Dec 29,2021 22:10

ప్రజాశక్తి ప్రత్యేక ప్రతినిధి- జక్కా వెంకయ్య, టి నర్సింహయ్య, సున్నం రాజయ్య నగర్‌ (తాడేపల్లి) :రాష్ట్రంలో వామపక్ష ప్రజాతంత్ర సంఘటన (ఎల్‌డిఎఫ్‌) నిర్మాణం కోసం సమరశీల పోరాటాలు నిర్వహించాలని సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ప్రకాశ్‌ కరత్‌ మార్గనిర్దేశం చేశారు. సరళీకరణ, మతతత్వ రాజకీయాలకు అదే ప్రత్యామ్నాయమన్నారు. ఇక్కడ జరుగుతున్న సిపిఎం రాష్ట్ర 26వ మహాసభల చివరి రోజు బుధవారం కరత్‌ ప్రసంగించారు. ఆర్‌ఎస్‌ఎస్‌తో కలిసి బిజెపి సాగిస్తున్న మతతత్వ రాజకీయాలు దేశాన్ని పెను ప్రమాదంలోకి నెట్టాయని, ఈ రాష్ట్రానికీ ఆ ముప్పు పొంచి ఉందని చెప్పారు. బిజెపిపై పోరాడే విషయంలో ఏమరపాటు కూడదని హెచ్చరించారు. కేంద్రంలో బిజెపి రెండవసారి పూర్తి స్థాయి మెజార్టీతో అధికారంలోకొచ్చాక ఆల్‌రౌండ్‌ దాడులను ఎక్కుపెట్టిందని, రాజ్యాంగ విధ్వంసం, అన్ని వ్యవస్థల్లోకి ఆర్‌ఎస్‌ఎస్‌ జరబడుతున్న వైనాన్ని నిశితంగా పరిశీలిస్తే ప్రమాదం అర్థమవుతుందన్నారు. 'త్రిపురలో 2017కు ముందు బిజెపికి 2 శాతం లోపే ఓట్లున్నాయి. గిరిజనుల్లో కేంద్రీకరించి పని చేసి అధికారంలోకొచ్చింది. మహారాష్ట్రకు చెందిన సునీల్‌ దేవధర్‌ను త్రిపురకు పంపింది. ఆయన అక్కడ తిష్ట వేసి చేయాల్సిన అన్ని పనులూ చేసి పార్టీని గెలిపించారు. అదే వ్యక్తికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌ బాధ్యతలు అప్పగించార'న్నారు. బెంగాల్‌లో బలహీనంగా ఉన్న బిజెపి అనతికాలంలోనే అధికారం కోసం పోటీపడే స్థాయికి ఎదిగిందన్న విషయాన్ని గుర్తించాలన్నారు. ప్రజా వ్యతిరేక, నయా-ఉదారవాద విధానాలకు వ్యతిరేకంగా పోరాటాలు నిర్వహించే విషయంలో రాష్ట్రంలో ఏ పార్టీ ప్రభుత్వం ఉన్నా మెతక వైఖరికి ఆస్కారం ఉండే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. రాష్ట్రంలో ప్రత్యేక పరిస్థితి ఉందని, అధికార వైసిపి, ప్రధాన ప్రతిపక్షం టిడిపి రెండూ బిజెపి పట్ల సానుకూలంగా ఉన్నాయన్నారు. కోవిడ్‌ నేపథ్యంలో ప్రస్తుత మహాసభలు అసాధారణ పరిస్థితుల్లో జరుగుతున్నాయని కరత్‌ గుర్తు చేశారు. పార్టీ, ప్రజాసంఘాల కార్యకలాపాలకు, ఉద్యమాభివృద్ధికి కరోనా ఆటంకంగా తయారైందని పేర్కొన్నారు. విపత్కర పరిస్థితుల్లోనూ మోడీ ప్రభుత్వం తీసుకున్న విశాఖ ఉక్కు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పెద్ద ప్రజా ఉద్యమం జరుగుతోందన్నారు. ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో సైతం కోవిడ్‌ సహాయక చర్యలను పార్టీ, ప్రజాసంఘాలు నిర్వహించడం అపూర్వమని కరత్‌ అభినందించారు. భవిష్యత్‌లో మూడవ వేవ్‌ వస్తుందన్న వార్తలపై అప్రమత్తతతో పని చేయాలన్నారు. మహాసభల్లో జరిగిన చర్చలు భవిష్యత్‌ పోరాటాలకు స్ఫూర్తినిస్తాయన్నారు.