Dec 29,2021 22:31

- కమ్యూనిస్టులను విమర్శించడం హాస్యాస్పదం
- సిపిఎం కేంద్ర కమిటీ సభ్యులు ఎంఎ గఫూర్‌

ప్రజాశక్తిాజక్కా వెంకయ్య, టి నరసింహయ్య, సున్నం రాజయ్య నగర్‌(తాడేపల్లి) :ఎపి గురించి మాట్లాడే నైతిక హక్కు బిజెపికి లేదని సిపిఎం రాష్ట్రకార్యదర్శివర్గ సభ్యులు ఎంఎ గఫూర్‌ అన్నారు. మహాసభ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో కమ్యూనిస్టులపై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలను తీవ్రంగా ఖండించారు. ఎపికి అడుగడుగునా అన్యాయం చేస్తున్న బిజెపికి ఎపిలో నోరెత్తే నైతిక హక్కు లేదని, కమ్యూనిస్టు పార్టీపై బిజెపి దుమ్మెత్తిపోస్తోందని అన్నారు. బిజెపిది మధ్యయుగం నాటి సిద్ధాంతమన్నారు. అంబానీ, అదానీలను పెంచి పోషించడం, ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం బిజెపి అనుసరిస్తున్న ఆర్థిక సిద్దాంతమని పేర్కొన్నారు. మానిటైజేషన్‌ పేరుతో దేశ ఆస్తులను అమ్మే హక్కు బిజెపికి ఎవరిచ్చారని ప్రశ్నించారు. ప్రజల కోసం, రాష్ట్ర ప్రయోజనాల కోసం పోరాడుతున్న కమ్యూనిస్టులను బిజెపి విమర్శించడం హాస్యాస్పదమని అన్నారు. దేశంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాల్సిన బిజెపి, ఆర్థికంగా దివాళా తీయిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చరిత్రలో ఏనాడూ లేని విధంగా దేశంలో నిరుద్యోగం నెలకొందని దీనిపై బిజెపి సమాధానం చెప్పాలని కోరారు. పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌, నిత్యావసరాలు తదితరాలపై అడ్డగోలుగా రేట్లు ఎందుకు పెంచారో రాష్ట్ర ప్రజలకు బిజెపి సమాధానం చెప్పాలని డిమాండ్‌ చేశారు. ఎపికి విభజన హామీలు అమలు చేయకుండా కేంద్రం అన్యాయం చేస్తే, సోము వీర్రాజు, ఎపి బిజెపి నేతలు ఏం చేశారు, ఏం చేస్తున్నారో కూడా రాష్ట్ర ప్రజలకు చెప్పాలని కోరారు. పార్లమెంటులో సుష్మాస్వరాజ్‌, వెంకయ్యనాయుడు చేసిన వాగ్దానాలు ఏమయ్యాయని నిలదీశారు. విశాఖ ఉక్కు కర్మాగారం స్థాపనకు గంపడు మట్టి, రాళ్లు వేయని బిజెపికి దాన్ని అమ్మేసే హక్కు ఎవరిచ్చారని మండిపడ్డారు. ఎపి పట్ల బిజెపి రాక్షసంగా వ్యవహరిస్తోందని విమర్శించారు. బిజెపి సిపిఎంను పొగిడితే బాధపడాలి గాని, విమర్శించినంత మాత్రాన సిపిఎం లక్ష్యం, నిర్ణయాల్లో ఎటువంటి తేడాలు ఉండవని అన్నారు.
పారదర్శకంగా అకౌంట్లు
కమ్యూనిస్టులు సంఘాల పేరుతో ప్రజల సొమ్మును కొల్లగొడుతున్నారు, దోచుకుతింటున్నారని సోము వీర్రాజు చేసిన వ్యాఖ్యలను గఫూర్‌ తిప్పికొట్టారు. ప్రజాసంఘాలన్నిటి అకౌంట్లు క్లియర్‌గా ఉన్నాయని, ప్రతి సంవత్సరం ఆడిటింగ్‌ చేసి ప్రభుత్వానికి లెక్కలు చెబుతున్నామని తెలిపారు. ఏ యూనియన్‌ ఆడిటింగ్‌ లేకుండా లేవని, కార్మిక సంఘాలు ఒక్క రూపాయి కూడా వృథాగా ఖర్చు చేయడంలేదని తెలిపారు. వేరే పార్టీల మాదిరి సీక్రెట్‌ అకౌంట్లు ఉండవని స్పష్టం చేశారు. కేంద్రంలోని బిజెపి ఎపికి అన్యాయం చేస్తున్న బిజెపిని నిలదీస్తున్న తమపై బిజెపి అవాకులు చవాకులు పేలడం, అరవడం, మొరగడం అనైతికమని, దిగజారుడుతనమని అన్నారు. కమ్యూనిస్టులపై విష ప్రచారం చేయడం సిగ్గుచేటని ఆగ్రహం వ్యక్తం చేశారు. బిజెపి దుష్టచర్యలపై కమ్యూనిస్టులుగా వారి వెంటపడతాం, నిలదీస్తామని సిహెచ్‌ బాబూరావు అన్నారు. దేశానికి పట్టిన చీడ, పీడ బిజెపి అని దీన్ని తరిమికొట్టేందుకు ఎపిలోని వైసిపి, టిడిపి, జనసేన తమ విధానాలు మార్చుకుని కలిసిరావాలని కోరారు. ఎపి పట్ల బిజెపి దుష్ట పన్నాగాలను ఇకనైనా తెలుసుకోవాలని సూచించారు.