ప్రజాశక్తి-జక్కా వెంకయ్య, టి. నర్సింహయ్య, సున్నం రాజయ్యనగర్ (తాడేపల్లి) : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో దళితులపై దాడులు జరిగిన, వివక్ష చూపిన అనేక సందర్బాల్లో పోరాటాలు నిర్వహించామని, అలాగే నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి చొరవ చూపించామని సిపిఎం రాష్ట్ర మహాసభ రెండోరోజు జరిగిన చర్చల్లో పలువురు ప్రతినిధులు చెప్పారు. పశ్చిమ అప్‌ల్యాండ్ ప్రతినిధులు టి రామకృష్ణ, ప్రసాద్ మాట్లాడుతూ ఏజెన్సీలోని పద్మంవారిగూడెంలో గిరిజన భూములను గిరిజనేతరులకు కట్టబెట్టాలనే పోలీసు, రెవెన్యూ అధికారుల దుర్మార్గాన్ని బయటపెట్టి ఆందోళన నిర్వహించడంతో 12 మందిపై హత్యాయత్నం కేసులు అక్రమంగా పెట్టారని, నలుగురిని జైలులో నిర్బంధించారని చెప్పారు. రాజమహేంద్రవరం ప్రతినిధులు ఐ వెంకటేశ్వరరావు, టి తులసీ మాట్లాడుతూ ..విభజనతో పాటు విలీన సమస్యలను ఏజెన్సీలో ఎదుర్కొంటున్నామని, నిర్వాసితులకు పరిహారం ఇవ్వకుండా కాఫర్‌డ్యామ్, స్పిల్‌వే పనులు పూర్తి చేయడంతో కొద్దిపాటి వరద వచ్చినా పునరావాస కాలనీలు ముంపునకు గురవుతున్నాయని, అధికారులు పట్టించుకోకపోవడంతో సిపిఎం తరపున పడవల్లో వెళ్లి వారికి కావలసిన నిత్యావసర సరుకులు, వైద్యం అందించామని చెప్పారు. ఎయిడెడ్‌గా ఉన్న కందుకూరు విద్యాసంస్థలను ప్రయివేట్‌పరం చేయడానికి చేస్తున్న ప్రయత్నాలను తిప్పికొట్టడంతో ఐదుగురిపై అక్రమ కేసులు బనాయించారని చెప్పారు.
అనంతపురం ప్రతినిధులు సావిత్రి, కృష్ణమూర్తి మాట్లాడుతూ... పండ్ల తోటల్లో 4 లక్షల మొక్కలు ఎండిపోయిన సందర్భంలో నష్టపరిహారం ఇప్పించామని చెప్పారు. రైతు రక్షణ పాదయాత్ర 820 కిలోమీటర్ల పరిధిలో 129 గ్రామాల మీదుగా కొనసాగిందని, 18 మండలాల్లో ఉపాది హామీలపై ఆందోళనలు నిర్వహించామని చెప్పారు. హిందూపురం ప్రతినిధి దిల్‌షాద్ మాట్లాడుతూ...కియా అనుబంధ పరిశ్రమ కోసం 5 గ్రామాల అవసరాలను తీర్చే మంచినీటి చెరువును పూడ్చేందుకు చేసిన ప్రయత్నాలను మూడు నెలల పాటు పోరాటంతో అడ్డుకున్నామని చెప్పారు. సెజ్‌ల పేరిట 10 మండలాల్లో 40 వేల ఎకరాలను ప్రభుత్వం రైతుల నుండి స్వాధీనం చేసుకున్నప్పటికీ ఎటువంటి పరిశ్రమలూ ఏర్పాటుచేయలేదని, భూములు వెనక్కితిరిగి ఇవ్వకపోవడంతో..పోరాడి 1400 ఎకరాలను స్వాధీనం చేసుకుని ఆయా రైతులకు ఇప్పించామని చెప్పారు.
తూర్పు ప్రకాశం ప్రతినిధి ఎం ఆంజనేయులు మాట్లాడుతూ పేదలకు ఇళ్లస్థలాలు, రోడ్డు విస్తరణ బాధితులకు పరిహారం ఇప్పించడానికి పలు ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించామని, మిర్చి, మినుము తెగుళ్ల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇప్పించాలని ఆందోళన చేశామని చెప్పారు. పశ్చిమ ప్రకాశం ప్రతినిధి సోమయ్య మాట్లాడుతూ వెలుగొండ నిర్వాసితులకు పరిహారం గురించి నిర్వహించిన పాదయాత్రకు ప్రజల నుండి స్పందన లభించిందని, ఉపాధి బిల్లులు, భూసమస్యలపైనా ఆందోళన చేశామని చెప్పారు. నంద్యాల ప్రతినిధులు నాగేశ్వరరావు, ఎ నాగరాజు మాట్లాడుతూ.... ఎన్‌ఆర్‌సి., సిఎఎలపై 15 వేల మందితో భారీ ఎత్తున సభ నిర్వహించడంతో ముస్లిం మైనార్టీల్లో పలుకుబడి పెరిగిందని, ఉపాధి హామీ పనులు, బకాయిల గురించి ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌రెడ్డి, నందికొట్కూరుల్లో ఎమ్మెల్యే నివాసగృహాలను సైతం ముట్టడించామని చెప్పారు.
స్టీల్‌ప్లాంట్ పరిరక్షణతో పాటు మున్సిపల్ కార్మికులు సహా వివిధ కార్మికుల సమస్యలపై పెద్దఎత్తున ఆందోళనా కార్యక్రమాలు నిర్వహించినట్లు విశాఖ అర్బన్ ప్రతినిధులు డి పద్మ, ఆర్‌విఎస్ కుమార్ చెప్పారు. ఎల్‌జి పాలిమర్స్ దుర్ఘటన విషయంలో మన ఆందోళన వల్ల అది అంతర్జాతీయ సమస్యగా మారి 12 దేశాల్లో కార్మికులు పెద్దఎత్తున ఆందోళనకు దారితీసిందని వివరించారు. పార్వతీపురం ప్రతినిధులు రెడ్డి వేణు, గంగునాయుడు మాట్లాడుతూ భూ సమస్యలపై 6 మండలాల్లో 10 కేంద్రాల్లో పోరాటాలు నిర్వహించినట్లు తెలిపారు. చెరకు రైతుల సమస్యపై ప్రధానంగా ఎంసిఎస్ పరిశ్రమ మూసివేతకు నిరసనగా ఆందోళన చేయగా.... సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గసభ్యులు ఎం కృష్ణమూర్తి సహా ఆరుగురిని ఆరురోజులపాటు జైలులో నిర్బంధించారని వివరించారు. విజయనగరం ప్రతినిధి వి లక్ష్మీ మాట్లాడుతూ.... స్టీల్‌ప్లాంట్ ప్రయివేటీకరణను ఉపసంహరించాలని, మూడు నల్ల చట్టాలను రద్దు చేయాలని 28 గ్రామాల్లో సభలు ఏర్పాటుచేయడమేగాక జీపు జాతా నిర్వహించినట్లు చెప్పారు.
ఎయిడెడ్ విద్యాసంస్థల పరిరక్షణలో భాగంగా ఎంఆర్ కళాశాల పరిరక్షణ కోసం ఆందోళన చేయగా విద్యార్థినాయకుడికి కాలు ఫ్రాక్చర్ అయిందని తెలిపారు. కాకినాడ ప్రతినిధి రాజశేఖర్ మాట్లాడుతూ...వరదలు వచ్చినప్పుడు పార్టీ కార్యాలయాల్లోనే శిబిరాలు నిర్వహించి పేదలకు భోజన వసతి సదుపాయాలు ఏర్పాటుచేశామని వివరించారు. జిల్లాలో వివిధ చోట్ల దళితులపై వివక్ష కొనసాగిన సందర్భాల్లో వెంటనే స్పందించి ... దాడులకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకునేలా అధికార యంత్రాంగంపై వత్తిడి చేసినట్లు చెప్పారు. రాజధాని ప్రాంతంలో పారిశుద్య కార్మికుల వేతనాల సమస్యపై ఆందోళన చేశామని, మున్సిపల్ కార్మికుల ఆందోళన సందర్భంగా జైలు నిర్బంధానికి గురయ్యామని తూర్పు గుంటూరు ప్రతినిధి ఎం రవి చెప్పారు. మంగళగిరి, తాడేపల్లి ప్రాంతాల్లో కరోనా బాధితులకు సేవలందించడమేగాక ఎవరికైనా భోజనం కావాల్సి వస్తే...వారి ఇంటికే సరఫరా చేశామని తెలిపారు. భవన నిర్మాణ కార్మికులు, స్పిన్నింగ్, సున్నం మిల్లుల్లో పనిచేస్తున్న కార్మికుల సమస్యలపై పోరాటాలు నిర్వహించినట్లు పశ్చిమ గుంటూరు ప్రతినిధి ఎ లక్ష్మీశ్వరరెడ్డి చెప్పారు. కౌలు రైతులను ఆదుకోవాలని కోరుతూ పాదయాత్ర నిర్వహించడమేగాక భారీ ఎత్తున ధర్నా నిర్వహించినట్లు చెప్పారు. చిత్తూరు ప్రతినిధి శ్రీనివాసులు మాట్లాడుతూ.. మదనపల్లిలో మూడనమ్మకాలతో కుమార్తెలను తల్లిదండ్రులే చంపేసిన సందర్భంలో... మూఢనమ్మకాలకు వ్యతిరేకంగా కార్యక్రమాలు నిర్వహించామని, 4 మండలాల్లోని 6 చోట్ల భూ సమస్యలపై పోరాడామని చెప్పారు.
శ్రీకాకుళం ప్రతినిధి తిరుపతిరావు మాట్లాడుతూ....ఈ నాలుగేళ్లలో భూ పోరాటాలు నిర్వహించామని, తిత్లీ తుపానుకు పంటలు నష్టపోయిన గిరిజనులకు నష్టపరిహారం ఇప్పించడంలో కృషి చేసినట్లు, జీడికి గిట్టుబాటుధర కల్పించడానికి, మొక్కజొన్న కొనుగోలు చేసేలా ఉద్యమాలు నిర్వహించినట్లు చెప్పారు. వంశదార నిర్వాసితుల సమస్యపై మంత్రులకు, ఎమ్మెల్యేలకు పలుమార్లు వినతిపత్రాలు అందజేసినట్లు వివరించారు.










