అసలు పేరు : శృతిహాసన్
పుట్టిన తేదీ : 1986, జనవరి 28
పుట్టిన ప్రాంతం : చెన్నై
చదువు : సైకాలజీ డిగ్రీ
తల్లిదండ్రులు : కమల్‌హాసన్, సారికా ఠాకూర్
సోదరి : అక్షరాహాసన్ (నటి)
హాబీ : పాటలు, సంగీతం
'ఒక ప్లాన్ ప్రకారం జీవితాన్ని గడపడంలో నాకు నమ్మకం లేదు. కష్టపడి పనిచేసి.. ఫలితాన్ని విధికే వదిలేస్తాను. ఎలాంటి పరిణామాల్నైనా ధైర్యంగా స్వీకరిస్తా' అని ఆశావహ దృక్పథాన్ని వ్యక్తం చేసింది అగ్ర కథానాయిక శృతిహాసన్. మూడేళ్లుగా తెలుగు చిత్రసీమకు దూరంగా ఉంటున్న ఈ తమిళ సోయగం 'క్రాక్' చిత్రం ద్వారా ఇటీవలే ప్రేక్షకుల్ని పలకరించింది. దిగ్గజ నటుడు కమల్‌హాసన్ వారసత్వాన్ని పుణికి పుచ్చుకుంది శృతి. కథ నచ్చితే చాలు సినిమా చిన్నదా? పెద్దదా? అని చూడకుండా చేసుకుంటూ పోతుంది. కెరీర్ పీక్స్‌లో ఉన్న సమయంలో ప్రేమలో పడి ఒడిదొడుకులకు లోనైన ఆమె బ్రేకప్ తర్వాత కోలుకోవడానికి చాలా సమయమే పట్టింది. ఫలితంగా 'కాటమరాయుడు' విడుదలైన మూడేళ్ల తర్వాత 'క్రాక్'తో తెలుగు ప్రేక్షకులను పలకరించింది. ఒక్కసారి నటించడం మొదలుపెడితే తనతో ఎవరూ పోటీకి రాలేరు అన్నట్లుగా మాస్ యాంగిల్ చూపిస్తూ జనాలతో ఈలలు వేయించింది. 'క్రాక్' సినిమా విజయం సాధించిన సందర్భంగా ఆమె సినీ, వ్యక్తిగత కెరీర్ గురించి ఓసారి చూసేద్దాం.
స్కూల్లో పూజా రామచంద్రం..
కమల్‌హాసన్-సారిక తొలి సంతానమే శృతిహాసన్. ఈమె చెల్లెలు అక్షరహాసన్. తనను అందరూ స్టార్ కిడ్‌గా ట్రీట్ చేయడం ఇష్టం లేని శృతి స్కూల్లో ఆమె పేరును పూజా రామచంద్రంగా చెప్పుకునేది. అలా ఆమె స్నేహితులను బురిడీ కొట్టించింది. టాలెంటెడ్ నటిగా అందరికీ సుపరిచితురాలైన శృతి ఎనిమిది భాషలు అనర్గళంగా మాట్లాడగలదు. పైగా ఈమె ఓ సైకాలజీ స్టూడెంట్. కానీ సినిమాల మీద ఆసక్తితో చదువుకు స్వస్తి పలికింది. 'హే రామ్' సినిమాలో తొలిసారి బాలనటిగా కనిపించింది. అనంతరం 'అనగనగా ఓ ధీరుడు' చిత్రంతో తెలుగు సినీ ఇండిస్టీకి పరిచయమైంది. అయితే ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద పరాజయాన్ని మూటగట్టుకుంది. ఆ తర్వాత తెలుగు, తమిళ చిత్రాల్లో నటించినా శృతిహాసన్ ఖాతాలో మంచి హిట్ పడలేదు.
గబ్బర్‌సింగ్‌తో బ్రేక్..
తర్వాత 2010లో ఇమ్రాన్‌ఖాన్ హీరోగా నటించిన 'లక్' సినిమాతో హీరోయిన్‌గా బాలీవుడ్‌లో అడుగు పెట్టింది. కానీ ఈ సినిమా పెద్దగా ఆడకపోవడంతో కెరీర్ మొదట్లోనే ఫ్లాప్ హీరోయిన్‌గా ముద్ర పడింది. అయినా సరే ఆమె నిరాశ చెందకుండా సినిమాలు చేసుకుంటూ పోయింది. తన మీద పడ్డ మచ్చను చెరిపేసుకునేందుకు ఎంతగానో కష్టపడింది. ఈ క్రమంలో తెలుగులో నటించిన 'గబ్బర్ సింగ్' ఆమెను స్టార్ హీరోయిన్‌గా నిలబెట్టింది. అయితే అప్పటివరకూ శృతిహాసన్‌ను ఐరన్ లెగ్‌గా భావించిన మేకర్స్ ఆమెను తీసుకునేందుకు ఇష్టపడలేదు. అయితే పవన్‌కల్యాణ్ ఒత్తిడి మేరకు ఫైనల్ చేశారట. ఆ తర్వాత చేసిన 'రేసుగుర్రం, శ్రీమంతుడు' బ్లాక్‌బస్టర్ హిట్ కావడంతో పాటు శృతికి తిరుగులేదు అన్న టాక్ వినిపించింది. అలాగే 'శ్రీమంతుడు' చిత్రానికి ముందు మహేష్‌బాబు రెండు చిత్రాలు ఫ్లాపయ్యాయి. 'క్రాక్' సినిమాకు ముందు రవితేజ వరుస ఫ్లాప్‌లు మూటగట్టుకున్నారు. వరుస ఫ్లాపుల్లో ఉన్న హీరోలకి సైతం శృతిహాసన్ నేనున్నానంటూ వచ్చి, హిట్ సినిమాలనందిస్తూ.. ఐరన్ లెగ్ కాదు.. గోల్డెన్ లెగ్ అనేలా చేసింది.
మ్యూజిక్ కంపోజ్, సింగింగ్, యాక్టింగ్..
తన సినిమాల్లో బోలెడన్ని పాటలు పాడిందీ హీరోయిన్. అంతేకాదు పాటలు రాసి, కంపోజ్ చేసే నైపుణ్యమూ ఆమె దగ్గర ఉంది. తన ఏడో ఏట నుంచే ఆమె మ్యూజిక్ నేర్చుకుందని స్వయంగా కమల్‌హాసనే ఓ ఇంటర్వ్యూలో వెల్లడించారు. బాలీవుడ్‌లో అర్జున్‌కపూర్, సోనాక్షి సిన్హా జంటగా నటించిన 'తేవార్'లో జోగానియా పాటను ఆలపించింది. తెలుగులో తన తండ్రి 'ఈనాడు' సినిమాకు ప్రచార గీతంలో గళం విప్పిన శృతి 'ఓ మై ఫ్రెండ్, త్రీ, రేసుగుర్రం, ఆగడు' చిత్రాల్లోనూ పాడి ఆకట్టుకుంది. బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన ఈ భామ 'ఓ మై ఫ్రెండ్' కోసం ప్రత్యేకంగా కూచిపూడి నేర్చుకుంది. తెలుగు, తమిళ, హిందీ సినిమాల్లో నటించిన ఆమె ప్రస్తుతం 'సలార్'తో పాటు 'వకీల్‌సాబ్'లోనూ నటిస్తోంది.
తల్లి పాత్ర చేయాలా? వద్దా?
'తెలుగులో దాదాపు మూడేళ్ల తర్వాత మంచి విజయం లభించడం సంతోషంగా ఉంది. విమర్శకులు మొదలుకొని సోషల్‌మీడియా వేదికల్లో సినిమా బాగుందనే ప్రశంసలు లభిస్తున్నాయి. నేను పోషించిన కల్యాణి పాత్ర ప్రతి ఒక్కరికీ కనెక్ట్ అవుతోంది. అయితే కథ విన్నప్పుడు తల్లి పాత్ర చేయాలా? వొద్దా? అనే ఆలోచన అస్సలు రాలేదు. ఏవో లెక్కలు వేసుకొని సినిమాలు చేయడం పాతకాలపు సిద్ధాంతం. నా కెరీర్ ఆరంభం నుంచి పాత్రలపరంగా ప్రయోగాలు, సవాళ్లకు ఎప్పుడూ సిద్ధంగా ఉన్నా. నా మిత్రబందంలోనే చాలామంది పెళ్లి చేసుకొని, తల్లులైన వారున్నారు. నేటి చిత్రసీమను పరిశీలిస్తే కొందరు నాయికలు పెళ్లయ్యాకా విజయవంతంగా కెరీర్‌ను కొనసాగిస్తున్నారు. అగ్ర కథానాయికలు తల్లి, భార్య పాత్రలు చేయకూడదనే ఆలోచనకు ఎప్పుడో కాలం చెల్లింది. మన దేశంలో గొప్ప బాధ్యతతో కూడిన ఉద్యోగం చేస్తున్నది మాతృమూర్తులే. సంసారాన్ని చక్కదిద్దుతూ, పిల్లల బాగోగుల్ని చూసుకుంటూ ఎవరూ మోయలేని భారాన్ని మోస్తున్నారు. కష్టాల్ని భరిస్తూ ఇతరుల జీవితాల కోసం తపిస్తున్నారు!' అని చెప్తోంది శృతి.
బ్రేక్ అవసరం అనిపించింది...
'నా జీవితాన్ని తరచి చూసుకోవడానికి, సృజనాత్మకంగా నన్ను నేను కొత్తగా ఆవిష్కరించుకోవడానికి బ్రేక్ అవసరం అనిపించింది. నా దృష్టిలో ప్రతి రంగంలోనూ ఏదో ఒక సమయంలో కాస్త విరామం తీసుకుంటే బాగుంటుంది. నాకు నటనతో పాటు సంగీతంలో ప్రావీణ్యం ఉండటంతో మ్యూజిక్ వైపు దృష్టిపెట్టాలనే ఆలోచనతో సినిమాలకు విరామం తీసుకున్నా. నా వద్దకు వచ్చిన సినిమా కథలు, పాత్రలు నచ్చకపోవడమూ విరామానికి మరో కారణమైంది. ఈ రెండేళ్ల గ్యాప్‌లో మానసిక స్వాంతన దొరికిందనే సంతృప్తి మిగిలింది. జీవితంలో ప్రతి విషయానికీ 'యస్' చెప్పడంలో విశేషమేమీ ఉండదు.. ఏదైనా నచ్చకుంటే నిర్మొహమాటంగా 'నో' చెప్పడంలోనే నిజమైన ధైర్యం ఉంటుందన్న విషయం తెలిసొచ్చింది. అలా ఏదైనా నచ్చకుంటే తిరస్కరించే గుణాన్ని ఈ విరామంలో అలవర్చుకున్నా!' అంటున్నారు శృతి.