ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : కేంద్రం ఇచ్చిన ప్రోత్సాహకంతో కలిపి ఆశా వర్కర్లకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నెలకు రూ.10 వేలు ఇస్తోందని కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. వైసిపి ఎంపి పిల్లి సుభాష్ చంద్రబోస్ అడిగిన ప్రశ్నకు ఈ మేరకు సమాధానమిచ్చారు.
కొత్త నైపర్ ఏర్పాటు ప్రతిపాదన లేదు
దేశంలో ప్రస్తుతం నూతనంగా నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రీసెర్చ్ (నైపర్) ఏర్పాటు ప్రతిపాదన ఏదీ లేదని కేంద్ర రసాయనాలు, ఎరువుల శాఖ మంత్రి మాన్సుఖ్ మాండవీయా తెలిపారు.
ఐసిఎంఆర్‌కు భారత్ బయోటెక్ రాయల్టీ రూ.171.74 కోట్లు
కోవాగ్జిన్ అమ్మకాల నిమిత్తం ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చి (ఐసిఎంఆర్)కు భారత్ బయోటెక్ రాయల్టీగా రూ.171.74 కోట్లు చెల్లించినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. కోవాగ్జిన్ పరిశోధన, అభివద్ధి నిమిత్తం ఐసిఎంఆర్ రూ.35 కోట్లు ఖర్చు చేసిందని కాంగ్రెస్ సభ్యుడు మల్లికార్జున ఖర్గే ప్రశ్నకు సమాధానమిచ్చారు. మిగిలిన సొమ్మును ఆరోగ్య పరిశోధన కార్యక్రమాలకు ఐసిఎంఆర్ వినియోగిస్తుందని తెలిపారు.
స్విమ్స్‌కు రూ.58.31 కోట్లు విడుదల
తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్(స్విమ్స్)కు ప్రధాన మంత్రి స్వాస్థ్య సురక్ష యోజన (పిఎంఎస్‌ఎస్‌వై) తొలి దశలో వైద్య పరికరాల సేకరణకు కేంద్ర వాటాగా రూ.58.31 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్య శాఖ సహాయ మంత్రి భారతి ప్రవీణ్ తెలిపారు. స్విమ్స్ ఆధునికీకరణకు కేంద్రం, స్విమ్స్ చెరో రూ.60 కోట్లు ఖర్చు చేయనున్నట్లు వైసిపి సభ్యుడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి ప్రశ్నకు సమాధానమిచ్చారు. విజయవాడ సిద్దార్ధ మెడికల్ కళాశాల, అనంతపురం ప్రభుత్వ వైద్య కళాశాలల ఆధునికీకరణకు రూ.150 కోట్లు ( కేంద్రం వాటా రూ.120 కోట్లు, రాష్ట్ర వాటా రూ.30 కోట్లు) వేర్వేరుగా పీఎంఎస్‌ఎస్‌వై2లో అనుమతించినట్లు తెలిపారు.
సాగరమాలలో ఆ ప్రాజెక్టులకు నిధులు కేటాయించ లేదు
ఆంధ్రప్రదేశ్‌లోని ఎన్‌హెచ్ 65, ఎన్‌హెచ్ 67, ఎన్‌హెచ్ 216 ఆధునికీకరణకు సాగరమాల పథకంలో ఎలాంటి నిధులు కేటాయించలేదని కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. అయితే ఆయా ప్రాజెక్టులు కేంద్ర జాతీయరహదారుల శాఖ మంత్రిత్వశాఖ అమలు చేస్తుంటుందని వైసిపి సభ్యుడు మోపిదేవి వెంకటరమణారావు అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.
జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు రూ.36.1 కోట్లు విడుదల
సాగరమాల పథకంలోని కోస్టల్ కమ్యునిటీ డెవలప్‌మెంట్ పిల్లర్స్‌లో భాగంగా నెల్లూరు జిల్లాలోని జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌కు రూ.36.1 కోట్లు విడుదల చేసినట్లు కేంద్ర నౌకాయాన శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ తెలిపారు. ఈ హార్బర్‌కు రూ.72 కోట్లు మంజూరు చేశామని వైసిపి ఎంపి మోపిదేవి వెంకట రమణ అడిగిన ప్రశ్నకు సమాధానమిచ్చారు.










