Oct 30,2023 21:26

రాసాని రచనలపై సమీక్ష

గ్రామీణ ప్రజల జీవన ప్రతిబింబం 'రాసాని'
ప్రజాశక్తి - క్యాంపస్‌
గ్రామీణ ప్రజల జీవన కథా చిత్రం రాసాని నవలల్లో కనిపిస్తుందని రిజిస్ట్రార్‌ ఆచార్య హుస్సేన్‌ అన్నారు. ప్రసిద్ధ కథా, నవల, నాటక రచయిత డా. విఆర్‌.రాసాని ఇటీవల ముద్రించిన ''వొలికలబీడు, మట్టిబతుకులు, ఆదియోధుడు'' అనే నవలల పరిచయ కార్యక్రమం సోమవారం ఎస్వీ యూనివర్సిటీ గ్రంథాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వర్సిటీ రిజిస్ట్రార్‌ ఆచార్య మహ్మద్‌ హుస్సేన్‌ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ అట్టడుగు జాతుల జీవితాలను గురించి నవలలు రాసిన అరుదైన రచయిత రాసాని అని కొనియాడారు. సభాధ్యక్షులు మేడిపల్లి రవికుమార్‌ మాట్లాడుతూ తెలుగు సాహిత్యంలో గురజాడ, శ్రీపాద, చలం. కొ.కు. రావిశాస్త్రి, మధురాంతకం రాజారాం లాంటివారిలా ఈకాలంలో తెలుగు సాహిత్యంలో రాసాని నిలిచిపోతారని, ఎవరూ స్పశించని ఇసుళ్లు పట్టేవారి గురించీ, నక్కల వాళ్లు, ఎలుగొడ్లవారు యానాదులు వంటివారి గురించి అరుదైన సాహిత్యాన్ని రాశారని, ఇప్పుడు కాటికాపర్ల గురించి రాశారన్నారు. ఆచార్య కొలకలూరి మధుజ్యోతి ''వొలికలబీడు'' నవల గురించి మాట్లాడుతూ స్మశానం పైన బతికే కాటికాపర్ల గురించి ఇంతవరకు ఎవరూ రాయిని విధంగా ,శవదహన ఆచారాలు అక్కడా కనిపించే కులాధిపత్యధోరణులు, తాత్విక చింతనలు, నిలువెల్లా మానవత్వం నిండిన కాటికాపర్ల గొప్పతనాలు, వారిపేదరికం, వారిలోనూ కాలానిక ను గుణంగా వచ్చిన చైతన్యాన్ని ఈ నవల నిండా ఆవిష్కరించడిందని చెప్పారు. డా. పిసి.వెంకటేశ్వర్లు ''ఆదియోధుడు'' నవలను సభకు పరిచయం చేశారు. అందరూ దేవుడిగా కొలిచే శ్రీకష్ణుడిని సుస్థిర,సువిశాల సామ్రాజ్యస్థాపకుడిగా,బహుముఖ ప్రజ్ఞావంతుడిగా ,మనుషులను మానసిక బానిసలుగా మార్చేసే మనువాదనిరోధకడిగా ఈ నవలలో ఎలా చిత్రంప బడ్డాడో వివరించారు. ఆచార్య ఆర్‌.రాజేశ్వరమ్మ ''మట్టి బతుకులు'' నవలలో మట్టిపనులుచేస్తూ, పందుల్ని మేపే వడ్డి బోయల కులంలోని బసివిని దురాచారానికి బలైపోయే ఆడవారి గురించీ, భూస్వాముల దౌర్జన్యాల వైనాన్ని గురించీ ఆలోచనాత్మకంగా చెప్పారన్నారు. ఈ కార్యక్రమంలో లైబ్రేరియన్‌ కే.సురేంద్రబాబు, జి.గోపాలయ్య, కష్ణస్వామిరాజు, ఆకుల మల్లేశ్వరరావు, కలువగుంట, వి.షణ్మగం, సాకం నాగరాజు, యువశ్రీ, జి.యస్‌ ప్రసాద్‌, కొత్వాలు అమరేంద్ర పాల్గొన్నారు.
రాసాని రచనలపై సమీక్ష