23 ఏళ్లకే ప్రతినిధిగా అబ్దుల్లా.. వెంకటేశ్వరరావు
మహాసభ అర్హతల నివేదిక విశేషాలు...
తాడేపల్లి : సిపిఎం 26వ రాష్ట్ర మహాసభలు 27, 28, 29 తేదీల్లో గుంటూరుజిల్లా తాడేపల్లిలో ఉత్సాహపూరితంగా జరిగాయి. ఈ సభల్లో ఇరవై మూడేళ్ల యువకుల నుండి 80ఏళ్లు పైబడిన వారి వరకు ఉన్నారు. ఉద్యమాల్లో పాల్గని, అత్యధిక కాలం జైలు జీవితం గడిపిన వారు కూడా ఈ సమావేశాల్లో పాల్గని యువకుల్లో ఉత్సాహం నింపారు. ప్రభుత్వ వ్యతిరేక విధానాలపై పోరాటంలో జైలు జీవితం గడపడమూ సంతోషమేనని చాటిచెప్పారు. ముత్యాల గుర్నాధం (నెల్లూరు), ఏడు సంవత్సరాల మూడు నెలలు, మూలం రమేష్ ఐదు సంవత్పసరాల మూడు నెలలు అత్యధికంగా జైలు జీవితం గడిపారు. 4నెలలకు పైగా జైలు జీవితం గడిపిన వారిలో సిహెచ్ నరసింగరావు, వి.ఉమామహేశ్వరరావు, ఎం.ఎ.గఫూర్ వంటి వారు సభలో వున్నారు. వీరితోపాటు అజ్ఞాత జీవితం గడిపిన వారు 44 మంది సభలకు హాజరయ్యారు.
కాగా, ఈ మహాసభలకు 454 మంది హాజరు కావాల్సి వుండగా, 443మంది హాజరయ్యారు. వీరిలో పురుషులు 363 మంది కాగా, మహిళలు 77 మంది. వీరిలో కర్నూలు నుంచి హాజరైన ఎస్.అబ్దుల్లా, పశ్చిమ కృష్ణా నుంచి హాజరైన సిహెచ్ వెంకటేశ్వరరావు 23ఏళ్ల అతి పిన్న వయస్కులు కాగా, పాటూరు రామయ్య, వై.కేశరావు, బిఆర్ తులసీరావు 80 ఏళ్లుపైబడిన వారు. వీరు 1960కి ముందునుంచే పార్టీ సభ్యులుగా వున్నారు. 1978లో జరిగిన 13వ రాష్ట్ర మహాసభ నుండి వీరు క్రమం తప్పకుండా సభలకు హాజరుకావడం విశేషం. 41ా50 ఏళ్ల మధ్య వయస్కులు అత్యధికంగా 152 మంది హాజరయ్యారు. ముఖ్యంగా మధ్యతరగతి రైతులు (114), వ్యవసాయ కార్మికులు (79), కార్మికులు (66), పేద రైతులు (59), మధ్యతరగతి (51), చేతివృత్తి (23) మంది ఈ సభల్లో పాల్గనడం విశేషం. సామాజిక తరగతుల వారీగా చూసినా బిసి (158), ఎస్సీ (88), ఎస్టీ (29), మైనారిటీలు (14) హాజరయ్యారు. ప్రధానంగా ట్రేడ్ యూనియన్ రంగం నుంచి 159మంది హాజరయ్యారు. 1991ా2000 కాలంలో అత్యధికంగా 151 మంది పూర్తికాలం కార్యకర్తలుగా పార్టీలోకి వచ్చారు. వీరితో పాటు నిరక్షరాస్యులు 7మంది హాజరైతే, పోస్టుగ్రాడ్యుయేషన్ చేసిన వారు 68 మంది హాజరయ్యారు.
భార్యాభర్తలు, తండ్రీ కొడుకులు, తల్లీ కొడుకులు, తండ్రి కూతుళ్లు సైతం తమ తమ కుటుంబాలతో ఈ సభలకు హాజరవడం ఒక ఆకర్షణగా నిలిచింది.










