శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం వృద్ధి చెందని రోజుల్లో ప్రజలు మూఢ విశ్వాసాలు కలిగి ఉన్నారంటే అర్ధం చేసుకోవచ్చు. అనేకమంది శాస్త్రవేత్తల కృషి ఫలితంగా పలు ఆవిష్కరణలు జరిగాయి. మనం ఎదుర్కొంటున్న అనేక సమస్యలకు సైన్సు పరిష్కారం చూపుతుంది. సైన్స్ వాస్తవంపై ఆధారపడి పనిచేస్తుంది. మతం నమ్మకం ఆధారంగా నడుస్తోంది.
అయితే తాజాగా ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి ఎన్.టి.ఆర్ భార్య లక్ష్మీ పార్వతి... ఆయన ఆత్మతో మాట్లాడినట్లు వెల్లడించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఐఐటీ లో పని చేసే మరొక విద్యావేత్త తాను మంత్రాలు చదివి దెయ్యాలను వదిలించానని తెలిపారు. ఒక రాజకీయ నాయకుడు తాను శ్రీకృష్ణుడితో మాట్లాడని చెప్పారు. నిరక్షరాస్యుల కంటే విద్యావంతులే ఎక్కువగా మూఢ నమ్మకాలని ఆశ్రయిస్తున్నారని ఈ ఉదాహరణలను బట్టి అర్ధం అవుతుంది.
గత ఏడాది మదనపల్లెలో విద్యావంతులైన తల్లిదండ్రులు మూఢనమ్మకాలకు తమ సంతానాన్ని బలి తీసుకున్నారు. కరోనా నేపథ్యంలో అనేక కొత్త మూఢ నమ్మకాలు వెలుగులోకి వచ్చాయి. బ్రదర్ అనిల్ కుమార్ ఏకంగా తాను కరోనాని తొక్కేశానని ప్రకటించారు.
ఇప్పటికే మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టాలు తీసుకొచ్చాయి. ఆంద్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఇందుకు సంబంధించి ఒక ముసాయిదాని తయారుచేసింది. అయితే అది చట్ట రూపం దాల్చలేదు.
మతం పేరుతో నైతిక విలువలు బోధించడం వేరు. ప్రజలకుండే కొన్ని నమ్మకాలను సొమ్ము చేసుకోవడం వేరు. దైవంపై నమ్మకం ఒక వ్యక్తిగత అంశం. ఏ ఇద్దరి నమ్మకాలు ఒకే విధంగా ఉండవు. పేదరికం, ఒంటరితనం, సైన్స్ ఫలాలు అందరికీ సమానంగా అందకపోవడం తదితర కారణాల వల్ల ప్రజలు మూఢనమ్మకాలను ఆశ్రయిస్తున్నారు. మూఢ నమ్మకాల వల్ల అమాయకులు. బలి అవుతున్నారు. ప్రజలలో క్రమంగా ప్రశ్నించే గుణం తగ్గిపోతుంది. ప్రజల వ్యక్తిగత నమ్మకాలను పాలకులు తమ ఓటు బ్యాంకుగా మార్చుకుంటున్నారు. అనేక సైన్స్ ఆవిష్కరణలకు సరైన ప్రచారం లభించడం లేదు.
సైన్సువాదులు అనేక ఏళ్లుగా మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా పోరాడుతున్నారు. అయితే వీరిపై ఇటీవల కాలంలో దాడులు పెరిగాయి. దైవాన్ని నమ్మకపోవడం కూడా మత స్వేచ్ఛలో భాగమేనని దైవాన్ని నమ్మేవారు గుర్తించాలి. దైవాన్ని నమ్మేవారిని ఏ నాస్తికుడు దూషించడు. ఏ ఒక్క సైన్స్ ప్రేమికుడు వారిపై దాడి చేయడు. సైన్స్‌వాదులు దేనిని గుడ్డిగా నమ్మరు.ఒక సంఘటన జరిగితే దానికి గల కారణాన్ని విశ్లేషిస్తారు. ప్రజలకు వివరిస్తారు. వివిధ రకాల విశ్వాసాలున్న కొందరు తమ నమ్మకాలే గొప్పవని ఘర్షణ పడతారు. ఇటువంటి వారే హేతువాదులపై దాడులు చేస్తారు. యువత కూడా కొత్త రకం మూఢ నమ్మకాలను ఆశ్రయిస్తున్నారు.
మూఢ నమ్మకాలకు వ్యతిరేకంగా చట్టం తెచ్చే విధంగా సైన్స్ వాదులు కృషి చేయాలి. ఆదే సమయంలో వివిధ రకాల మూఢనమ్మకాల గురించి ప్రజలకు అవగాహన కల్గించాలి. హేళన, పరిహాసం ద్వారా గాకుండా ఓపికగా సైన్స్ వాదులు ప్రజలకు వివిధ మాధ్యమాల ద్వారా వివరించాలి. కేవలం మూఢ నమ్మకాలపైనే కాకుండా నిత్యం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై కూడా సైన్స్ వాదులు దృష్టి సారించి, వాటిని అధిగమించడానికి తగు సూచనలు ఇవ్వాలి. అప్పుడే ప్రజలలో రోజురోజుకు పెరుగుతున్న మూఢ నమ్మకాలు తగ్గుతాయి.
- యం.రాం ప్రదీప్
సెల్ : 9492712836










