పేరు : దేవిశ్రీ ప్రసాద్
ఇతర పేర్లు : దేవి
పుట్టిన తేది : ఆగస్టు 2, 1979
వృత్తి : సంగీత దర్శకత్వం, గాయకుడు
తల్లిదండ్రులు : సత్యమూర్తి, శిరోమణి
సోదరుడు : సాగర్ (గాయకుడు)
సోదరి : పద్మిని
ప్రస్తుతం టాలీవుడ్ ఇండిస్టీలో ఉన్న టాప్ సంగీత దర్శకుల్లో దేవిశ్రీప్రసాద్ ఒకరు. ఆయన బాణీలు అందించిన పాటల్లో ఏదో ఒకపాటను కచ్చితంగా సంవత్సరం పొడవునా ప్రేక్షకులు హమ్ చేస్తూ ఉంటారు. అందుకే ఆయన రాక్‌స్టార్ అయ్యారు. రెండు దశాబ్దాల స్వరగంగా ప్రవాహంలో ఆణిముత్యాల్లాంటి సినీగీతాలతో సంగీతకారుడిగా తిరుగులేని స్థానాన్ని సంపాదించుకున్నారు. ఆయన సంగీత ప్రయాణం ఎలా సాగిందో తెలుసుకుందాం.
'సంగీత దర్శకుల మధ్య పోటీ గురించి వచ్చే వార్తల్ని నేనెప్పుడూ పట్టించుకోను. స్టూడియోనే నా ప్రపంచం. స్టూడియో ఆవల ఏం జరుగుతుందో అస్సలు తెలియదు. నా గురించి రాసినవే కాదు ఇతరులపై వచ్చిన వార్తలూ చదవను. అదే నాకు ప్లస్ పాయింట్. సంగీతంలోని తప్పొప్పుల్ని ఎక్కువగా నా టీమ్ ద్వారా తెలుసుకుంటా. సోదరుడు సాగర్‌తో పాటు ఇతర ఇంజినీర్స్ నా బాణీల గురించి తమ అభిప్రాయం ఏదైనా నిర్మొహమాటంగా చెబుతుంటారు. నేను సమకూర్చిన పాట బాగుందనే దృఢమైన నమ్మకం నాలో ఉంటే, ఎవరు చెప్పినా వెనక్కి తగ్గను. ఇతర సంగీత దర్శకులు సమకూర్చిన పాటలు నచ్చితే వారినీ అభినందిస్తాను. ఈ మంచి లక్షణం నాన్న నుంచే అలవడింది. ఎదుటివారి ప్రతిభ చూసి ఎప్పుడూ అసూయపడను. ఇతరుల నుంచి స్ఫూర్తి పొందుతూ మంచి సంగీతం అందించడానికి శ్రమిస్తుంటా' అంటారు దేవిశ్రీ.
ప్రేమ, భక్తి, మాస్ పాట ఏదైనా ఒకేలా స్వీకరిస్తూ సందర్భానికి తగిన సంగీతాన్ని సమకూరుస్తుంటారు దేవీశ్రీ. 'కంపోజ్ చేసే పాటలన్నింటినీ ప్రణయ గీతాలుగానే భావిస్తా. సంగీతంపై నాకున్న ఎనలేని ప్రేమాభిమానాల వల్ల ప్రతి జోనర్‌లో మంచి పాటలు అందించగలిగాను. నా పాటలను శ్రోతలు బాగా ఆదరించారు. చిరంజీవి, బాలకృష్ణ, మహేష్‌బాబు మొదలుకొని అగ్రహీరోలు అందరికీ ఎప్పటికీ నిలిచిపోయే సిగేచర్ ట్యూన్ ఇచ్చే అదృష్టం నాకే దక్కింది' అంటారు దేవీశ్రీ.
కథే ముఖ్యం..
స్టార్స్, ఇమేజ్‌లతో పట్టింపు లేకుండా కథలను నమ్ముతూనే కెరీర్ ఆరంభించి సంగీత దర్శకుడిగా ఎదిగారు దేవీశ్రీ. మంచి కథే చక్కటి బాణీలు అందించేలా సంగీత దర్శకుల్లో స్ఫూర్తి నింపుతుంది. ముందుగా కథ విని, అందుకు తగినట్లుగానే ఎలాంటి సంగీతాన్ని అందించాలో ఆలోచిస్తారాయన. ఆ తర్వాతే హీరోల స్టార్‌డమ్, వారి ఫాలోయింగ్‌కు తగిన ఎలిమెంట్స్‌ను జోడిస్తూ బాణీలు కడతారు. హీరో నుంచి అభిమానులు ఏం కోరుకుంటారో పరిశీలిస్తూ తగిన హంగులతో పాటలు సిద్ధం చేస్తారు.
కొత్తదనం ఉండేలా..
'నా విషయంలో మాత్రం ఏ దర్శకుడితో పనిచేసినా నా స్వరాల్లో కొత్తదనం, వైరుధ్యం ఉండేలా జాగ్రత్తపడతా. దర్శకులు ఎంచుకునే కథలు, వాటి నేపథ్యాలతో పాటు ఆయా దర్శకుల ఆలోచన విధానాన్ని అనుసరించీ సినిమా సంగీతం ఆధారపడి ఉంటుందని నేను నమ్ముతా. టైమ్ వచ్చినప్పుడు నా పెళ్లి గురించి నేనే అందరికీ చెబుతా. లాక్‌డౌన్ విరామం వ్యక్తిగతంగా నాకు ఎంతో ఉపయోగపడింది. నేటి ఆధునిక యుగంలో జీవనగమనం వేగవంతంగా మారింది. మన పరుగును ఆపి, జీవితాన్ని తరచి చూసుకునే అవకాశం లాక్‌డౌన్‌తో దొరికింది. ఈ విరామంలో బిజీలైఫ్ కారణంగా ఇన్నాళ్లు ఏం మిస్సయ్యానో, చేయాల్సిన పనులు ఏమున్నాయో విశ్లేషించుకున్నా. బాధ్యతలు, కోరికలు, గోల్స్ చాలా మిగిలిపోయాయి. వాటన్నింటితో ఓ జాబితాను సిద్ధంచేశాను. ఓ ప్రణాళిక ప్రకారమే కొత్త ఏడాదిని ప్రారంభించాను. ఈ ఏడాది సినిమాలతో పాటు చాలా పనులు చేయబోతున్నా. అవి అందరికీ నచ్చుతాయని అనుకుంటున్నా' అంటున్నాడు దేవీశ్రీ.
సంగీతంలోనే సేదతీరుతా..
'సంగీతపరంగా మైఖేల్ జాక్సన్, ఇళయరాజాను ఆరాధిస్తాను. నిరంతరం సంగీతంలోనే సేదతీరుతాను. ఏ పనైనా సంగీతం వింటూ చేయడం నాకు అలవాటు. ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ అయ్యే సమయంలో ఇళయరాజా పాటలు వినేవాణ్ణి. ప్రతీ విషయాన్ని పాట రూపంలో అన్వయించుకుంటాను. నేను సంగీత దర్శకుడినైతే తొలిపాటను బాలుగారితోనే పాడించాలని అనుకున్నా. 'దేవి' సినిమాతో ఆ కలను నిజం చేసుకున్నా. నేను స్వరపరచిన వాటిలో 'నాన్నకు ప్రేమతో' పాటంటే ఆయనకు చాలా ఇష్టం. ఆ పాటను తన గాత్రంతో నా మ్యూజిక్ స్టూడియోలో రికార్డ్ చేయాలని అనుకున్నారు. గతేడాది మా నాన్న పుట్టినరోజు నాడు ఈ పాటను రికార్డ్ చేయాలని భావించాం. కానీ, లాక్‌డౌన్ వల్ల వీలుపడలేదు. ఆయన మరణంతో ఆ కోరిక తీరకుండా పోయింది. అదో పెద్ద వెలితిగా ఉండిపోయింది. బాలుగారు మరణించిన కొద్ది రోజులకు 'ఉప్పెన'లోని 'రంగులద్దుకున్న..' పాటను విడుదల చేశాం. ఆయన బతికుంటే ఈ పాట విని, నన్ను తప్పకుండా అభినందించేవారు. ఆ ఆలోచనతోనే ఈ పాటను బాలుగారికి అంకితమిచ్చాం. లాక్‌డౌన్‌లో వీడియో ఎడిటింగ్ నేర్చుకున్నా. కళాకర్షణ్ సాఫ్ట్‌వేర్ గురించి తెలుసుకున్నా. సింగిల్స్ ట్రెండ్‌ను చిరంజీవిగారి ''ఖైదీ నంబర్ 150''తో నేనే మొదలుపెట్టాను. చిరంజీవిగారు పునరాగమనం చేస్తున్న సినిమా కావడంతో ప్రత్యేకత ఉండాలని సింగిల్స్ రూపంలో పాటలు విడుదల చేశాం. ప్రస్తుతం అందరూ ఈ సింగిల్ విధానాన్ని అనుసరించడం మొదలెట్టారు. సింగిల్స్ ట్రెండ్ వల్ల సంగీత దర్శకులపై చాలా ఒత్తిడి ఉంటుంది. సుదీర్ఘ అనుభవం గడించిన తర్వాతా, ఆ సవాళ్లను జయించే ధైర్యం లేకపోతే ఏదీ సాధించలేమని నమ్ముతాను. పాట హిట్ అవుతుంది, అందరికీ నచ్చుతుందనే నమ్మకం, ధైర్యంతోనే బాణీల్ని అందిస్తుంటాను' అంటున్నారు దేవీశ్రీ.