గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పట్ల రాష్ట్ర ప్రభుత్వం వివక్షత ప్రదర్శించడం చాలా అన్యాయం. రాష్ట్ర ప్రభుత్వం పదే పదే చెబుతున్న వికేంద్రీకరణకు సచివాలయాలు తొలి అడుగు వంటివి. క్షేత్ర స్థాయిలో ప్రజానీకానికి అత్యంత సన్నిహితంగా వ్యవహరించే సచివాలయ కార్యదర్శులు, ఇతర సిబ్బందిని సక్రమంగా వినియోగించుకుంటే పాలనాపరంగా ఎన్నో అద్భుతాలు చేయడానికి అవకాశం ఉంది. కరోనా కష్టకాలంలో రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాదిమంది ప్రజానీకానికి సంక్షేమ ఫలాలు సక్రమంగా అందాయంటే దానికి కారణం గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థే అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ ఇతర పథకాల అమలు విషయంలోనూ సచివాలయాలు అంతే క్రియాశీలంగా పనిచేస్తున్నాయి. దాదాపుగా రెండేళ్ల క్రితం ఆవిర్భవించిన ఈ వ్యవస్థ ఇప్పటికే జనజీవితంలో భాగమైపోయింది. ఇంత కీలకమైన ఈ వ్యవస్థలో సమస్యలు తలెత్తితే వాటిని ఎప్పటికప్పుడు పరిష్కరించాల్సిన బాధ్యత రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది. కానీ దానికి భిన్నంగా వ్యవహరించడంతో తమను ఆరవ వేలుగా చూస్తోందన్న అభిప్రాయం సచివాలయ ఉద్యోగుల్లో వ్యక్తమవుతోంది. తమ సమస్యల పట్ల ప్రభుత్వం ఉదాశీనంగా వ్యవహరిస్తోందన్న భావన వారిలో బలపడుతోంది.
సాక్షాత్తు రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్‌రెడ్డి ఇచ్చిన హామీ మేరకు అక్టోబర్ 2021 నాటికి రెండు సంవత్సరాల సర్వీసు పూర్తి చేసుకున్న వారి ప్రొబేషన్ డిక్లేర్ చేసి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడంతో పాటు పేస్కేళ్లు అమలు చేయాల్సి ఉంది. సచివాలయ ఉద్యోగుల్లో ఉన్నత చదువులు చదివిన వారున్నారు. సొంత ఊరిలో ప్రభుత్వ ఉద్యోగమని చెప్పడంతో సాఫ్ట్‌వేర్ పోస్టులను కూడా వదిలివేసి చేరిన వారున్నారు. వీరందరికి ప్రభుత్వ ఉద్యోగంపై గంపెడాశలు. కానీ, నిర్దేశించిన తేదీ గడిచిపోయినా ప్రభుత్వం ఈ దిశలో చర్యలు తీసుకోకపోవడంతో పాటు వినతి పత్రాలు ఇచ్చి వేడుకున్నా స్పందించలేదు. తాజాగా పిఆర్‌సి ప్రకటించిన సందర్భంలోనూ విస్మరించడంతో గ్రామ, వార్డు సచివాలయ సిబ్బంది ఆందోళన బాట పట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు 1.30 లక్షల మందికి పైగా ఉన్నారు. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న వీరికి పిఆర్‌సిపై జరిగిన చర్చల్లో భాగస్వామ్యం ఎందుకు ఇవ్వలేదు? వీరికన్నా తక్కువ సంఖ్యలో ఉద్యోగులు ఉన్న ఎన్నో సంఘాలకు పిఆర్‌సి చర్చల్లో ప్రాధాన్యత ఇచ్చి వీరిని మాత్రం ఎందుకు విస్మరించాలి? వీరి ప్రమేయం లేకుండా నిర్ణయాలు తీసుకుని వాటికి కట్టుబడి ఉండాలని చెప్పడం ఎంతవరకు సబబు? ఇప్పటి వరకు ఉన్న నాలుగు గ్రేడ్‌లలో కాకుండా సచివాలయ ఉద్యోగుల కోసం కొత్తగా ఐదవ గ్రేడ్‌ను సృష్టించి, మాస్టర్ స్కేల్‌లో కనీస వేతన స్థాయికన్నా చాలా దిగువ స్థాయికి వీరి వేతనాలను కుదించడాన్ని ఏమనాలి? ఇప్పుడిస్తున్న 15 వేల రూపాయల నామమాత్రపు వేతనం చాలడం లేదు మొర్రో అని ఒకవైపు మొత్తుకుంటూ ఉంటే, కొంచెం అటు ఇటూగా ఆ మొత్తాన్నే నిర్ధారించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి? దీనిపై ఉద్యోగులతో చర్చించారా? ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉన్న నాలుగు గ్రేడ్లలో ఏదో ఒక గ్రేడ్‌లో గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను నియమించడానికి బదులు, ఇలా అయిదో గ్రేడ్ సృష్టించడం వారి విధుల స్థాయిని, ప్రాధాన్యతను చిన్నచూపు చూడటమే. పైగా మరొక స్థాయిని రంగంలోకి తీసుకురావడం ఉద్యోగులలో చీలికలకు దారి తీస్తుంది. కనీస వేతన స్థాయిని పెంచే బదులు కుదించడం మొత్తంగానే ఉద్యోగుల ప్రయోజనాలను దెబ్బతీస్తుంది.
వాట్సప్ గ్రూపుల్లోంచి బయటకు వచ్చేసినా, నిరసనలకు దిగినా దానివెనుక ఉన్న ఆందోళనను అర్ధం చేసుకోవడం మాని విధులకు హాజరు కాలేదని పేర్కొంటూ ఆందోళన చేసిన వారి ఒక్కరోజు జీతాన్ని కోత పెట్టాలని ప్రభుత్వం ఆదేశించినట్లు సమాచారం వస్తోంది. ఇది ఎంత మాత్రం సబబు కాదు. మరోవైపు ఉన్నతస్థాయి అధికారులూ సచివాలయ ఉద్యోగులపై బెదిరింపులకు దిగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఏ మాత్రం చిత్తశుద్ధి ఉన్నా ఈ తరహా చర్యలను వెనువెంటనే నిలిపివేయాలి. ప్రజాస్వామ్య ప్రక్రియలో భాగంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులతో తక్షణం సంప్రదింపులు జరిపి వారి సమస్యలను పరిష్కరించాలి.










