హైదరాబాద్ : తెలంగాణ ఆర్టీసీ యూనియన్ నేతల బృందంతో గవర్నర్ తమిళిసై చర్చించారు. ఆర్టీసీ బిల్లులోని ఐదు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వం నుంచి వివరణ కోరిన గవర్నర్ తమిళిసై.. ఇదే సమయంలో ఆ సంస్థ ఉద్యోగులతో చర్చలకు సన్నద్ధమయ్యారు. రాజ్‌భవన్‌కు తరలివచ్చిన ఆర్టీసీ యూనియన్ నాయకులతో పుదుచ్చేరి నుంచి వీడియో కాన్ఫరెన్స్‌లో మాట్లాడతానని గవర్నర్ తెలపడంతో టీఎంయూ అధ్యక్ష, కార్యదర్శులు ఎ.ఆర్.రెడ్డి, థామస్‌రెడ్డి సహా 10 మంది సభ్యుల బృందం గవర్నర్‌తో గంటపాటు చర్చించారు. అనంతరం ఆర్టీసీ యూనియన్ నేత థామస్ రెడ్డి మాట్లాడుతూ .... గవర్నర్ తమ సమస్యలు విన్నారని, సానుకూలంగా స్పందించారని అన్నారు. ప్రభుత్వ వివరణ తనకు ఇంకా అందలేదని.. వివరణ అందిన తర్వాత బిల్లు ఆమోదిస్తానని గవర్నర్ చెప్పినట్లు తెలిపారు. కార్మికుల ప్రయోజనాలే తనకు ముఖ్యమని గవర్నర్ అన్నారని, త్వరలోనే బిల్లు ఆమోదం పొందుతుందని ఆశాభావంతో ఉన్నట్లు థామస్‌రెడ్డి తెలిపారు.










