కరోనా సృష్టించిన ఆర్థిక వినాశనం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించిన బడ్జెట్ లో ప్రజల ఇక్కట్లను ఏమాత్రం పట్టించుకోని తీరు దిగ్భ్రాంతిని కలిగిస్తోంది. నరేంద్ర మోడీ ప్రభుత్వం కార్పొరేట్ల సేవలోనే తరిస్తున్నప్పటికీ తాజా బడ్జెట్ ప్రక్రియలో దేశాన్ని వారికి దోచిపెట్టడంలో సరికొత్త రికార్డు సృష్టించింది. సామాన్యులు ఎదుర్కున్న కరోనా కష్టాలను, ఏడాదికిపైగా ఉద్యమించిన రైతాంగం ముందుకు తీసుకువచ్చిన వివిధ డిమాండ్లను, వేతన జీవుల ఆదాయ పన్ను రాయితీల ఆకాంక్షలను, కార్మిక లోకపు కష్టాలను, అసంఘటిత రంగపు ఆవేదనను, నిరుద్యోగుల నిర్వేదాన్ని, విద్యార్థుల భవిష్యత్తును మోడీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. అదే సమయంలో ఎయిర్ ఇండియా తరహాలోనే మిగిలిన ప్రభుత్వ రంగ సంస్థలనూ అమ్మి తీరుతామని, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌ను రెండవ దశకు తీసుకుపోతామని, రాబోయే 25 సంవత్సరాల పాటు ఇదే తమ విధానమని ప్రకటించింది. దేశవ్యాప్తంగా 90 శాతం ప్రజానీకం కష్టాల కొలిమిలో చిక్కుకుని ఆపన్న హస్తం కోసం ఎదురుచూస్తున్న వేళ కాడి కింద పడేసి అదే తమ ఘనతంటూ ఇంత నిర్లజ్జగా చెప్పుకుంటున్న ప్రభుత్వం నభూతో! ఇక తెలుగు రాష్ట్రాలకు, ముఖ్యంగా విభజన వల్ల అన్ని విధాల నష్టపోయిన ఆంధ్రప్రదేశ్‌కు మోడీ ప్రభుత్వం చేస్తున్న అన్యాయం గురించి ఎంత చెప్పినా తక్కువే! తాజా బడ్జెట్‌లోనూ వివక్షను కొనసాగించింది.
సరళీకరణ విధానాలను అనుసరించే రాష్ట్ర ప్రభుత్వాలు సైతం ఈమారు కేంద్ర ప్రభుత్వంపై విమర్శలు గుప్పించాయి. ఇది కేవలం ఆయా పార్టీల రాజకీయ ఎత్తుగడగా చూడలేం. బిజెపి ప్రభుత్వ అతి కేంద్రీకరణ విధానాలకు, రాష్ట్రాల ప్రయోజనాలకు నడుమ పెరుగుతున్న అగాధాన్ని ఇదొక సూచికగా భావించాలి. సామాన్యులను విస్మరించి, కొద్దిమంది ప్రైవేటు వ్యక్తుల ప్రయోజనాలకు పెద్ద పీట వేయడమన్నది కేంద్ర బడ్జెట్‌లో ప్రధాన ధోరణిగా ఉండటం 1980వ దశకం చివర్లో ప్రారంభమైంది. అప్పట్లో ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు, అమలు చేసిన ఉదారవాద విధానాలు దీనికి నాంది. అప్పటి నుండే కార్పొరేట్ల సంపాదన ఇబ్బడిముబ్బడిగా పెరగడం ప్రారంభమైంది. అదే సమయంలో ప్రజల్లో ముఖ్యంగా మధ్యతరగతిలో భ్రమలు కూడా పెరిగాయి. నూతన సాంకేతికత అందుబాటులోకి రావడం, కొత్త ఉద్యోగావకాశాలు కనిపించడం, ఒక తరగతి ప్రజల ఆదాయం పెరగడం వంటివి ఇందుకు దోహదపడ్డాయి. అయితే, ఈ బుడగ ఎక్కువ కాలం సాగలేదు. పెట్టుబడిదారీ వ్యవస్థకు అత్యంత సహజమైన సంక్షోభం అనతికాలంలోనే తలెత్తింది. 2008లో ఏర్పడిన మాంద్యం ప్రపంచవ్యాప్తంగా కల్లోలం సృష్టించింది. అయితే, మన దేశంలో బలంగా ఉన్న ప్రభుత్వ ఆధీనంలోని ఆర్థిక సంస్థలు దన్నుగా నిలవడంతో ఆ సంక్షోభం నుండి బయట పడ్డాం. అయితే, ఈ నిజాన్ని గుర్తించకపోగా బిజెపి ప్రభుత్వం మరింత దూకుడుగా కార్పొరేట్ల కోసమే బడ్జెట్ అన్నట్టుగా బరితెగించింది. సామాజిక సంక్షేమాన్ని పూర్తిగా విస్మరించింది. దేశ ఆర్థిక వ్యవస్థ కుప్పకూలకుండా వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వరంగ ఆర్థిక సంస్థలను కార్పొరేట్లకు అర్పించేందుకు సిద్ధపడింది.
నిజానికి ఈ కాలంలోనే నూతన ఉదారవాద విధానాల డొల్లతనం ప్రపంచవ్యాప్తంగా బట్టబయలైంది. ప్రపంచమంతా తీవ్ర ఆర్థిక సంక్షోభంలో చిక్కుకోవడానికి ఈ విధానాలే కారణమన్న విషయాన్ని అనేక దేశాల ప్రజలు గుర్తిస్తున్నారు. మరో రకంగా చెప్పాలంటే నయా ఉదారవాద విధానాలు దిక్కుతోచని దశకు చేరుకున్నాయి. అయినా, ఆ విధానాలనే మరింత లోతుగా ముందుకు తీసుకుపోతామని, రానున్న 25 సంవత్సరాలపాటు వాటినే అమలు చేస్తామని ప్రకటించడం హాస్యాస్పదం! అనేక దేశాలు సామాన్యులకు ఊరట కలిగించే చర్యలను చేపడుతున్న ప్రస్తుత సమయంలో కార్పొరేట్ల సేవలోనే తరించాలన్న మోడీ ప్రభుత్వ నిర్ణయం దేశాన్ని వెనుకబాట పట్టించడమే. ప్రజల సంపదను కొల్లగొట్టే ఈ తరహా విధానాలను ప్రతిఘటించడం ద్వారానే ప్రత్యామ్నాయ మార్గాలను ముందుకు తీసుకురాగలం.










