'ఫ్యూడల్ సమాజపు శిథిలాల నుండి ఉద్భవించిన ఆధునిక బూర్జువా సమాజం... వర్గ వైరుధ్యాలను నిర్మూలించలేదు. అది చేసిందల్లా పాత వర్గాలకు బదులు కొత్త వర్గాలనూ, పాత దమన పద్ధతులకు బదులు కొత్త దమన పద్ధతులనూ, పాత పోరాట రూపాలకు బదులు కొత్త పోరాట రూపాలను నెలకొల్పడం మాత్రమే' - అని మార్క్స్ అన్నాడు. ఫ్యూడల్ సమాజంలో జూదం పాలకవర్గాలకు వినోద క్రీడ. అది అప్పుడు పాలకులకు ధర్మం. కానీ, ఆ జూదమే నేటి ఆధునిక బూర్జువా సమాజంలో కొత్త రూపాలను సంతరించుకుంది. పేకాట, కోడిపందేలు, క్యాసినో, మట్కా, ఆన్‌లైన్ బెట్టింగ్ వంటివి నాటి అవశేషాలే. వీటన్నింటిని తలదన్నింది స్టాక్‌మార్కెట్. అది మనిషి విలువలను రూపాయల్లోకి మార్చింది. పెట్టుబడిదారీ విధానంలో కష్టపడేవాడికి, సృజనకు, మేధస్సుకు విలువ వుండదు. ఎవరి మేధస్సు పెట్టుబడిదారునికి ఉపయోగపడుతుందో..ఆ మేధస్సుకే విలువ వుంటుంది.
ఇటీవల స్టాక్‌మార్కెట్‌లో నెలకొన్న అనిశ్చితి మదుపర్లను హడలెత్తించింది. మూడు రోజుల్లో దాదాపుగా రూ.20 లక్షల కోట్లు ఆవిరైపోయాయని అంచనా. అయినా... షేర్‌మార్కెట్ వెంట పరుగులు పెట్టేవారిని తెలివిగలవారిగాను, పండితులుగానూ పొగుడుతున్నారు. తెలివైన వారు తమ తెలివితో పెట్టుబడి పెట్టి సంపాదించే చోటుగా దీన్ని అభివర్ణిస్తున్నారు. చట్టరీత్యా స్టాక్‌మార్కెట్ జూదం కాదు. ఇది నయా ఉదారవాద సంస్కృతి. పెట్టుబడితో సంబంధం లేకుండా, ఉత్పత్తి క్రమం లేకుండా, కష్టపడకుండా తేలిగ్గా డబ్బులు సంపాదించొచ్చు అనేది నయా పెట్టుబడిదారీ విధానం. స్టాక్‌మార్కెట్ అనే జూదంలో ఎప్పుడూను బడా కార్పొరేట్లే గెలుస్తుంటారు. వారి సంపద పెరుగుతూనే వుంటుంది. అయినా మధ్యతరగతి ప్రజలు స్టాక్‌మార్కెట్‌లో పెట్టుబడి పెడుతూనే వుంటారు. దీపం చుట్టూ తిరిగే శలభాల్లా మాడిపోతుంటారు. దీనికి కారణం.... ఆశ. అయస్కాంతం ఎలాగైతే ఇనుముని ఆకర్షిస్తుందో...పెట్టుబడిదారీ సమాజంలో పెద్ద పెట్టుబడి చిన్న పెట్టుబడిని కూడా అదేరకంగా ఆకర్షిస్తుంది. ఈ ఆకర్షణ శక్తి పెరిగే కొద్దీ ఆశ కూడా పెరుగుతుంది. కష్టపడకుండా తక్కువ సమయంలో ఎక్కువ డబ్బు సంపాదించాలనే ఆశ. దీనికి కారణం... కష్టమంటే ఒక యావగింపు, కష్టం పట్ల, శ్రమ పట్ల, సంపద ఉత్పత్తి పట్ల చిన్నచూపు.
ఒక సంవత్సరంలో దేశం ఉత్పత్తి చేసే సంపద సుమారుగా రూ.150 లక్షల కోట్లు పైగా వుంటుంది. దేశం మొత్తం కలిసి ఉత్పత్తి చేసే సంపద ఒక రోజులో రూ.50 వేల కోట్లు అయితే, మూడు రోజుల్లో అవిరైపోయింది 20 లక్షల కోట్లు. అంటే రెండు నెలల దేశ ప్రజలందరి కష్టం... మూడు రోజుల్లో ఒక రెండు వందల కంపెనీలకు సంబంధించిన షేర్‌మార్కెట్లు ఆర్పేశాయి. ఈ స్టాక్‌మార్కెట్ జూదంలో పెట్టుబడులు పెట్టి, ఓడిపోతున్నవారు ఎప్పటికప్పుడు మారిపోతుంటారు. కానీ...ఈ సంపదనంతా గెలుచుకుని, దోచుకుంటున్న సంస్థలు మాత్రం ఎప్పుడూ అవే వుంటాయి. ఈ క్రమంలో ప్రతిసారీ సమిధలుగా మారుతున్నది సామాన్యులే. ధర్మరాజు జూదంలో ఓడిపోయిన రాజ్యాన్ని యుద్ధంలో గెలుచుకున్నాడు తప్ప, జూదం ద్వారా కాదు. అధర్మాన్ని జూదం ద్వారా ధర్మం ఎప్పుడూ గెలవలేదు. యుద్ధం చేస్తేనే గెలుస్తుంది. ఈ అధర్మ పెట్టుబడిదారీ వ్యవస్థలో జూదంతో డబ్బు సంపాదించాలని సామాన్యులు ఎవరు అనుకున్నా... మునిగిపోవడం ఖాయం. జూదాల పైన ఆధారపడిన ఆర్థిక వ్యవస్థను నాశనం చేయాల్సిందే. ప్రత్యామ్నాయ విలువల కోసం నిజమైన శ్రమజీవన సౌందర్యం కోసం కృషి చేయాల్సిన అవసరం మరింత ఎక్కువైంది. ఈ వ్యవస్థనే నాశనం చేసి, ఇలాంటి దుర్మార్గాలు, జూదాలు లేని ఒక వ్యవస్థను సృష్టించుకోవాలి.










