తాము నటించిన సినిమాలను ప్రమోట్ చేసుకోవడానికి మాత్రమే ఎక్కువమంది నటీనటులు బయటకు వస్తుంటారు. సమాజంలో జరిగే విషయాలపై పెద్దగా స్పందించరు. కానీ కొందరు నటులు వాటి గురించి బహిరంగంగా మాట్లాడుతుంటారు. అలాంటి వారిలో కోలీవుడ్ హీరో కార్తీక్ ముందు వరుసలో ఉంటారు. ఈ మధ్య కేంద్ర ప్రభుత్వం తీసుకొన్న నిర్ణయాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా రైతులు నిరసనకు దిగారు. రైతుల ఆందోళనపై స్పందించాలంటూ తమిళనటుడు కార్తీక్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. ప్రస్తుతం అది దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.
తమిళ హీరో కార్తీక్ ఉజావన్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు. ఈ సంస్థ రైతులకు అండగా ఉండటానికి, వారికి సమాజంలో మరింత గౌరవం పెంచడానికి కృషి చేస్తూ ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా రైతులు నిరసనకు దిగిన విషయం తెలిసిందే. ఢిల్లీలో జరుగుతున్న రైతుల ఆందోళనపై స్పందించాలంటూ కార్తీక్ కేంద్రానికి బహిరంగ లేఖ రాశారు. రైతుల హక్కులను కాపాడే విధంగా కేంద్రం తగు నిర్ణయం తీసుకోవాలని, రైతుల ఆవేదనను సర్కారు పట్టించుకోవాలని అందులో కోరారు.
'ఎండనక, వాననక మన కడుపు నింపడానికే రైతులు కష్టపడుతుంటారు. అలాంటివారు గడ్డకట్టే చలిని, కరోనా వ్యాప్తిని లెక్కచేయకుండా ఆందోళనకు దిగారు. ఇందులో పెద్ద ఎత్తున మహిళలు, వృద్ధులు పాల్గొంటున్నారు. ఇది ఓ చరిత్రాత్మక ఆందోళనకు దారితీసేలా కనిపిస్తున్నది. కాబట్టి వెంటనే చర్చలు జరపాలి. రైతులు ఇప్పటికే నీటి వనరుల కొరత, ప్రకృతి వైపరీత్యాల వల్ల అనేక నష్టాలను చవిచూస్తున్నారు. పండించిన పంటకు సరైన ధరలేక వారు విలవిల్లాడిపోతున్నారు. ప్రస్తుతం ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు వ్యవసాయ బిల్లుల కారణంగా మరింత తీవ్రమైన ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఈ బిల్లుల వల్ల తాము పండించిన పంటకు ధర నిర్ణయించే హక్కునూ రైతులు కోల్పోతామని భయపడుతున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇప్పటికైనా వారి గొంతులను విని డిమాండ్లను పరిగణనలోకి తీసుకోవాలి!' అని ఆ లేఖలో కార్తీక్ రాశారు.
కార్తీక్ ఇప్పుడే కాదు గతంలోనూ సెంటర్ ఎన్విరాన్మెంట్ ఇంపాక్ట్ అసెస్మెంట్ (జు×A) 2020కు వ్యతిరేకంగానూ ఆయన గొంతు విప్పారు.