Feb 02,2022 09:24

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : రాష్ట్రంలో నెలకొన్న కేంద్రీయ విద్యాసంస్థలకు అప్పులే దిక్కుగా కేంద్రప్రభుత్వం బడ్జెట్‌లో ప్రతిపాదనలు చేసింది. ఉన్నత విద్య నిధుల సంస్థ (హెఫా) ద్వారా రుణం ఇప్పిస్తామని చెబుతోంది. 2018లో హెఫా విధానాన్ని తీసుకొచ్చింది. రాష్ట్ర విభజన తరువాత నెలకొన్న 11 కేంద్రీయ విద్యాసంస్థల్లో కేవలం ఆరింటిని మాత్రమే ప్రస్తావించింది. ఇండియాన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యూకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌(ఐఐఎస్‌ఇఆర్‌), ఎన్‌ఐటీ, ఐఐటీ, ఐఐఎంలకు హేఫా ద్వారానే రుణాలను అందిస్తున్నట్లు బడ్జెట్‌లో పేర్కొంది. సెంట్రల్‌ యూనివర్సీటి, గిరిజన యూనివర్సీటీ, పెట్రోల్‌ యూనివర్సీటీకి కేంద్రప్రభుత్వమే అరకొర నిధులను కేటాయించింది. సెంట్రల్‌ యూనివర్సిటీ గత బడ్జెట్‌లో 60.35కోట్లు కేటాయింపులు చూపి రూ.20.11కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇప్పుడు 56.66 కోట్లు ప్రతిపాదించింది. ఎపి, తెలంగాణ గిరిజన యూనివర్సిటీలకు కలిపి కలిపి గత బడ్జెట్‌లో రూ.53.80కోట్లు చూపించి కేవలం 13.37 కోట్లు మాత్రమే ఖర్చు చేసింది. ఇప్పుడు రెండింటికీ రూ.44కోట్లు ప్రతిపాదించింది. పెట్రోలియం యూనివర్సిటీకి రూ.150 కోట్లు ప్రతిపాదించింది. రాష్ట్రంలో ఉన్న ఐఐఐటీకి ఒక్క రూపాయి కేటాయించలేదు. అగ్రికల్చర్‌ యూనివర్సిటీ, మంగళగిరిలోని ఎయిమ్స్‌, గన్నవరంలోని జాతీయ విపత్తుల నిర్వహణ సంస్థల గురించి ప్రస్తావన బడ్జెట్‌లో లేదు.