Feb 04,2022 06:57

    న్నికల బాండ్ల విధానాన్ని వెంటనే రద్దు చేయాల్సిన ఆవశ్యకత ఇప్పుడు స్పష్టంగా ద్యోతకమవుతోంది. ఈ జనవరి 1 నుండి 10వ తేదీ మధ్య రూ.1213 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లు అమ్ముడు పోయాయన్నది విస్తుగొలిపే వాస్తవం. గతంలో జరిగిన ఐదు రాష్ట్రాల ఎన్నికలకు ముందు రూ.695 కోట్ల విలువైన బాండ్లు అమ్ముడుపోగా ఈ తడవ అందుకు దాదాపు రెట్టింపు విలువగల బాండ్లు అమ్ముడుపోయాయి. అంటే ఉత్తరప్రదేశ్‌ వంటి కీలక రాష్ట్రాల ఎన్నికల్లో డబ్బు పాత్ర ఎంతగా పెరిగిందో విదితమవుతోంది. అంతకన్నా ముఖ్యంగా రాజకీయ పార్టీలకు కార్పొరేట్లు సమకూర్చే సొమ్ము నానాటికీ పెరుగుతుండడం తీవ్ర ఆందోళనకరం, ప్రజాస్వామ్యానికి ప్రమాదకరం. అసోసియేషన్‌ ఫర్‌ డెమోక్రటిక్‌ రిఫార్మ్స్‌ (ఎడిఆర్‌) విశ్లేషణ ప్రకారం 2017-18, 2018-19 రెండేళ్లలో రూ. 6,190 కోట్ల విలువైన ఎన్నికల బాండ్లలో రూ.4,210 కోట్లు బిజెపికే దక్కాయి. అంటే పార్టీలకు కార్పొరేట్లు సమకూర్చిన సొమ్ములో 69 శాతం ఆ పార్టీకే దక్కింది. ఇది కాక లెక్కకు రాని నల్ల ధనం కూడా మరెంతో ఆ పార్టీ నేతలకు చేరివుంటుంది. దేశంలో సంపన్నవంతమైన పార్టీ అయిన బిజెపికే ఈ విడత బాండ్లలోనూ సింహభాగం బదిలీ జరిగిందన్నది నిర్వివాదాంశం.
    ఈ ఐదు రాష్ట్ర అసెంబ్లీల ఎన్నికల్లో ధన ప్రవాహాన్ని అడ్డుకోవాలంటూ కేంద్ర ఎన్నికల కమిషన్‌ (ఇ.సి) హుంకరించింది. ప్రత్యేక పరిశీలకుల్ని నియమించడంతోపాటు 'సీ విజిల్‌' మొబైల్‌ యాప్‌ గురించి గొప్పగా చెప్పింది. ఆ యాప్‌ ద్వారా 20 రోజుల్లో 23వేల ఫిర్యాదులు వెల్లువెత్తాయి కాని చర్యలు నామమాత్రమే. ఐదేళ్ల క్రితం జరిగిన ఉత్తరప్రదేశ్‌ ఎన్నికల్లో నమోదైన కేసుల్లో ఇప్పటికీ 80 శాతం అపరిష్కృతంగానే ఉన్నాయంటే అటు ఇ.సి, ఇటు అధికార యంత్రాంగం ఎంత నిర్లిప్తంగా ఉన్నాయో స్పష్టమవుతోంది. మంత్రి అనిల్‌ శర్మ కుమారుడు నడిరోడ్డుపై సొమ్ము పంచుతున్న ఫొటోలు ఈ వారంలోనే సోషల్‌ మీడియాలో వైరల్‌ అయినాగాని ఎలాంటి చర్యలూ తీసుకున్న దాఖలాల్లేవు. అంటే ఇసివి ఉత్తుత్తి హుంకరింపులేనా ?
    రాజకీయాల్లో డబ్బు, నేరస్తుల పాత్ర పెరుగుతుండడం ప్రజాస్వామ్యానికి చేటు తెస్తుంది. నయా ఉదారవాద ఆర్థిక విధానాలు అమలవుతున్న గత మూడు దశాబ్దాల్లో కార్పొరేట్లు, రాజకీయ నాయకులు, బ్యూరోక్రాట్ల దుష్ట కూటమి పాత్ర పెరగడంవల్ల పరిస్థితి మరింతగా దిగజారుతోంది. ఎన్నికల్లో పోటీ చేస్తున్నవారిలో నేర చరితులు, కార్పొరేట్‌ యజమానుల సంఖ్య అనేక రెట్లు పెరగడం దారుణం. అయితే నయా ఉదారవాద ఆర్థిక విధానాలను నడిపిస్తున్న అంతర్జాతీయ ద్రవ్య పెట్టుబడి ఆయా దేశాల ఆర్థిక వ్యవస్థలను మాత్రమేగాక అక్కడ ఈ విధానాల్ని తీవ్రంగా వేగంగా అమలు చేసే రాజకీయ పార్టీలను సైతం ప్రభావితం చేసే శక్తిగా రూపొందుతున్న వైనం మరింత హానికరం. కనుక ఇటువంటి పరిణామాలపట్ల ప్రజాస్వామ్య ప్రియులు, ప్రగతిశీల శక్తులు, దేశ భక్తులూ అప్రమత్తంగా ఉండడం అవసరం. ప్రజాస్వామ్యం పటిష్టంగా ఉండాలంటే అందుకు కీలకమైన ఎన్నికలు నిష్పక్షపాతంగా నిర్వహించడం, అన్ని రాజకీయ పార్టీలకూ సమానావకాశాలు (లెవెల్‌ ప్లేయింగ్‌ ఫీల్డ్‌) కల్పించడం జరగాలి. అందుకవసరమైన రీతిలో ఎన్నికల సంస్కరణలు రావాలి. దామాషా ఎన్నికల విధానం, రాజకీయ పార్టీల ఎన్నికల వ్యయాన్ని ప్రభుత్వమే భరించడం, ఎన్నికల నిర్వహణలో పారదర్శకత, ప్రజా ప్రతినిధులను రీకాల్‌ చేసేందుకు ఓటర్లకు హక్కు తదితర చర్యలు అవసరం. ఆ దిశగా సమూల మార్పులు జరిగేందుకు విశాల ప్రజా ఉద్యమాలు సాగించాలి. అధ్యక్ష తరహా పాలన, జమిలి ఎన్నికలు వంటి తప్పుడు నినాదాలతో సంఘపరివారం ప్రజలను తప్పుదోవ పట్టిస్తోంది. వాటిని తిప్పికొట్టి ప్రజాస్వామ్య పరిరక్షణ దిశగా ఎన్నికల సంస్కరణల కోసం ఉద్యమించడం ప్రజాస్వామ్య ప్రియుల కర్తవ్యం. నోట్లతో ఓటర్లను కొనేయవచ్చుననే కార్పొరేట్‌- హిందుత్వ శక్తులకు బెంగాల్‌, కేరళ, తమిళనాడు రాష్ట్రాల ప్రజలు దిమ్మతిరిగే గుణపాఠం నేర్పారు. అయినా బుద్ధి రాని ఆ పార్టీకి యు.పి రైతులు కూడా గట్టిగా బుద్ధి చెప్పడానికి సిద్ధం కావడం దేశ ప్రజాస్వామ్య మూలాల బలానికి సంకేతం.