న్యూఢిల్లీ : గతేడాది కోవిడ్ మహమ్మారి సెకండ్ వేవ్‌లో లక్షలాదిమంది మరణించిన నేపథ్యంలో ఆరోగ్య రంగానికి కేటాయింపులు పెరుగుతాయని ఆశించినవారికి నిరాశే మిగిలింది. దేశంలో కరోనా మరణాలు దాదాపు 5లక్షలకు చేరుకున్న ఈ తరుణంలో ఆరోగ్య రంగ బడ్జెట్ (2022-23) మాత్రం గతేడాది అంచనాల కన్నా (ధరల పెరుగుదలను కూడా పరిగణనలోకి తీసుకుంటే) ఏడు శాతం క్షీణించింది. మొత్తం వ్యయంలో నామమాత్రంగా ఆరోగ్య బడ్జెట్‌ను 2021-22లో (సవరించిన అంచనాలు) 2.35శాతం నుండి 2022-23 (బడ్జెట్ అంచనాలు)లో 2.26శాతానికి తగ్గించింది. వాస్తవానికి 2020-21లో పెట్టిన మొత్తం ఖర్చుతో పోలిస్తే ఆరోగ్య రంగ వ్యయం ఇంకా తక్కువగా వుంది. 2025 కల్లా జిడిపిలో 2.5శాతం లక్ష్యాన్ని చేరాలంటే 2022-23లో రూ.2లక్షల కోట్లకు పైగా మొత్తాలను కేంద్రం ఆరోగ్య రంగానికి కేటాయించాలని 2020 మార్చిలో కరోనాకు ముందుగానే పార్లమెంటరీ స్థాయీ సంఘం నివేదిక పేర్కొంది. కానీ ప్రస్తుత కేటాయింపులు చూస్తే దానిలో సగానికి కన్నా తక్కువగానే వుండడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది. 2020-21 (వాస్తవికంగా)తో పోలిస్తే ఆరోగ్య బడ్జెట్ జిడిపిలో నిష్పత్తిపరంగా చూసినట్లైతే క్షీణించింది. కోవిడ్ సంక్షోభం ఇంకా కొనసాగుతున్న సమయంలో ఈ చర్య మరింత ప్రాముఖ్యతను సంతరించుకుంది.
కరోనా ప్రారంభం నుండి క్షీణిస్తున్న కేటాయింపులు
గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య సంరక్షణకు, పునరుత్పాదక, శిశు ఆరోగ్య సంక్షేమానికి ంబంధించి నేషనల్ హెల్త్ మిషన్ (ఎన్‌హెచ్‌ఎం) అత్యంత కీలకమైన కేంద్ర ప్రాయోజిత పథకాల్లో ఒకటిగా వుంది. కరోనా సమయంలో, ప్రాథమిక ఆరోగ్య సంరక్షణ సేవలు తీవ్రంగా దెబ్బతిన్నాయి. లాక్‌డౌన్ సమయాల్లో స్కూళ్ళు, అంగన్‌వాడీలు మూతపడడంతో మహిళల, పిల్లలల పోషకాహారం, ఆరోగ్యం తీవ్రంగా ప్రభావితమైంది. కానీ అప్పటి నుండే అంటే 2020ా21 నుండే ఎన్‌హెచ్‌ఎం కేటాయింపులు క్షీణించడం ఆరంభించాయి.
మోడీ హయాంలోనే ప్రారంభం
మోడీ సర్కార్ అధికారంలోకి వచ్చినప్పటి నుండే ఎన్‌హెచ్‌ఎం కేటాయింపులు దెబ్బతినడం ఆరంభమైందని చెప్పవచ్చు. 2014ా15లో మోడీ ప్రభుత్వం బాధ్యతలు చేపట్టేనాటికి మొత్తం ఆరోగ్య రంగ బడ్జెట్‌లో ఎన్‌హెచ్‌ఎం కేటాయింపులు 61శాతంగా వుండేవి. 2022ా23కి వచ్చేసరికి ఆ నిష్పత్తి 41శాతానికి పడిపోయింది.
ప్రస్తుతం కోవిడ్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా చిన్నాభిన్నమవుతున్న ఆరోగ్య వ్యవస్థలను దృష్టిలో వుంచుకుని ప్రజారోగ్య వ్యయాన్ని గణనీయంగా పెంచాలని అంతర్జాతీయంగా ఏకాభిప్రాయం వ్యక్తమవుతోంది. కానీ ఇలా కేటాయింపులు తగ్గడం దురదృష్టకరమని, ఖండించదగినది జిందాల్ గ్లోబల్ యూనివర్శిటీ ఆరోగ్య ఆర్థికవేత్త ఇంద్రనీల్ ముఖోపాధ్యాయం వ్యాఖ్యానించారు.
దెబ్బతిననున్న పరిశోధనా రంగం
ప్రస్తుత పరిస్థితుల్లో ఆరోగ్య రంగంపై పరిశోధనకు మరింతగా పెట్టుబడులు సమకూర్చాల్సిన అవసరం వున్న సమయంలో పరిశోధనా రంగానికి కేటాయింపులు చాలా స్వల్పంగా పెరిగినట్లు కనిపిస్తున్నా మొత్తం ఆరోగ్య బడ్జెట్‌లో నిష్పత్తిపరంగా చూసినట్లైతే 2020ా21లో 3.8శాతంగా వున్న పెట్టుబడులు 2022ా23లో 3.6శాతానికి క్షీణించాయి.










