Jan 22,2022 06:57

మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4 - మార్చి 7వ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి. ఆ మేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈలోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్థిక నష్టం ఏమీ ఉండదు.

    'మాది మిగతా పార్టీలకు భిన్నం' అని బిజెపి చెప్పింది నిజమేననుకున్నారు చాలా మంది. క్రమంగా మా మీద అలాంటి భ్రమలేవీ పెట్టుకోవద్దని బిజెపి తన చర్యల ద్వారా పదే పదే జనాలకు చెబుతోంది. అందుకు తాజా ఉదాహరణే చమురు ధరల స్తంభన.
    నవంబరు నాలుగవ తేదీ నుంచి జనవరి 20వ తేదీ వరకు దేశంలో చమురు ధరలు స్ధిరంగా కొనసాగుతున్నాయి. తరువాత కూడా మార్చి ఏడవ తేదీ ఐదు రాష్ట్రాల్లో ఎన్నికల పోలింగ్‌ చివరి దశ ముగిసే వరకు ఇదే స్ధితి కొనసాగుతుంది. ఇలా చెబుతున్నామంటే జోశ్యం కాదు. ఆచరణ ప్రాతిపదిక ఉంది. ఒక్కసారి గతాన్ని గుర్తు చేసుకోండి. 2021 ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు రూ.91.17, మరుసటి రోజు రూ.90.99, 25 నుంచి 29 వరకు పెట్రోలు రేటు రూ.90.78, మరుసటి రోజు నుంచి ఏప్రిల్‌ 14 వరకు రూ.90.56, ఆ మరుసటి రోజు నుంచి మే మూడవ తేదీ వరకు రూ.90.40. ఇదంతా ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్ఛే దిన్‌లో జరిగింది. ఈ కాలంలో అంతర్జాతీయంగా ముడి చమురు ధరలు ఎలా ఉన్నాయి ?
    ఫిబ్రవరి 28 రోజుల్లో చమురు ధరలను 17 సార్లు సవరించారు. ఆ నెలలో ముడి చమురు మనం కొనుగోలు చేస్తున్నది పీపా ధర నెల సగటున 61.22 డాలర్లుంది. మార్చి నెలలో 64.73 డాలర్లకు పెరిగినా ధర ఫిబ్రవరి 27 నుంచి మార్చి 23 వరకు ఒకే ధర (రూ.91.17). ఆ తరువాత ఇంకా తగ్గింది. ఏప్రిల్‌ నెలలో ముడి చమురు సగటు ధర 63.40 డాలర్లు. మార్చి నెల కంటే ఏప్రిల్‌లో తగ్గింది 1.33 డాలర్లు, దాన్ని వినియోగదారులకు బదలాయించారు గనుక లీటరుకు 38 పైసలు తగ్గించారనుకుందాం? మరి ఫిబ్రవరి-మార్చి నెలల మధ్య పీపా ధరలో 3.51 డాలర్ల పెరుగుదల ఉంటే ధరలను స్ధిరంగా ఉంచటం ఎలా సాధ్యమైనట్లు? ఇవి ఐదు రాష్ట్రాల ఎన్నికల అచ్ఛే దినాలు అన్నది స్పష్టం.
    ఇప్పుడు జరగనున్న మరో ఐదు రాష్ట్రాల అచ్ఛే దిన్‌ సంగతి చూద్దాం. ఉప ఎన్నికల్లో తగిలిన ఎదురు దెబ్బలతో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు మీద ఐదు, డీజిలు మీద పది చొప్పున పన్నులు తగ్గించినట్లు ప్రకటించింది. బిజెపి పాలిత రాష్ట్రాలు నరేంద్ర మోడీని ఆదర్శంగా తీసుకొని వ్యాట్‌ను తగ్గించాయి. జరుగుతున్నదేమిటి? అక్టోబరు ఒకటి నుంచి నవంబరు 3వరకు 34 రోజుల్లో 28 సార్లు సవరించారు. కేంద్ర ప్రభుత్వ పెట్రోలియం ప్లానింగ్‌ అండ్‌ ఎనాలసిస్‌ (పిపిఎసి) సమాచారం ప్రకారం సెప్టెంబరు 29 నుంచి అక్టోబరు 27 వరకు సగటున పీపా ముడి చమురు దిగుమతి ధర 81.54 డాలర్లు, అక్టోబరు 28 నుంచి నవంబరు 26 వరకు 81.51 కాగా నవంబరు 27 నుంచి డిసెంబరు 29 వరకు 72.93 డాలర్లకు తగ్గింది. దీపావళి ధమాకా పేరుతో కేంద్రం, రాష్ట్రాలు తగ్గించిన పన్నుల మేరకు తప్ప చమురు కంపెనీలు నవంబరు నాలుగవ తేదీ నుంచి ఇది రాసిన జనవరి 20 వరకు 75 రోజులుగా తమ ధరలను ఎందుకు సవరించలేదు? వాటికి పన్నులతో సంబంధం లేదు కదా? ముడి చమురు ధరలు పెరిగితే పెంచుతాం తగ్గితే దించుతాం అని చెప్పిన విధానం ఏమైంది? పాలకులు కంపెనీలను ఎందుకు ప్రశ్నించటం లేదు? సమాధానం చెప్పే జవాబుదారీ తనం ఉందా? అసలు కథేమిటి ?
    అక్టోబరు 25న గరిష్టంగా మన ముడి చమురు కొనుగోలు ధర పీపా 84.77 డాలర్లను తాకింది. తరువాత క్రమంగా పడిపోతూ డిసెంబరు నాలుగున 69.52 డాలర్లకు తగ్గింది. పదిహేను డాలర్లు తగ్గినా చమురు ధరలు పైసా తగ్గించలేదు. డిసెంబరు సగటు ధర ముందే చెప్పుకున్నట్లు 72.93 డాలర్లు. చంబల్‌ బందిపోట్లు ధనికులను మాత్రమే దోచుకొనే వారు. ప్రభుత్వం ఎవరినీ వదలటం లేదు, అంతకంటే పెద్ద దోపిడీ సాగుతోందా లేదా? ప్రభుత్వరంగ సంస్థలదే మార్కెట్‌లో ప్రధాన వాటా అయినా నరేంద్ర మోడీ అధికారానికి వచ్చిన తరువాత రిలయన్స్‌ బంకులు కొన్ని తిరిగి తెరుచుకున్నాయి. ప్రభుత్వ ధరలనే అవీ వసూలు చేస్తున్నాయి. ముడి చమురు ధర తగ్గిన మేరకు అదేమీ తగ్గించలేదు. ప్రభుత్వ విధానం దానికి లాభాల పంట పండిస్తున్నపుడు వాటిలో కొంత మొత్తాన్ని ఎన్నికల బాండ్లు, ఇతర రూపాల్లో బిజెపి కి అప్పగిస్తుంది గానీ జనాలకు ఎందుకు తగ్గిస్తుంది. రిలయన్స్‌ ప్రైవేటు కంపెనీ కనుక అలా చేస్తుంది అనుకుందాం. మరి ప్రభుత్వ కంపెనీలు ?
    ఐదు రాష్ట్రాల ఎన్నికల తరుణంలో నెలల తరబడి ధరలను సవరించకుండా తనకు సానుకూలతను సృష్టించేందుకు గాను బిజెపి ప్రయత్నిస్తోంది. దీనివలన ఇతర సరకుల ధరలు కూడా తాత్కాలికంగా కొంత మేరకు అదుపులో ఉంటాయి. కేంద్ర ప్రభుత్వం ఐదు, పది రూపాయల మేరకు భారం తగ్గించిన తరువాత ముడి చమురు ధరలు తగ్గాయి. ఆ మేరకు జనానికి తగ్గించలేదు. డిసెంబరు ఐదు నుంచి ముడి చమురు ధరలు మనం దిగుమతి చేసుకొనేది జనవరి 18 వరకు 69.52 డాలర్ల నుంచి 87.36కు పెరిగింది. నరేంద్ర మోడీ ఏలుబడిలో ఇది సరికొత్త రికార్డు. జనవరి 21వ తేదీన బ్రెంట్‌ రకం ముడి చమురు ధర 87.81 డాలర్లకు చేరింది, త్వరలో వంద డాలర్లకు చేరవచ్చని అంచనా.
    అక్టోబరు 25న మన దిగుమతి రకం 84.77 డాలర్లు ఒక రికార్డు. ఇప్పుడు ఆ రికార్డును బద్దలు కొట్టింది. ఐనా ధరలు పెంచలేదు. మార్చి ఏడవ తేదీన ఎన్నికల చివరి దశ ముగుస్తుంది. అంటే ఆ రోజు వరకు అంతర్జాతీయ మార్కెట్లో ధరలు ఎలా ఉన్నా అప్పటి వరకు ఇప్పుడున్న ధరలే కొనసాగుతాయి. ఆ తరువాతే అసలు కథ మొదలౌతుంది. నవంబరు 4-మార్చి ఏడవ తేదీ మధ్య జరిగిన లావాదేవీల లెక్కలు చూసుకున్నపుడు వచ్చిన లాభం హరించుకుపోయి నష్టం ఉందనుకోండి. ఆమేరకు ధరలు పెంచి లోటు మొత్తాన్ని కంపెనీలు పూడ్చుకుంటాయి. ఈలోగా బిజెపి తన ప్రచారం తాను చేసుకుంటుంది. కంపెనీలకు వచ్చే ఆర్థిక నష్టం ఏమీ ఉండదు. అధికార పార్టీలపై వ్యతిరేకత పెరగటానికి ధరల పెరుగుదల ఒక కారణం మాత్రమే. అది ఒక్క చమురు ధరల మీదనే ఆధారపడి ఉండదు. అందువలన వాటిని నియంత్రించి జనాలను మాయ చేయ చూసినా....వ్రతం చెడ్డా ఫలం దక్కనట్లు బిజెపికి ఎదురు దెబ్బలు తగలవచ్చు.
 

/ వ్యాసకర్త సెల్‌: 8331013288 /
ఎం. కోటేశ్వరరావు

ఎం. కోటేశ్వరరావు