Jun 30,2023 22:40

గ్రామాల్లో జీడిపిక్కలను కొనుగోలు చేస్తున్న దళారులు

- రూ.7,500 మద్దతు ధర ఖరారైందని ప్రచారం
- దళారుల ద్వారా గ్రామాల్లో జీడిపిక్కల కొనుగోలు
ప్రజాశక్తి - పలాస: 
జీడి వ్యాపారులు కొత్త డ్రామాకు తెరతీశారు. ఇప్పటికే ఈనెల ఐదు నుంచి ఆగస్టు ఒకటో తేదీ వరకు పరిశ్రమల బంద్‌ ప్రకటించగా, తాజాగా జీడిపిక్కలకు రూ.7,500 మద్దతు ధర ఖరారైందని దళారుల ద్వారా గ్రామాల్లో విస్తృత ప్రచారం చేయిస్తున్నారు. అబద్దపు ప్రచారాలతో రైతులను గందరగోళపరుస్తూ గ్రామాల్లో జీడిపిక్కలు కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ధర మరింత పతనమవుతుందని మోసపూరిత ప్రచారం సాగిస్తున్నారు. దీన్ని నమ్మిన కొందరు రైతులు పంటను తప్పనిసరి పరిస్థితుల్లో దళారులకు విక్రయిస్తున్నారు. గ్రామాల్లో రైతుల ఆర్థిక దయనీయ పరిస్థితిని తెలుసుకుంటున్న దళారులు, వారి ఇళ్లకు వెళ్లి ధరలు పెరిగే పరిస్థితి లేదని చెప్తూ నచ్చిన ధరకు కొనుగోలు చేస్తున్నారు. ఆర్థిక అవసరాలున్న వారు తప్పక తెగనమ్ముకుంటున్నారు.
మోసపూరిత ప్రచారాలు నమ్మొద్దు
మార్కెట్‌ మాంద్యం పరిస్థితులు ఉంటే ఇప్పటికే వ్యాపారులు పరిశ్రమలు మూసివేసేవారని, అలాకాకుండా ఐదో తేదీ నుంచి బంద్‌ ప్రకటనలోనే వారి ఎత్తుగడ అర్థమవుతోందని జీడిరైతుల సంఘం జిల్లా కన్వీనర్‌ తెప్పల అజరు కుమార్‌ ఒక ప్రకటనలో విమర్శించారు. మద్దతు ధర లభించే వరకు జీడిపిక్కలను విక్రయించవద్దని రైతులను కోరారు. జీడికి సరైన ధర ప్రకటిస్తామని చెప్పిన మంత్రి సీదిరి అప్పలరాజు స్పందించాలన్నారు. 80 కేజీల జీడిపిక్కల బస్తాకు రూ.16 వేలు మద్దతు ధర ప్రకటించాలని, ప్రభుత్వమే రైతుభరోసా కేంద్రాల ద్వారా కొనుగోలు చేయాలని డిమాండ్‌ చేశారు.