Feb 02,2022 09:57

ప్రజాశక్తి - హైదరాబాద్‌ బ్యూరో : కేంద్ర బడ్జెట్‌ గోల్‌మాల్‌ గోవిందం అని తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర రావు చెప్పారు. దేశంలోని ఎస్‌సి, ఎస్‌టి, బిసి, మైనారిటీ వర్గాలు, రైతులు, నేతన్నలు, రైతు కూలీలు,వృత్తిదారులు, కార్మికులు, ఉద్యోగులకు తీవ్ర నిరాశ కలిగించిందన్నారు. మహాభారతంలోని శాంతిపర్వం శ్లోకాలు చదివి బడ్జెట్‌ ప్రసంగం ప్రారంభించిన ఆర్ధిక మంత్రి ..ఆద్యాంతం అధర్మం ప్రవసించిందని విమర్శించారు. 'రైతుల ఆదాయం రెట్టింపు చేస్తానని చెప్పి పెట్టుబడి రెట్టింపు చేశారు. నల్లధనం సంగతేంటి..? 15లక్షల ఉద్యోగాలెక్కడ..? ఒక్క మాట మీదైనా నిలబడ్డారా..అంటూ ప్రధానిపై ప్రశ్నల వర్షం కురిపించారు. గోదావరి - కృష్ణా- కావేరీ నదుల అనుసంధానం మిలీనియం జోక్‌గా అభివర్ణించారు. ఏ ప్రాతిపదికన ఆ ప్రకటన చేశారని కేంద్రాన్ని ప్రశ్నించారు. గోదావరి జలాలపై తెలంగాణ, ఎపిలకే హక్కు ఉందన్నారు. దేశానికి నూతన రాజ్యాంగం అవసరం ఉందని, సవరణల వల్ల పెద్దగా ప్రయోజనం లేదని అన్నారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లైనా ప్రజల ఆకాంక్షలు నెరవేరలేదని చెప్పారు. ఈ విషయంలో ఎక్కడైనా తాను చర్చకు సిద్ధమని ప్రకటించారు. మతవిద్వేషాలతో దేశాన్ని విభజించాలని బిజెపి కుట్ర చేస్తోందని, దేశాన్ని రక్షించుకునేందుకు యువత నడుంబిగించాలని కెసిఆర్‌ పిలుపునిచ్చారు. మంగళవారం ప్రగతిభవన్‌లో నిర్వహించిన మీడియా సమావేశంలో కేంద్ర బడ్జెట్‌పై సిఎం కెసిఆర్‌ స్పందించారు.