలు భరిస్తుందనే మాటలు ఎంతో కాలం చెల్లవు. విద్యుత్‌ ఉత్పత్తి చేసే జెన్‌కోలు, డిస్కంల ప్రయివేటీకరణ జరిగితే దాని దుష్ఫలితాలు తీవ్రంగా ఉంటాయి. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం విద్యుత్‌ ప్రయివేటీకరణ విధానాలను విరమించుకోవాలి.
 

/ వ్యాసకర్త : సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు /
సిహెచ్‌. నర్సింగరావు

సిహెచ్‌. నర్సింగరావు